బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ప్రస్తుతం వరుస వలసలతో డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, పార్టీకి ఇంకా భవిష్యత్ ఉందని చాటడానికి కేసీఆర్ ఒక భారీ చేరిక కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని ఇమేజ్ ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్లకు సంతృప్తి చెంది.. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
పాత పగలు – కొత్త సమీకరణాలు
జీవన్ రెడ్డి రాకను జగిత్యాల, కరీంనగర్ లోకల్ లీడర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. దశాబ్దాలుగా జగిత్యాలలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి ఎదిగిన బీఆర్ఎస్ కేడర్, ఇప్పుడు ఆయనకే జై కొట్టాలంటే తలకిందులయ్యే పరిస్థితి. ఎల్ రమణ వంటి నేతలు ఇప్పటికే మౌనంగా ఉన్నారు. నిన్నటి వరకు బద్ధ శత్రువు గా చూసిన నేతను, నేడు సెక్రటరీ జనరల్ హోదాలో తమ నెత్తిన కూర్చోబెడితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు మనస్తాపానికి గురై, ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం పొంచి ఉంది.
జిల్లా నేతల అసంతృప్తి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నేతలు పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. ఒకవేళ జీవన్ రెడ్డికి పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తే, ఈ సీనియర్ల ప్రాభవం తగ్గుతుందనే ఆందోళన వారి అనుచరుల్లో ఉంది. జగిత్యాల రాజకీయాలు ఎప్పుడూ వ్యక్తిగత ఆధిపత్య పోరుతోనే సాగుతుంటాయి. ఈ తరుణంలో జీవన్ రెడ్డి ఎంట్రీ ఇస్తే, జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత బీఆర్ఎస్ నేతలు డీమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందలం ఎక్కించే వారు అపరిచితులు అయితే, అండగా ఉన్న వారు అన్యాయం అయిపోతారా అనే చర్చ ఇప్పటికే లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో సాగుతోంది.
వ్యూహం ఫలిస్తుందా? వికటిస్తుందా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉన్నప్పటికీ, హైపర్ లోకల్ రాజకీయాల్లో భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవన్ రెడ్డి వంటి మేధావి, సీనియర్ నేత పార్టీలోకి వస్తే బీఆర్ఎస్కు మేధోపరమైన బలం చేకూరుతుంది నిజమే కానీ, అది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీని చీల్చే అవకాశం కూడా ఉంది.


