చిత్రమైన లహరి

తెలుగు360 రేటింగ్‌ 2.75/5

సినిమానే చిత్రమైన వ్యవహారం. వాస్తవంలా కనిపిస్తూ, వాస్తవానికి దూరంగానే వుంటూ, వాస్తవంలో వున్నవారిని భ్రమల్లోకి తీసుకెళ్తూ, భ్రమల్లో వున్నవారిని భూమ్మీదకు లాక్కువస్తూ ఇలా రకరకాల మ్యాజిక్ లు చేస్తూ వుంటుంది. ఈ మ్యాజిక్ లు అన్నీ పండాలంటే డైరక్టర్ మాంచి మెజీషియన్ అయి వుండాలి. స్క్రిప్ట్ ను సూపర్ గా వుందే అని భ్రమించేలా చేయగలగాలి. అలా చేయలేకపోతే, స్క్రీన్ మీద ఎంతటి ఎమోషన్లు పండించినా ప్రేక్షకుడు మనసుతో కనెక్ట్ కాడు.

ఎందుకు ఎలా కనెక్ట్ కాలేదో చూసే ముందు కథేంటో చూద్దాం

విజయ్ (సాయి తేజ) తో సక్సెస్ దోబూచులాడుతుంటుంది. ఏదో సాధించాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటూ, అది సాధ్యంకాక, విజయం వరించక, డిప్రెషన్ తో ఫీలవుతుంటాడు. ఆ కారణంగా నిత్యం మందు కొట్టడం ఒక్కటే పరిష్కారం అనుకుంటాడు. అలాంటి వాడు లహరి (కళ్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడతాడు. అక్కడా అపజయమే వెన్నాడుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ఎలా విజయతీరానికి చేరిందన్నది కథ.

ఫెయిల్యూర్ సన్, ఎఫెక్షనేటివ్ ఫాదర్ కాన్సెప్ట్ తో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి. చిత్రలహరి సినిమా లో వున్న మెయిన్ కాన్సెప్ట్ ఇదే. దీనికి ఫెయిల్యూర్ కెరీర్ లోనే కాదు, ప్రేమలో కూడా అనే పాయింట్ ను జతచేసారు. బేసిక్ గా కథలో కొత్త పాయింట్ లేకపోవడం అన్నది చిత్రలహరి సినిమాకు ఫస్ట్ మైనస్. భిన్నమైన క్యారెక్టర్లు అంటూ, హీరో, తండ్రి, కమెడియన్లు ఇద్దరు, హీరోయిన్లు ఇద్దరు అంటూ డిజైన్ చేసారు. కానీ ఏ క్యారెక్టర్ ను కూడా దర్శకుడు కిషోర్ తిరుమల పరిపూర్ణంగా డిజైన్ చేయలేకపోయారు.

హీరో క్యారెక్టర్ దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయింది. అంతటి విచక్షణ, తెలివితేటలు వున్న కుర్రాడు మందుకు బానిసకావడం అన్నది కేవలం యూత్ కు రాంగ్ మేసేజ్ ఇచ్చే వ్యవహారం తప్ప వేరు కాదు. చదువుకున్న రేంజ్ కు ఉద్యోగం రానంతమాత్రాన వేరే పని చేయడం హీనం కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న సంగతే దర్శకుడు మరిచిపోయాడు. యూత్ ను రాంగ్ ట్రాక్ లో థింక్ చేసేలా వుంది ఈ వ్యవహారం.

హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే. ప్రేమ వ్యవహారంలో ఓ క్లారిటీ లేకుండా వ్యవహరిస్తుంటుంది. రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం చూపించిన దర్శకుడు దగ్గర కావడానికి అంతబలమైన కారణం చూపించలేకపోయాడు. తను తప్పు చేసానన్న గిల్టీ తో దగ్గర కావడం అన్నది సరికాదు.

రెండో హీరోయిన్ క్యారెక్టర్ అయితే మరీనూ. ఆమె ఎందుకు అంత మెటీరిలిస్ట్ గా వ్యవహారిస్తుందో, చివరిలో మళ్లీ ఎందుకు ఫేస్ లో అంత ఎమోషనల్ ఎక్స్ ఫ్రెషన్స్ అన్నది క్లారిటీ వుండదు. ఆమెతో తీసిన బోట్ సీన్ మరీ అర్థరహితంగా ముగుస్తుంది.

