టీడీపీ-బీజేపీ చెలిమిపై అపాయింట్‌మెంట్ కొలిమి

ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ప్ర‌ధాన మంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోతే.. ఆయన పార్టీతో పొత్తు తెంచేసుకున్న‌ట్లేనా? క‌టిఫ్ చెప్పేసిన‌ట్లేనా! ఎన్నిక‌లు ఇంకా రెండేళ్ళు ఉన్నాయ‌న్న త‌రుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకు న‌రేంద్ర భాయ్ మోడీ త‌న‌ను క‌లుసుకోవ‌డానికి స‌మ‌యం కేటాయించ‌క‌పోవ‌డాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు ముఖ్యంగా సోష‌ల్ మీడియా ఎవ‌రి అర్థాలు వారు చెప్పేసుకుంటున్నారు. అమెరికాలో ప‌ది రోజుల పర్య‌ట‌న‌కు డ‌జ‌నుకు పైగా వందిమాగ‌ధుల‌తో ప్ర‌త్యేక విమానంలో ఏపీ సీఎం ప‌య‌న‌మై వెళ్ళారు. దీనికి పెట్టిన పేరు నిధుల స‌మీక‌ర‌ణ‌. అన్ని కంపెనీలొస్తున్నాయి.. ఇన్ని కంపెనీలొస్తున్నాయి.. అన్ని కోట్ల డాల‌ర్ల నిధులొస్తున్నాయంటూ ప్ర‌భుత్వ ప్ర‌సార మాధ్య‌మాలతో పాటు చంద్ర‌బాబు మ‌న‌సెరిగిన మీడియా బాకాలు ఊదేశాయి. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ర్య‌ట‌న‌కు ముందు పాపం మోడీ నుంచి కూడా ఓ స‌ల‌హా పొందుదామ‌ని స‌మ‌యం అడిగితే కేటాయించ‌లేద‌ని తెలుగుదేశం శ్రేణులు గిల‌గిల‌లాడిపోయారు. ప్రధాని అక్క‌డితో ఆగ‌కుండా చంద్ర‌బాబు ఇంకా అమెరికా నుంచి తిరిగి రాకుండానే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చేశారు. త‌న‌కివ్వ‌క‌పోయినా బాధ‌ప‌డ‌ని బాబుగారికి ఈ ప‌రిణామం తెగ బాధ‌క‌లిగించింది. అందుకే అమెరికా నుంచి ఢిల్లీలో దిగుతూనే ఓ ఏడు గంట‌ల‌పాటు గాయ‌బ్ అయిపోయారు. ఎక్క‌డికెళ్ళారు ఏం చేశారు అనే అంశంపై ఓ ఇద్ద‌రు ముగ్గురికి త‌ప్ప ఏమాత్రం ఉప్పంద‌లేదు. ఏం చేశారో అంత‌కంటే తెలీదు. జ‌గ‌న్‌తో ప్ర‌ధాని ఏం మాట్లాడారు.. అస‌లు త‌న‌గురించి ఏమ‌నుకుంటున్నారంటూ ఆరా తీయ‌డానికి ఈ స‌మ‌యాన్ని చంద్ర‌బాబు కేటాయించార‌ని రాష్ట్రానికి చెందిన ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక భాష్యం చెప్పింది. అక్క‌డితో ఊరుకోకుండా టీడీపీ-బీజేపీ మైత్రి చెడిపోయిన‌ట్లేన‌ని ఓ విశ్లేష‌ణ‌ను వ‌దిలేసింది. అస‌లే కుత‌కుత‌లాడిపోతున్న తెలుగు దేశం శ్రేణుల‌కు ఇది మింగ‌లేక క‌క్క‌లేక ప‌రిస్థితిని క‌లిగించింది.

