ఓవైపు ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తుందా, రాదా? అనే డిబేట్ నడుస్తూనే ఉంది.. మరోవైపు మరి కొంతమంది నిర్మాతలు ప్లాన్ బి ని రెడీ చేసుకొంటున్నారు. ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు మరో సినిమా కూడా మే 1ని టార్గెట్ చేసింది.
ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ‘ఎపిక్’. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. వైష్ణవి చైతన్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ’90’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారు. సినిమా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ‘పెద్ది’ రాకపోతే.. మే 1.. పర్ఫెక్ట్ డేట్ అవుతుందని ఆయన నమ్మకం. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించి, ఆ తరవాత వీలుని బట్టి సినిమాని రిలీజ్ చేయాలని అనుకొంటున్నారు. ఇక్కడ కూడా కండీషన్స్ అప్లైనే. ‘పెద్ది’ రాకపోతేనే ‘ఎపిక్’ వస్తుంది. లేదంటే కొత్త డేట్ చూసుకొంటుంది.
అయితే.. ‘పెద్ది’ వస్తుందన్న కారణంతోనే అఖిల్ సినిమా ‘లెనిన్’ వాయిదా వేశారు నాగవంశీ. ఇప్పుడు ‘పెద్ది’ రావట్లేదని ‘ఎపిక్’ రిలీజ్ చేయాలనుకోవడం చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘లెనిన్’ వాయిదా పడడానికి కారణం ‘పెద్ది’ కాదని, సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని, అందుకే రిలీజ్ చేయడం లేదని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ‘ఎపిక్’ గనుక ఇప్పుడు మే 1న రిలీజ్ డేట్ అంటూ ప్రకటిస్తే గనుక ఆ మాటే నిజం అయినట్టు లెక్క.
