చిరు సినిమాలో అమితాబ్… నిజ‌మెంత‌?

చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి’లో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా న‌టిస్తున్నాడంటూ ఓ వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాని చిరు బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌నుకొంటున్నాడ‌ని, అందుకే అమితాబ్ స‌హాయం తీసుకోవాల‌ని చూస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాంతో ‘ఉయ్యాల వాడ‌’లో బిగ్ బీ ఏ పాత్ర చేయొచ్చు?? ఆయ‌న ఎంత సేపు క‌నిపించొచ్చు? అనుకొంటూ మెగా అభిమానులు కూడా ఆరాలు తీస్తున్నారు.

‘బుడ్డా’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ సారి అమితాబ్ బ‌చ్చ‌న్ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో వేదిక‌పై చిరు కూడా ఉన్నాడు. చిరు 150వ సినిమా చేస్తారా? లేదా? అంటూ జోరుగా చ‌ర్చ సాగుతున్న రోజుల‌వి. ‘చిరు 150వ సినిమా చేయాలి… ఆయ‌న న‌టిస్తానంటే నేను ఓ చిన్న పాత్ర చేయ‌డానికి సిద్ధ‌మే’ అంటూ ఆ సంద‌ర్భంలో మాట ఇచ్చాడు బిగ్ బీ. ‘ఖైది నెం.150’లో బిగ్‌బీని వాడుకొనే అవ‌కాశం రాలేదు. దాంతో ‘ఉయ్యాల‌వాడ‌’లో బిగ్ బీ ఎంట్రీ త‌ప్ప‌ని స‌రి అంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అంతే త‌ప్ప‌.. చిత్ర‌బృందంలో ఇప్ప‌టి వ‌ర‌కూ అమితాబ్ గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌నా రాలేద‌ని టాక్‌. బాలీవుడ్ హీరోయిన్ గురించి మాత్రం గ‌ట్టిగా చ‌ర్చించుకొంటున్న టీమ్‌… అమితాబ్ ప్ర‌స్తావ‌న తీసుకురాలేద‌ని, అస‌లు ఆ ఉద్దేశ‌మే లేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ చిరు అడిగినా.. బిగ్ బీ ఏదో కార‌ణం చెప్పి, త‌ప్పించుకొంటాడ‌ని చిరుకి బాగా తెలుసు. అడిగి… ‘నో’ అనిపించుకోవ‌డం ఎందుకు అనుకొన్నాడేమో… బిగ్ బీ మాట ప‌క్క‌న పెట్టేశాడు చిరు. మ‌రి ఈ వార్త ఎక్క‌డి నుంచి పుట్టిందో, ఎవ‌రు పుట్టించారో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.