రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన.. వేగం కంటే వ్యూహం ముఖ్యమని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. రాజకీయాల్లో అధికారం మారిన వెంటనే కక్ష సాధింపులు సహజం. కానీ, గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఈగో రాజకీయాలకు భిన్నంగా, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పద్ధతిలో ముందుకెళ్తోంది. జగన్ హయాంలో ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కోర్టుల్లో నిలబడక ప్రభుత్వం అభాసుపాలైన సందర్భాలు అనేకం. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదైనా పని మొదలుపెడితే అది చట్టపరంగా పక్కాగా ఉండేలా చూస్తోంది. అందుకే చర్యలు కాస్త ఆలస్యమైనా, పడే దెబ్బ మాత్రం వైసీపీ నేతలకు కోలుకోలేని విధంగా తగులుతోంది. దానికి తాజా ఉదాహరణ వెంకట్రామిరెడ్డి డిస్మిస్.
పక్కా ఆధారాలతో చర్యలు
సోషల్ మీడియాలో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేసి వారికి అనవసర ప్రాముఖ్యత కల్పించడం కంటే, వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన అధికారులను, వైసీపీ నేతలను ప్రభుత్వం వదిలిపెట్టడం లేదనడానికి ఇటీవలి అరెస్టులు, విచారణలే సాక్ష్యం. ఎటువంటి లూప్‌హోల్స్ లేకుండా ఆధారాలను సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంటుండటంతో, నేతలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది.
జగన్‌ను నమ్మి గొయ్యిలో పడిన వెంకట్రామిరెడ్డి
ఉద్యోగం సంఘం పేరుతో అతి చేసిన వెంకట్రామిరెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలు దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరించిన వారు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీని నమ్మి నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు, నేతలు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు చట్టం ముందు నిలబడాల్సి వస్తోంది. చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన చెందుతున్న సొంత కార్యకర్తలకు, ప్రభుత్వం చేస్తున్న ఈ సైలెంట్ ఆపరేషన్ సమాధానం ఇస్తోంది.
నేలమట్టమవుతున్న సామ్రాజ్యాలు
జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఈగోతో కూడినవి కావడం వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. కానీ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ..ఒక్కసారి ఫైల్ కదిలిందంటే అది తుది దశకు వెళ్లే వరకు వదలడం లేదు. అక్రమ కట్టడాల కూల్చివేత అయినా, భూ ఆక్రమణలపై విచారణ అయినా.. సాక్ష్యాధారాలతో సహా అడుగులు వేస్తోంది. రాజకీయాల్లో ఆవేశపడితే ప్రత్యర్థులకు సానుభూతి వస్తుందని, అదే వ్యూహంతో దెబ్బకొడితే వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని ప్రస్తుత చర్యలు నిరూపిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టుల కోసం కాకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎవరూ ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేలా ఒక బలమైన పునాదిని చంద్రబాబు ప్రభుత్వం వేస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సూత్రాన్ని వైసీపీ అక్రమార్కులకు రుచి చూపిస్తోంది. ఆవేశంతో కాదు ఆలోచనతో చేసేదే ఎక్కువ ప్రభావం చూపుతుందని మరోసారి నిరూపితమైంది.
