వైసీపీలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ అట కదా అనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో నారా లోకేష్‌తో బొత్స సత్యనారాయణ అత్యంత సన్నిహితంగా, సరదాగా ముచ్చటించారు. తన వారసుల రాజకీయ రంగ ప్రవేశం కోసం బొత్స కూటమి పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారానికి ఇది మరింత ఊతమిచ్చింది. ఇటీవల కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పెద్దగా కష్టపడకపోవడం వెనుక ఆయన తదుపరి రాజకీయ అడుగుల గురించిన సంకేతాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్, ఆయనను బుజ్జగించడానికి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్డును వాడుతున్నట్లు కనిపిస్తోంది.
బొత్స పార్టీ మారిపోతే ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి జీరో
ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ ఒక్కో స్థానంలో కనీసం యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాంటి చోట బలమైన సామాజికవర్గానికి చెందిన బొత్స కూడా దూరం అయితే వైసీపీ ఉనికి ఉండదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం వెనుక బొత్సను పార్టీ మారకుండా కట్టడి చేసే ఉద్దేశం కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బొత్స గనుక పార్టీ వీడితే ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, అందుకే ఈ పదవి ఆఫర్ తెరపైకి వచ్చిందనేది వైసీపీలోనే ఎక్కువ మంది భావన.
ఏదైనా పదవి ఇస్తే అది బలి పశువుల్ని చేయడానికే !
జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన ఎవరికీ సంపూర్ణమైన పవర్ ఇవ్వరు. ఎవరికైనా ఏదైనా పదవి ఇస్తే అది వారిని బలి పశువులుగా వాడుకోవడానికే ఇస్తారు. ఇప్పుడు బొత్సకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా, అది కేవలం పేరుకే పరిమితం . దైనందిన వ్యవహారాల్లో సజ్జల చెప్పినట్లుగానే జరుగుతుంది. గతంలో కూడా కీలక నేతలకు పదవులిచ్చినప్పటికీ, నిర్ణయాధికారం మాత్రం జగన్ చుట్టూ ఉన్న కొందరు ముఖ్య నేతల వద్దే ఉండేది. ఒకవేళ పార్టీకి వ్యతిరేకత వస్తే లేదా ఏదైనా తప్పుడు నిర్ణయం జరిగితే, ఆ నిందను మోయడానికి ఒక బలిపశువు అవసరమని, ఆ స్థానంలో బొత్సను ఉంచే ప్లాన్ ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బొత్స వెయిట్ అండ్ వాచ్ పాలసీ
బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో ఆరితేరిన నేత. కేవలం పదవుల కోసం ఆశపడి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టే వ్యక్తి కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వైసీపీలో పదవి దక్కినా, దానికి తగిన ప్రాధాన్యత ఉండదని ఆయనకు తెలుసు. అందుకే, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారంపై ఆయన పెద్దగా స్పందించడం లేదు. నమ్మితే ఎక్కడ మునుగుతారో ఆయనకు బాగా తెలుసు కాబట్టి, ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. తగిన సమయం చూసి తన వారసుల కోసం ఏ పార్టీలో చేరాలనేది ఆయన అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకునే అవకాశం ఉంది. బొత్సకు పదవి ఇచ్చినా అది ఆయనను వైసీపీలో శాశ్వతంగా ఉంచగలదా అనేది అనుమానమే. ఉత్తరాంధ్రలో తన పట్టును నిలబెట్టుకుంటూనే, తన కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారు.


