అభిషేక్ సింఘ్వీ ప్రకటించిన ఆస్తులు సంపాదన చూసి ఓ భారీ కార్పొరేట్ కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆస్తులు సంపాదించలేదని లెక్కలేస్తే అందులో తప్పు లేదు. ఓ లాయర్ కు ఇన్ని వేల కోట్లు క్లయింట్లు ధారబోస్తున్నారంటే.. చిన్న విషయం కాదు. ఇలాంటి ఖరీదైన లాయర్లు ఢిల్లీలో చాలా మంది ఉన్నారు. రాష్ట్రాల్లో ఉన్నారు. వారికి ఎవరు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తారంటే.. రాజకీయ నేతలే అని చెప్పక తప్పదు. అడ్డగోలుగా సంపాదించి.. కేసుల్లో ఇరుక్కుని ..బయటపడేందుకు ఒక్క సారి హాజరైనందుకు పది లక్షలు కాదు.. కోటి కూడా చెల్లించేందుకు వెనుకాడటం లేదు.
ఒక్క సారి కోర్టుకు హాజరైతే లక్షలే
ఢిల్లీలోని అధికార వర్గాల్లోనూ, రాజకీయ గల్లీల్లోనూ ఇప్పుడు ఒకే చర్చ.. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వెల్లడించిన ఆస్తుల లెక్కలు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ చూస్తే, అది ఒక వ్యక్తిగత ఆస్తి వివరాల పత్రంలా లేదు.. ఒక బహుళజాతి కంపెనీ వార్షిక బ్యాలెన్స్ షీట్లా కనిపిస్తోంది. అభిషేక్ సింఘ్వీ తన ఆస్తుల విలువ దాదాపు రూ. 2600 కోట్లపైనే అని ప్రకటించారు. . కేవలం ఆయన సంపాదన మాత్రమే కాదు, ఆయన వద్ద ఉన్న లగ్జరీ గడియారాలు, విదేశాల్లోని ఆస్తులు చూస్తుంటే కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. వెబ్ సమాచారం ప్రకారం, సింఘ్వీ వంటి టాప్ లాయర్లు ఒక్కసారి కోర్టులో హాజరవ్వడానికి రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు వసూలు చేస్తారు. కొన్ని హై-ప్రొఫైల్ కేసుల్లో ఇది కోటి రూపాయల వరకు కూడా వెళ్తుందని సమాచారం. అంటే, రోజుకు ఒకట్రెండు గంటల వాదనలతోనే వీరు సామాన్యుడి జీవితకాల సంపాదనను ఆర్జిస్తున్నారు.
పొలిటికల్ క్లయింట్స్ నుంచే అసలు ఆదాయం
ఇంత పెద్ద మొత్తంలో క్లయింట్లు ఎందుకు ధారబోస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ పొలిటికల్ క్లయింట్స్ . అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసి, ఆ తర్వాత కేసుల్లో ఇరుక్కున్న రాజకీయ నేతలే ఇలాంటి ఖరీదైన లాయర్లకు ప్రధాన ఆదాయ వనరులు అనుకోవచ్చు. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్, మైనింగ్ స్కామ్ వంటి కేసుల్లో ఇరుక్కున్న నేతలు.. తమ పదవులను, పరువును కాపాడుకోవడానికి ఎంత ఖర్చయినా వెనుకాడరు. జైలు పాలు కాకుండా స్టే లు తెచ్చుకోవడానికి , బెయిల్ పొందడానికి వీరు ఇచ్చే ఫీజులు చూస్తే, న్యాయం అనేది కేవలం డబ్బున్న వారికే సొంతమా అన్న అనుమానం కలుగుతుంది.
లాయర్ వృద్ధి హైరిటర్న్ బిజినెస్
కేవలం ఢిల్లీలోనే కాదు, రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్టార్ లాయర్లు డజన్ల కొద్దీ ఉన్నారు. కపిల్ సిబల్, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గీ వంటి హేమాహేమీలు ఈ జాబితాలో ముందుంటారు. వీరు కోర్టు గడప తొక్కితేనే మీటర్ లక్షల్లో తిరుగుతుంది. ఈ ఖరీదైన న్యాయపోరాటాలు వ్యవస్థలోని అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నేతలు దోచుకున్న ప్రజల సొమ్మునే తిరిగి ఇలాంటి లాయర్ల జేబుల్లోకి మళ్లిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. న్యాయవాద వృత్తి ఒక సేవ అని చెప్పుకునే రోజులు పోయి, అది ఒక హై-రిటర్న్ బిజినెస్‌గా మారిందనేది అక్షర సత్యం.