ప్ర‌ధాని నరేంద్ర మోడీ ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రుల విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకుంటారు. పీఎంఓ కార్యాల‌య అనుమ‌తి లేకుండా కేంద్ర మంత్రులు కానీ, అధికారులు కానీ విదేశాల‌కు ప‌య‌నం కాకూడ‌ద‌ని 2014 సెప్టెంబ‌రులోనే ఆదేశాలు జారీ చేశారు. సింగ‌పూర్ వ్య‌వ‌స్థాప‌కుని అంత్య‌క్రియ‌ల‌కు చంద్ర‌బాబు బ‌య‌లుదేరిన‌ప్పుడు కూడా పీఎంఓ అడ్డం కొట్టింది. ప్ర‌ధాని హాజ‌ర‌వుతున్నందున త‌మ‌రు వెళ్ళాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది పీఎంఓ సందేశ సారాంశం. సింగ‌పూర్‌తో బంధాన్ని పెన‌వేసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రికి అది ఇబ్బంది క‌లిగించింది. అయిన ప్ర‌ధాని ఆదేశం ….విన‌క త‌ప్ప‌దు క‌దా. తాజాగా అమెరికా ప‌ర్య‌ట‌నపై పీఎం కినుక వ‌హించి ఉండ‌వ‌చ్చు. అందుకే చంద్ర‌బాబుకు స‌మ‌యం కేటాయించి ఉండ‌క‌పోవ‌చ్చు. అంత‌మాత్రానికే ఏదో జ‌రిగిపోయింద‌ని గ‌గ్గోలు పెట్ట‌డం స‌రికాదు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ఎప్పుడో సంప్ర‌తించారంటున్నారు. బాబు ఊళ్ళో లేనప్పుడు జ‌గ‌న్ త‌న‌ను క‌లిసేందుకు అనుమ‌తించ‌డంలో ఏదో మ‌ర్మ‌ముంద‌నేది టీడీపీ వ‌ర్గాలు చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసుకుంటున్నాయి. కొంత‌కాలంగా టీడీపీ-బీజేపీ సంబంధాలు ఇబ్బందికంగా ఉన్న విష‌యం వాస్త‌వ‌మే. అంత‌మాత్రం చేత న‌మ్మ‌క‌మైన మిత్రుణ్ణి.. ముఖ్యంగా వెంక‌య్య‌నాయుడు బాస‌ట‌గా నిలిచే ముఖ్య‌మంత్రి అండ‌ను బీజేపీ పోగొట్టుకుంటుంద‌నుకోవ‌డం భ్ర‌మ‌. యుఎన్ కౌన్సిల్‌లో ఇళ్ళ నిర్మాణ విభాగానికి అధ్య‌క్షునిగా ఎంపికైన వెంక‌య్య విదేశాల్లో ఉన్నారు. ఆ కార‌ణంగా ఇక్క‌డి పరిణామాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌డం లేదు. అందువ‌ల్లే నోరు మెద‌ప‌డం లేదాయ‌న‌.

ఇది కూడా టీడీపీలో అనుమానాలను పెంచేస్తోంది. బీజేపీ అండ లేకుండా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మేమోన‌నే భావ‌న ఆ పార్టీలో లేక‌పోలేదు. ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతుండ‌డం, టీడీపీ చ‌ర్య‌ల‌పై నిశ్శ‌బ్దాన్ని వ‌హిస్తుండ‌డం కూడా ప్ర‌ధానికి టీడీపీపై ఆగ్ర‌హం రావ‌డానికి కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చు. ఒక‌వేళ అదే నిజ‌మైతే కూర్చుని మాట్లాడుకుంటే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. అంటే బీజేపీనా… జ‌న‌సేనా తేల్చుకోవాల్సిన త‌రుణం సైకిలుకు వ‌చ్చేసింది. అది మానేసి, టీడీపీ శ్రేణులు, మంత్రుల‌తో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధింప‌జేయ‌డం ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాల‌ను చెడ‌గొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎప్పుడూ టీడీపీవైపు మాట్లాడే బీజేపీ అసెంబ్లీ ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా….జ‌గ‌న్‌కు ప్ర‌ధాని స‌మ‌యం కేటాయిస్తే ఏంటంట అన‌డం వాస్త‌వాన్ని బ‌య‌ట‌పెట్టింది. బీజేపీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ వైపు అడుగులేయ‌క‌పోయినా.. టీడీపీనే ఆ క‌ల‌ర్ ఇచ్చేస్తోంది. అంటే టీడీపీకే బీజేపీని వ‌దిలించేసుకోవాల‌నుపిస్తోంద‌నుకోవ‌చ్చా. అమిత్ షా రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఈ విష‌యం స్ప‌ష్టం కావ‌చ్చు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.