అనుష్క తప్పితే ఎవ్వరూ కనిపించడం లేదు

లేడీ ఓరియంటడ్ అనే కేటగరీ టాలీవుడ్ లో చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. విజయశాంతి లాంటి లేడీ మెగాస్టార్లు ఈ కేటగిరిని ఓ వెలుగు వెలిగించారు. తర్వాత వరుస పరాజయాలు రావడంతో ఏకంగా సినిమాల నుండే తప్పుకున్నారు. కొనాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఈ కేటగిరిని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన క్రెడిట్ అనుష్కకి దక్కుతుంది. అరుధంతితో సంచలనం సృస్టించింది అనుష్క. సరిగ్గా తీయలే కానీ లేడీ ఓరియంటడ్ సినిమాని కూడా ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్దంగా వున్నారని ఈ సినిమా నిరూపించింది. అయితే ఈ సినిమా తర్వాత మరో చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. అనుష్కనే పంచాక్షరీ, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి సినిమాలు చేసింది. ఏవేవి కూడా ఆ కేటగిరికి సరైన బ్రేక్ ఇవ్వలేదు. మధ్యలో నయనతారతో అనామిక లాంటి సినిమా తీసిన శేఖర్ కమ్ముల కూడా మెప్పించలేకపోయాడు.

అయితే ఇన్నాళ్లుకు మళ్ళీ అనుష్కనే హిట్టు కొట్టింది. భాగమతితో. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. 2018కి తొలి హిట్ అని ప్రేక్షకులే ఆమోదించారు. కేవలం అనుష్కని నమ్మీ మార్కెట్ కి మంచి ఖర్చు చేశారు యువీ నిర్మాతలు. అయితే అనుష్క నమ్మకాలు వమ్ము చేయలేదు. మొత్తం సినిమాని తన భుజాలుపై వేసుకొని నడిచింది. తొలి రెండు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే అంటున్నారు. నాలుగు భాషల్లో విడుదల చేయడం మరో ఎడ్వన్టేజ్. శాటిలైట్ కూడా కలిసొచ్చింది. దీంతో భాగమతికి నిఖార్సయిన హిట్ పడిపోయిందనే చెప్పాలి.

మొత్తంమ్మీద చాలా రోజుల తర్వాత మరో లేడీ ఓరియంటడ్ హిట్. ఈ హిట్ తో దర్శక నిర్మాతలు ఈ కేటగిరిపై మళ్ళీ ఫోకస్ చేసే అవకాశం వుంది. అయితే ఇక్కడ ఒక సమస్య. ప్రస్తుతం టాలీవుడ్ ని జల్లెడ పడితే ఈ కేటగిరి సినిమా చేయడానికి అనుష్క తప్పితే ఎవరూ కనిపించడం లేదు. సినిమాని సోలో హాండ్స్ పై నడిపించే క్యాలిబర్ వున్న హీరోయిన్ ఎవరా ? అంటే అనుష్క తప్పితే మరో హీరోయిన్ పేరు చెప్పడం కష్టమే. పోనీ తెలుగు తమిళ్ లో మంచి పాపులారిటీ వున్న నయనతార పేరు చెబుదాం అంటే.. నిర్మాతలు కిలోమీటర్ల దూరం పరిగెడతారు. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ ఆ రేంజ్ లో ఉటుంది. హీరోయిన్ సినిమా అన్నాక హీరోయినే ప్రమోషన్ చేసుకోవాలి. కానీ ప్రమోషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది నయన్. ఈ రోజుల్లో ప్రమోషన్ కి వున్న ప్రాముఖ్యత ఏమిటో అందరికీ తెలుసు. దీంతో ఆమెతో సినిమా అంటే చాలా రిస్క్. ఇంకా ఎవరున్నారు అంటే.. త్రిష. ఆమె సినిమాలు చేస్తుందే కానీ హిట్ లేదు. క్రేజ్ కూడా తగ్గిపోయింది. దీంతో నిర్మాతలకు నమ్మకం లేదు. ఇక తమన్నా , కాజల్, సమంత, రకుల్.. ఎలా లిస్టు చెప్పుకుంటూపొతే.. ఎవరిపై కూడా నమ్మకం కుదరని పరిస్థితి. తమన్నా ప్రస్తుతం క్వీన్ రీమేక్ చేస్తుంది. అది హిట్ అయితే ఒక ఆప్షన్ దొరుకుతుంది. సమంత ఇప్పటివరకూ ఈ కేటగిరిని టచ్ చేయలేదు.

బాలీవుడ్ లో కాస్త భిన్నంగా వుంది పరిస్థితి. అక్కడ విద్యాబాలన్, కంగానా రనౌత్, దీపిక పదుకొనే, శ్రద్దా కపూర్, మొన్నటికి మొన్న వచ్చిన అలియా భట్ కూడా సోలో వసూళ్ళు సాధించేయగల సత్తా వున్న స్టార్లు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఆ లిస్టు కనిపించదు. అనుష్క మాత్రమే. ఇప్పుడు భాగమతితో మరో హిట్ ఖాతాలో వేసుకున్న జేజమ్మనే మరో లేడీ ఓరియంటడ్ మూవీకి శ్రీకారం చుట్టాలి. చూడాలి మరి అనుష్క ప్లానింగ్ ఎలా వుటుందో..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.