అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శనివారం నాటి ప్రెస్ మీట్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రని, వాస్తవ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణ వ్యయాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ విస్టా మరియు పొరుగున ఉన్న తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చులతో పోల్చి విశ్లేషించారు.
తెలంగాణ సచివాలయం కంటే తక్కువ ఖర్చు
అమరావతిలో చదరపు అడుగుకి రూ.12,000 ఖర్చవుతోందని.. ఇతర చోట్ల అంత ఖర్చు కాలేదని వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని మంత్రి కొట్టిపారేశారు. నిజానికి తెలంగాణ సచివాలయానికే రూ.13,000 పైగా ఖర్చయిందని, ఢిల్లీ పార్లమెంట్ భవన సముదాయానికి రూ.16,000 వరకు వ్యయమైందని ఆధారాలు విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతికి ఈ ఖర్చు ఏమాత్రం ఎక్కువ కాదని, పైగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులను నిలిపివేయడం వల్ల స్టీల్, సిమెంట్, సహా ముడిసరుకుల ధరలు 40 నుండి 80 శాతం వరకు పెరిగాయని, ఈ అదనపు భారం వైసీపీ నిర్వాకమేనని ఆయన మండిపడ్డారు.
రుషికొండ ప్యాలెస్ కు ఎస్ఎఫ్టీకి రూ. 35,741
వైసీపీ చేస్తున్న విమర్శల్లోని డొల్లతనాన్ని ఎండగడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన విలాసాల కోసం రుషికొండపై నిర్మించుకున్న ప్యాలెస్ ఖర్చును నారాయణ ప్రస్తావించారు. అక్కడ చదరపు అడుగుకి ఏకంగా రూ. 35,714వెచ్చించారని, ప్రజా రాజధానికి అయ్యే ఖర్చుపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని విమర్శించారు. అమరావతిలో నిర్మిస్తున్నవి కేవలం కార్యాలయాలు మాత్రమే కాదని, రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న ఐకానిక్ కట్టడాలని ఆయన స్పష్టం చేశారు.
నిర్మాణ పురోగతి – స్పష్టమైన గడువు
కేవలం మాటలకే పరిమితం కాకుండా, అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఉన్నతాధికారుల నివాస భవనాలు 90శాతం పూర్తయ్యాయని, మే చివరి నాటికి అవి సిద్ధమవుతాయని ప్రకటించారు. 2027 నాటికి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2028 నాటికి ఐకానిక్ టవర్లను పూర్తి చేస్తామన్న స్పష్టమైన గమ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇందులో ఎక్కడా ప్రజాధనం దుర్వినియోగం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వైసీపీ తప్పుడు లెక్కలను తెరపైకి తెచ్చిందని, కానీ ఇతర రాష్ట్ర, జాతీయ ప్రాజెక్టులతో పోల్చినప్పుడు అమరావతి వ్యయం సహేతుకమేనని స్పష్టమవుతోంది. ఇవి తప్పు అయితే వైసీపీ నిరూపించాల్సి ఉంది.


