బాలకృష్ణ అంటే.. ఓ ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు!
మనసు పెట్టి డైలాగ్ చెప్పాడంటే… ఆ నిషా నషాళానికి అంటుతుంది.
తాపీగా తొడగొట్టాడంటే… ఆ మత్తూ వదిలిపోతుంది.
మనస్ఫూర్తిగా నవ్వాడంటే… ఆ వెలుగు వెండితెరకే కొత్త కాంతులు పంచుతుంది.
బాలయ్య అంటే నిలువెత్తు మాస్.
బాలయ్య అంటే మనిషిగా మారిన మాన్షన్ హౌస్.
నందమూరి తారకరామారావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, నటుడిగా అడుగులేయడం అంటే మాటలు కాదు.
‘ఆ రోజుల్లో నాన్నగారు’ అంటే సరిపోదు. ‘ఈరోజుల్లో నేనేం చేశా’ అనేదీ నిరూపించుకోవాలి.
బాలయ్య అలా నిరూపించుకొన్న హీరోనే.
నాన్నగారిలా పౌరాణికాలు చేశాడు.
నాన్నగారిలా జానపదాల్లోనూ నటించాడు.
నాన్నగారు చేయని సైన్స్ ఫిక్షన్
నాన్నగారి బయోపిక్.. ఇలా చేసుకొంటూ వెళ్లాడు.. వెళ్తున్నాడు.
ఇన్ని జోనర్లు టచ్ చేసిన ఏకైన హీరో బాలకృష్ణే.
బాలయ్య దగ్గర ఉన్న గొప్ప లక్షణం.. డేరింగ్ & డాషింగ్. ఎక్కడా ముసుగులో గుద్దులాట ఉండదు. మనసులో ఏం ఉంటే అది చెప్పేస్తాడు.. చేసేస్తాడు. అక్కడక్కడా మిస్ ఫైర్ అయిన సందర్భాలూ ఉండొచ్చు. కానీ బాలయ్య డోంట్ కేర్.
దర్శకుల్ని బాలయ్య గురించి అడిగి చూడండి. చాలా గొప్పగా చెబుతారు. ఎందుకంటే దర్శకులకు సరెండర్ అయిపోయేతత్వం.. ఆ లక్షణం.. దర్శకులకు నచ్చుతుంది. ఏ టాప్ హీరో అయినా కథలో, షూటింగ్ లో వేళ్లూ కాళ్లూ పెడుతుంటారు. కానీ బాలయ్య ఎప్పుడూ అలా చేయలేదు. దర్శకుడ్ని నమ్మడమే బాలయ్య పని.
కొన్ని కొన్ని షాట్లు బాలయ్యపైనే తీయగలరు దర్శకులు.
తొడ గొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం దగ్గర్నుంచి.. అఖండ 2లో మెడపై కత్తిని తిప్పుకొంటూ శత్రు సంహారం చేయడం వరకూ.
అవన్నీ జస్ట్ బాలయ్య థింగ్స్. బాలయ్య ఏం చేసినా చూడబుద్దేస్తుంది. ఏం చేసినా తన ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడంలోనే అసలైన ఆనందాన్ని, విజయాన్ని చూసుకొంటుంటాడు బాలయ్య. అదే తన సక్సెస్ సీక్రెట్.
బాలయ్య అంటే.. ఫ్యాన్స్‌కి పిచ్చి.
కొట్టినా బాలయ్యే కొట్టాలి.. పెట్టినా బాలయ్యే పెట్టాలి. ఇదీ వాళ్ల నినాదం.
కానీ మనం బాలయ్య కొట్టడమే చూశాం. బాలయ్య మనసుకు హత్తుకొంటే ఎలా ఉంటుందో? ప్రేమగా దగ్గరకు తీసుకొంటే ఎలా ఉంటుందో కొంతమంది ఫ్యాన్స్ కే తెలుసు.
అన్ స్టాపబుల్ అసలైన బాలయ్యని పరిచయం చేసింది. బాలయ్య ఎంత లైవ్లీగా, జోవియల్‌గా ఉంటాడో అర్థమైంది. నిజానికి అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసిందేం లేదు. తాను బయట ఎలా ఉంటాడో.. తెరపైనా అలానే కనిపించాడు. అదే అన్‌స్టాపబుల్ ని క్రేజీ ఈవెంట్ గా మార్చేసింది.
ఈమధ్య బాలయ్య జాతకం భలే వుంది. ఏం చేసినా సూపర్ సక్సెస్. వరుస విజయాలు బాలయ్య ఇమేజ్‌ని మరింత పై స్థాయికి తీసుకెళ్లాయి. ఈమధ్యే నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకొన్నాడు. పద్మభూషణ్ అందుకొన్నాడు. ఇక మోక్షజ్ఞ కెరీర్ సెట్ చేస్తే సరిపోతుంది.
కానీ బాలయ్య జోష్ ఇక్కడితో ఆగేట్టు లేదు. ‘నాలో 2.ఓ కూడా చూస్తారు’ అని హింట్ ఇచ్చాడు బాలయ్య.
రేపు రాబోతున్న అఖండ 2..
త్వరలో మొదలు కాబోతున్న ఆదిత్య 999
గోపీచంద్ మలినేని సినిమా..
ఇవి మూడూ మూడు పంథాల్లో అభిమానుల్ని మెప్పిస్తాయన్నది బాలయ్య ఆశ, ఆలోచన. అభిమానుల ఆకాంక్ష కూడా అదే.
బాలయ్య ఇలా కిక్ ఇస్తూనే ఉండాలి. ఇస్తాడు కూడా.
హ్యాపీ బర్త్ డే బాలయ్యా…!!!