రివ్యూ: చిన్నా

సిద్దార్థ్‌ది ఇర‌వై ఏళ్ల ప్ర‌యాణం. అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేశాడు. ప్ర‌తీ చోటా.. త‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంది. నిర్మాత‌గానూ త‌ను తెలుసు. ఇంత సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సిద్దార్థ్‌… `నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.. ఇంత కంటే మంచి సినిమా నేను తీయ‌లేను.. ఈ సినిమా కూడా న‌చ్చ‌క‌పోతే.. నేను మీకు క‌నిపించ‌ను` అంటూ ఎమోష‌న‌ల్ గా మాట్లాడితే.. `క‌చ్చితంగా ఇదేదో అవుటాఫ్ బాక్స్ ఐడియా సినిమా` అనే అనిపిస్తుంది. `చిన్నా` విష‌యంలో సిద్దూ ఇంతే కాన్ఫిడెన్స్ చూపించాడు. ఈ సినిమా తీయ‌డం కోస‌మే నేనింకా ఇండ‌స్ట్రీలో ఉన్నా అన్నాడు. మ‌రి సిద్దూ చెప్పినంత మేట‌ర్ సినిమాలో ఉందా? ఇంత‌కీ `చిన్నా` క‌థేమిటి?

ఈశ్వ‌ర్ (సిద్దార్థ్‌) ఓ సాధార‌ణ యువ‌కుడు. అన్న‌య్య అక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో ఆ ఉద్యోగం త‌న‌కు వ‌స్తుంది. అన్న‌య్య కూతురు చిట్టి అంటే ప్రాణం. చిట్టి, వ‌దిన‌, ఈశ్వ‌ర్ ఒకే ఇంట్లో ఉంటారు. స్నేహితుడి మేన‌కోడ‌లు మున్నీది కూడా చిట్టీ వ‌య‌సే. ఇద్ద‌రిదీ ఒకే స్కూల్‌. చిట్టీనీ, మున్నీనీ ఒకేలా చూసుకొంటాడు ఈశ్వ‌ర్‌. అయితే ఓ రోజు ఉన్న‌ట్టుండి మున్నీ డ‌ల్ గా మారిపోతుంది. ఎవ‌రితోనూ మాట్లాడ‌దు. ఆఖ‌రికి చిట్టీతో కూడా. మున్నీకి ఏమైందో తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో.. మున్నీతో కాస్త క్లోజ్ గా గ‌డిపేప్ర‌య‌త్నం చేస్తాడు ఈశ్వ‌ర్‌. అదే త‌న‌ని చిక్కుల్లో ప‌డేస్తుంది. మున్నీని ఎవ‌రో లైంగికంగా వేధించార‌ని ఇంట్లోవాళ్ల‌కు తెలుస్తుంది. ఆ నెపం.. ఈశ్వ‌ర్‌పై ప‌డుతుంది. మ‌రి ఈశ్వ‌ర్ తాను త‌ప్పు చేయ‌లేద‌ని ఎలా నిరూపించుకొన్నాడు..? మ‌రోవైపు చిట్టికీ ఇలాంటి ప‌రిస్థితే ఎదురైతే… చిట్టిని ఎలా కాపాడుకొన్నాడు? అస‌లు మున్నీని, చిట్టీని ఇలా వేధింపుల‌కు గురి చేసింది ఎవ‌రు? ఇదంతా.. మిగిలిన క‌థ‌.