ఇక ఇద్దరు కమెడియన్లు సునీల్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ల గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు.

చిత్రలహరి సినిమాలో కీలకమైన మైనస్ ఏమిటంటే, సీన్ల మధ్య సింక్రనైజేషన్ అన్నది అంతగా కుదరకపోవడం. కెరీర్ లో ఫెయిల్యూర్, లవ్ లో ఫెయిల్యూర్ అన్న రెండు ట్రాక్ లను దర్శకుడు సమాంతరంగా, సరిగ్గా నడపలేకపోయాడు. బ్రేకప్ ముందు హీరోహీరోయిన్ల మధ్య సీన్లపై తీసుకున్న శ్రద్ద ఆ తరువాత మళ్లీ కనిపించలేదు.

సినిమా తొలిసగం రెగ్యులర్ ఫార్మాట్ లోనే టేకాఫ్ తీసుకుంటుంది. అక్కడ వైవిధ్యమైన ప్రయత్నం ఏమీ లేదు. సినిమా ఇలా మొదలవుతోనే హీరో మీద సాంగ్ నే చెబుతుంది ఈ విషయాన్ని. అక్కడ నుంచి తొలిసగం అయ్యేవరకు ఈ రెగ్యులర్ టేకింగ్ అన్నది అలాగే కొనసాగుతుంది. అయితే ఈ సీన్లను కాస్తయినా ఆసక్తి కలిగించేలా మలచింది కేవలం డెప్త్ తో రాసుకున్న సంభాషణలు మాత్రమే. ఈ సంభాషణల కారణంగానే దర్శకుడు తెరపైకి తెచ్చిన రొటీన్ సీన్లకు కాస్త డెప్త్ వచ్చింది తప్ప వేరు కాదు. అలా ఓ మాదిరిగా వుంది అనిపించేలా తొలిసగం ముగిసింది.

తొలిసగం ముగిసిన తరువాత ఇక లవ్ ట్రాక్ మీద దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. బ్యాలెన్స్ చేయలేదు. పూర్తిగా హీరో కెరీర్ ట్రాక్ మీదనే దృష్టి పెట్టాడు. దాంతో ఆ సీన్లు ఏవీ అంత ఆసక్తికరంగా తయారుకాలేదు. తన తయారుచేసిన అప్లికేషన్ బాగా పనిచేస్తుందని రుజువు చేయడం కోసం తనను తానే ప్రమాదంలో పడేసుకోవడం అన్న పాయింట్ పూర్తిగా సినిమాటిక్ గా, గతంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ సినిమాను గుర్తుకు తెచ్చేలా వుంది.

సినిమాకు ప్లస్ గా నిలిచింది హీరో సాయి తేజ్ పెర్ ఫార్మెన్స్. దర్శకుడు రాసుకున్న సంభాషణలు. సాయి తేజ్ తన కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా సెటిల్డ్ గా, నాచురల్ గా నటించాడు. హీరోయిన్లు ఇద్దరూ వృధానే. సరైన హీరోయిన్లను టీమ్ లోకి తీసుకోవడంలో యూనిట్ విఫలమైంది. సినిమాకు అది పెద్ద వీక్ పాయింట్. సునీల్ ఫన్ లో స్పార్క్ లేదు. వెన్నెల కిషోర్ కాస్త బెటర్.

సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ పాటలు బాగానే ఇచ్చినా నేపథ్యసంగీతం మాత్రం టూ లౌడ్ గా వుంది. అందులో సౌండ్ తప్ప, సీన్ ఎలివేషన్ అంతగా లేదు. దర్శకుడు కిషోర్ తిరుమల తన పాత లైన్ స్క్రిప్ట్ ను మరికాస్త పకడ్బందీగా తయారుచేసుకుని వుంటే సినిమా కాస్త బాగుండేది.

టోటల్ సినిమా జనాలను థియేటర్ లో సంతృప్తిగా కూర్చోపెట్టడంలో విఫలమైందనే చెప్పాలి. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ రిలీఫ్ అన్నది కాస్తయినా లేకపోయి వుంటే మరీ దారుణంగా వుండేది పరిస్థితి.

ఫైనల్ టచ్….సాదా సీసాలో పాత సారా

తెలుగు360 రేటింగ్‌ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com