జ‌గ‌న్ కీ వైయ‌స్ కీ ఉన్న తేడా చెప్పిన చంద్ర‌బాబు..!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌లి కాలంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నేరుగా విమ‌ర్శించింది లేదు. జ‌గ‌న్ ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా… ప‌నిగ‌ట్టుకుని వాటిని తిప్పికొట్టాల‌నే ప‌ని పెట్టుకోవ‌డం పెద్ద‌గా క‌నిపించ‌దు. ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టేశార‌నీ, ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని చంద్ర‌బాబును నేరుగా జ‌గ‌న్ విమ‌ర్శిస్తున్నా… వెంట‌నే అదే స్థాయిలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు చంద్రబాబు దిగే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. నేటితో నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితాన్ని చంద్ర‌బాబు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ టీవీ ఛానెల్ కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ… ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికీ, జ‌గ‌న్ ఉన్న తేడాను ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

దివంగ‌త వైయ‌స్సార్ మాట‌లు కాస్త పౌరుషంగా ఉంటాయ‌నీ, కానీ ఆ మాట‌ల్లో వినయం క‌నిపించేద‌ని చంద్ర‌బాబు అన్నారు. అయితే, జ‌గ‌న్ లో అలాంటిది క‌నిపించ‌ద‌ని చెప్పారు. తొలిసారి శాస‌న‌ స‌భ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట‌లు వింటుంటే, బాధా ఆవేద‌నా క‌లుగుతాయ‌ని వ్యాఖ్యానించారు. అయితే, అవ‌న్నీ భ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు. మాట తీరులో సంస్కారం ఉండ‌టం అనేది ఎవ‌రికైనా ముఖ్య‌మన్నారు. జ‌గ‌న్ చేసే వ్యాఖ్య‌లూ విమ‌ర్శ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోను అన్నారు. జైలుకి వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తి చేసే కామెంట్స్ ని వ్య‌క్తిగ‌తంగా తీసుకోన‌ని స్ప‌ష్టం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్క‌లేనంత‌గా సొమ్ము సంపాదించార‌ని ఆరోపించారు.

నిజానికి, జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆ పార్టీలోనే భిన్న‌మైన అభిప్రాయ‌లు వినిపిస్తాయి. పార్టీప‌రంగా ఏ నిర్ణ‌యాలు తీసుకున్నా.. జ‌గ‌న్ మాట ఫైన‌ల్ అనీ, ఇత‌రుల అభిప్రాయాలకు ప్రాధాన్య‌త ఉండ‌ద‌నే అభిప్రాయ‌మూ ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారంలో ఉంది. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో… శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించాల‌న్న నిర్ణ‌యం కూడా అలా తీసుకున్న‌దే అనే ఆ క‌థ‌నాలూ ఆ మ‌ధ్య వ‌చ్చాయి. ముఖ్య‌మంత్రి చేసిన ఈ వ్యాఖ్య‌లపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి..! విమ‌ర్శ‌ల్ని ప‌క్క‌నపెడితే నాలుగు ద‌శాబ్దాల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుడు ఇచ్చిన స‌ల‌హాపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూద్దాం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.