కొన్ని క‌థ‌లు తెర‌పై చూడ‌లేం. అవి వాస్త‌వాలే కావొచ్చు. కానీ… ఆ పెయిన్ భ‌రించ‌డం క‌ష్టం. చిన్నా అలాంటి క‌థే. పేప‌ర్ల‌లో, టీవీల్లో లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్న చిన్నారుల వ్య‌ధ‌లు చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కూడా అలాంటిదే. ద‌ర్శ‌కుడు చాలా సున్నిత‌మైన పాయింట్ ని ప‌ట్టుకొన్నాడు. ఇంట్లోంచి చిన్నారుల్ని బ‌య‌ట‌కు పంపేట‌ప్పుడు… త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న హెచ్చ‌రిక జారీ చేశాడు. అభం శుభం తెలియ‌ని ఆ పాపాయిలు… సైకోల చేతుల్లో, కామాంధుల చేతిల్లో చిక్కితే వాళ్ల బ‌తుకులు ఎంత న‌ర‌క ప్రాయంగా ఉంటాయో తెర‌పై చూపించాడు. ఇవ‌న్నీ మ‌నం జీర్ణీంచుకోలేని నిజాలే. వాటిని తెర‌పై చూస్తున్న‌ప్పుడు.. గుండెల్లో కెలికేసిన‌ట్టు అనిపిస్తుంది.

మ‌నింట్లో కూడా ప‌దేళ్ల చిన్నారులు ఉంటే.. భ‌యం, ఆందోళ‌న పుట్టుకొస్తాయి. వాళ్ల‌కి వెంట‌నే జాగ్ర‌త్త‌లు చెప్పాలి, వాళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న ఆలోచ‌న క‌లుగుతుంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గిన‌దే. అయితే.. సినిమా అనేది ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. చుట్టూ ఉన్న బాధ‌ల్ని మ‌ర్చిపోవాల‌నే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అక్క‌డ కూడా పెయిన్ చూపిస్తే త‌ట్టుకోగ‌ల‌రా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. `అమ్మాయిలు బ‌స్ ఎక్కి, దిగేంత వ‌ర‌కూ ఎవ‌రి చేయీ త‌గ‌ల‌కుండా ఉండాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి అని`. ముమ్మాటికీ అది నిజం కూడా. రోడ్డుపై అమ్మాయి క‌నిపిస్తే చాలు, వ‌య‌సుతో ప‌ని లేదు. మ‌గాళ్లంద‌రి క‌ళ్లూ ఎటు వైపు చూస్తాయో.. వాళ్ల‌కు అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. ప్ర‌తీ అమ్మాయీ త‌న జీవితంలో ఎప్పుడో ఒక‌ప్పుడు ఎదుర్కొనే స‌మ‌స్యే చూపించారు. నిజం ఎప్పుడూ క‌టువుగానే ఉంటుంది కాబ‌ట్టి.. ఈ సినిమా కూడా దిగ‌మింగుకోలేనట్టుగానే అనిపిస్తుంది. సైకో.. చిట్టికి బాధ పెట్టి, భ‌య‌పెట్టే విధానం చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పాటుకి గుర‌వుతుంది. కొన్ని స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు ఎవాయిడ్ చేసి ఉండాల్సింది. కాక‌పోతే.. జ‌రుగుతున్న ఘోరాలు ఎలా ఉన్నాయో శాంపుల్‌గా చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

క‌థ‌లోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు కొంత స‌మ‌యం తీసుకొన్నాడు. ఈ క‌థ‌కు… హీరోకి ఓ అన్న‌య్య ఉండ‌డం, తాను చ‌నిపోవ‌డం, ఇంటి బాధ్య‌త హీరోపై ప‌డ‌డం.. ఇవ‌న్నీ అన‌వ‌స‌ర‌మే. ఇలాంటి క‌థ‌ని స్ట్ర‌యిట్ గా చెప్పాలి. హీరోయిన్ ఉన్నా.. ఆమెతో ల‌వ్ ట్రాక్ అంటూ క‌థ‌ని సాగ‌దీయ‌కుండా మంచి ప‌ని చేశాడు. మున్నీ ఎపిసోడ్ తో … అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఆ విష‌యంలో ఈశ్వ‌ర్‌ని అంద‌రూ అపార్థం చేసుకొంటారు. ఈశ్వ‌ర్ త‌ప్పు చేయ‌లేద‌ని ప్రేక్ష‌కుడికి తెలుసు. కానీ.. ఆ స‌మ‌యంలో ఈశ్వ‌ర్ ఏం జ‌రిగిందో క్లారిటీగా చెప్ప‌కుండా మౌనంగా, అమాయ‌కుడిగా ఎందుకు ఉంటాడో అర్థం కాదు. చిట్టి క‌నిపించ‌కుండా పోవ‌డంతో.. క‌థ‌లో మ‌రో ఎలిమెంట్ మొద‌ల‌వుతుంది. చిట్టి కోసం ఈశ్వ‌ర్ ప‌డే వేద‌న మ‌న‌సుల్ని మెలిపెడుతుంది. చివ‌ర్లో క్లైమాక్స్ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది.

