తెతెదేపా దుస్థితిపై అమిత్‌షా ఆరాలు!

చంద్రబాబునాయుడు రెండు రోజుల కిందట ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు అక్కడ పర్యటించారు. కేంద్రమంత్రులను, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను, ప్రధానిని పలువరు ప్రముఖులను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం చాలా సాధించుకు రావడానికి ఈ భేటీలు వేసినట్లుగా ఆయన చాటుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ప్రధాని మంత్రులతో సమావేశం అయిన సమయంలో.. రాష్ట్రం అభివృద్ధి కోసం మంతనాలే జరిగి ఉంటాయి గానీ.. అమిత్‌షాతో భేటీలో మాత్రం పూర్తిగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రత్యేకించి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పతనం, దాని పర్యవసానంగా యావత్తు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరాలు తీసినట్లుగా తెలుస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు గురించి భాజపా స్థానిక నాయకత్వం తొలినుంచి తీవ్రమైన వ్యతిరేకతతోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అయితే తన విబేదాల్ని దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు కూడా! ఇలాంటి నేపథ్యంలో.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పతనం కావడాన్ని భాజపా భిన్నమైన దృక్కోణంలో చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో తెదేపాతో పొత్తులు కొనసాగించాలా వద్దా అనే కోణంలో వారు ఆలోచిస్తున్నారని సమాచారం.

తెదేపాతో పొత్తుల వల్ల భాజపా కూడా ఎదగకుండా చతికిలపడుతుందని.. ప్రజల దృష్టిలో పలుచన అవుతుందని స్థానిక నాయకులు కేంద్ర నాయకత్వానికి నివేదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశంపై ప్రజల్లో నమ్మకం పూర్తి గా సడలిపోయిందని, వారితో జట్టు కట్టడం వల్ల తమకు కూడా నష్టమే ఎక్కువ అని వారు అధిష్టానానికి తెలియజేస్తున్నారు. ఎంత ఎక్కువగా తెదేపాతో అంటకాగితే పార్టీకి అంత నష్టం అని వారు భావిస్తున్నారు. అర్జంటుగా వారిని వదిలించుకుంటే.. తెలంగాణలో భాజపాను బలమైన ప్రతిపక్షంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందనే వాదన ఇక్కడి పార్టీలో ఉన్నది. ప్రస్తుతం తెదేపా అంతరించిపోగా, కాంగ్రెస్‌ పార్టీ కూడా కునారిల్లుతున్నదని, తాము స్వతంత్రంగా వ్యవహరిస్తే భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పార్టీ నాయకత్వం చెబుతున్నదిట.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వచ్చినప్పుడు అమిత్‌షా తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటూ ఆరాలు తీసినట్లు తెలుస్తోంది. మోడీ, అమిత్‌ కాంబినేషన్‌లో పార్టీ పోకడలు చాలా స్థిరంగానే ఉంటాయి. తమకు ఉపయోగపడేట్లయితేనే పొత్తులు కొనసాగిస్తారు తప్ప.. తమకు భారం అవుతారని అనుకుంటే వదిలించుకుంటారని అంతా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com