రైతు సాధికార‌తే ల‌క్ష్యంగా అయోవాతో న‌వ్యాంధ్ర ఒప్పందం

పోటీ ప‌డితే.. త‌న‌కు స‌రితూగేవాడితోనో.. లేక త‌న‌కంటే బ‌ల‌వంతుడితోనో పోటీ ప‌డాలంటారు. బ‌ల‌హీనుడితో పోటీ ప‌డితే త‌న‌లోని లోపాలు ఎప్ప‌టికీ తెలియ‌వు. అక్క‌డే ఉండిపోతాడు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌త్వం త‌న‌కంటే బ‌ల‌వంతుడితో పోటీ ప‌డ‌డం. ఈ సూత్రాన్ని రాష్ట్రానికీ వ‌ర్తింప‌చేస్తున్నారాయ‌న‌. వ్య‌వ‌సాయంలో మ‌న రాష్ట్రం అగ్ర‌గామి అయిన‌ప్పటికీ మ‌రింత అభివృద్ధిప‌థంలోకి తీసుకెళ్ళేందుకూ, శాస్త్రీయంగా ఉన్న‌త స్థానానికి చేరుకునేందుకూ, లాభాల‌ను రెట్టింపు చేసేందుకు వీలుగా ఆయ‌న దృష్టిని సారించారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం అందులో భాగ‌మే. ఇది ఏపీకే కా అయోవాకు కూడా లాభ‌దాయ‌క‌మే. ప‌ర‌స్ప‌రం వ్య‌వ‌సాయ విధానాల‌ను మార్పిడి చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.

తొలి మూడురోజులూ అమెరికాలో ఐటీ రంగంపై పెట్టిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగో రోజున స‌రికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వ్య‌వ‌సాయంలో అత్యంత నైపుణ్యాన్ని సాధించిన అయోవా రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కార‌ణంగా ఏపీ వ్య‌వ‌సాయ‌రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు పునాది ప‌డిన‌ట్లే. సంప్ర‌దాయ వ్య‌వ‌సాయానికి పుట్టినిల్ల‌యిన ఏపీ సాంకేతిక‌త‌నూ.. మెళ‌కువ‌ల‌నూ ఒంట‌బ‌ట్టించుకుంటే అన్న‌దాత‌ల జాత‌కం మారిన‌ట్లే. పెట్టుబ‌డుల కోస‌మే కాకుండా రైతాంగం మేలు కూడా కాంక్షిస్తూ చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను రూపుదిద్దుకున్నారు. అయోవా రాష్ట్ర ప్ర‌భుత్వంతో వ్య‌వ‌సాయంలో స‌హ‌క‌రించుకోవ‌డానికి ఒప్పందాన్ని చేసుకున్నారు. అయోవా రాజ‌ధాని డి మో ఇన్‌లో ఉన్న వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేష‌న్‌లో మ‌హాత్మా గాంధీ, జార్జ్ వాషింగ్ట‌న్ కార్వ‌ర్ చిత్ర‌ప‌టాలు ఈ ఒప్పందానికి సాక్షీ భూతంగా నిలిచాయి. వ్య‌వ‌సాయ రంగంలో ప‌రిశోధ‌న‌, అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక ప‌రిజ్ఞానాల‌లో స‌హ‌కారానికి ఈ ఒప్పందం ఉప‌యోగ‌ప‌డుతుంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య వ్య‌వ‌సాయానికి సంబంధించిన అంశాల‌ను ఇచ్చి పుచ్చుకుంటారు. విత్త‌నాభివృద్ధి, ప‌రిశోధ‌న వీటిలో కీల‌కాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌నే ఆకాంక్ష‌తో తాను ప‌నిచేస్తున్నాన‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా చెప్పారు. ప్ర‌స్తుత ఒప్పందం వ‌ల్ల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులను పెంచ‌వ‌చ్చ‌న్నారు. వ‌ర‌ల్డ్ ఎక‌నమిక్ ఫోర‌మ్‌లో ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌కు త‌న ఈ ప‌ర్య‌ట‌న‌లో బీజం ప‌డింద‌న్నారు. ఏపీలో వ్య‌వ‌సాయాభివృద్ధికి తాను చేసిన కృషిని వివ‌రిస్తూ, నీటి వినియోగ సంఘాల ఏర్పాటు గురించి తెలిపారు. వ్య‌వ‌సాయ‌రంగంలో అయోవా ప‌రిశోధ‌న‌లు ఫ‌లితాలు ప్ర‌పంచంలో ఆ రాష్ట్రానికి ఎన‌లేని పేరును తెచ్చిపెట్టాయి. బ్రెజిల్‌, చైనాల‌తో వ్య‌వ‌సాయ రంగంలో అయోవా పోటీ ప‌డుతోంది.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.