సిద్దార్థ్ చాలా స‌హ‌జంగా న‌టించాడు. ఈసినిమా త‌న క‌ల‌ల ప్రాజెక్ట్‌గా అభివ‌ర్ణించాడు. కంటెంట్ ప‌రంగా.. గార్గీ లాంటి క‌థ‌ల్ని గుర్తు చేసే సినిమా ఇది. కాబ‌ట్టి… కొత్త ప్ర‌య‌త్నం ఏం కాదు. కేవ‌లం న‌టుడిగా త‌న‌ని తాను పూర్తి స్థాయిలో ఆవిష్క‌రించుకోవ‌డానికి దీన్నో అవ‌కాశంగా తీసుకొన్నాడేమో అనిపిస్తుంది. చిన్నాన్న పాత్ర‌లో పెయిన్ కనిపిస్తుంది. స‌గ‌టు మ‌నిషిలానే తెర‌పై క‌నిపించ‌డానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించాడు సిద్దార్థ్. ఈశ్వ‌ర్ స్నేహితులిద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. చిన్నారులు కూడా బాగా న‌టించారు. క‌థానాయిక పాత్ర‌లోనూ డెప్త్ ఉంది. ధైర్యం క‌నిపించింది. త‌న జీవితంలోనూ ఇలాంటి ఓ దుర్ఘ‌ట‌నే జ‌రిగిందంటూ కొన్ని డైలాగుల‌తోనే దాన్ని స‌రిపెట్టారు. క‌థానాయిక ఫ్లాష్ బ్యాక్ కూడా ఓపెన్ చేసి ఉంటే.. ఈ పెయిన్ మ‌రింత ఎక్కువ అయ్యేది.

సాంకేతికంగా చూస్తే.. నేప‌థ్య సంగీతం బాగుంది. ఈ సినిమాకంటూ ఓ టార్గెట్ ఆడియ‌న్స్ ఉన్నారు. మాస్ సినిమా కాదిది. థియేట‌ర్లు నిండిపోయే కంటెంట్ లేదు. జ‌స్ట్‌… ఈ సినిమా ద్వారా సిద్దార్థ్ జ‌నాల‌కు ఓ మెసేజ్ పాస్ చేయాల‌నుకొన్నాడంతే. అందుకే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఈ క‌థ‌కు త‌గిన బ‌డ్జెట్‌తోనే సినిమా పూర్తి చేశారు. పాట‌ల‌కు స్కోప్ లేదు. యాక్ష‌న్ సీన్ల అవ‌స‌రం రాలేదు. కేవ‌లం ఎమోష‌న్‌ని న‌మ్ముకొంటూ తీసుకెళ్లిన సినిమా ఇది. మ‌న ఇంట్లోనూ ఓ పాపాయి ఉంటే.. త‌న‌కు గుడ్ ట‌చ్ అంటే ఏమిటో, బ్యాడ్ ట‌చ్ అంటే ఏమిటో? అమ్మలు విడ‌మ‌ర‌చి మ‌రీ చెప్పాల‌నే సంకేతాన్ని `చిన్నా` గ‌ట్టిగా ఇస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close