ఇన్నాళ్ల‌కు ఏపీ కాంగ్రెస్ కు గుర్తొచ్చిన త‌ల్లి ప్రేమ..!

పోల‌వ‌రం ప్రాజెక్టును 2018 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తి చేయాల‌నే ఒత్తిడిని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పెంచాల‌న్న‌దే ఏపీ కాంగ్రెస్ ల‌క్ష్య‌మని పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన మ‌హా పాద‌యాత్ర రెండో రోజుకు చేరుకుంది. కొవ్వూరు నుంచి 17 కిలోమీట‌ర్ల దూరం సాగే ఈ యాత్ర‌లో ర‌ఘువీరాతోపాటు పార్టీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ టీవీ ఛానెల్ తో ర‌ఘువీరా మాట్లాడారు. పోల‌వ‌రం త‌మ బిడ్డ అనీ, దాన్ని మ‌ళ్లీ బ‌తికించుకుంటామ‌ని అన్నారు. ఈ ప్రాజెక్టును నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ స‌త్వ‌ర‌మే పూర్తి చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ఎప్పుడో 1981లో మొద‌లైన పోల‌వ‌రం ప్రాజెక్టు కాంగ్రెస్ హ‌యాంలో జీవం పోసుకుంద‌ని ర‌ఘువీరా చెప్పారు. దాదాపు రూ. 5,200 కోట్లు ఖ‌ర్చు చేసి కుడి ఎడ‌మ కాలువ‌ల ప‌నులను కాంగ్రెస్ స‌ర్కారు పూర్తి చేసింద‌న్నారు. ప్ర‌స్తుతం తామే అధికారంలో ఉన్నట్టయితే ఈపాటికే ప్రాజెక్టు ప‌నులు పూర్తైపోయేవి అన్నారు. దుర‌దృష్టవ‌శాత్తూ టీడీపీ, భాజ‌పాలు అధికారంలోకి వ‌చ్చాయ‌న్నారు. ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యాన్ని ఇష్టానుసారంగా పెంచేశార‌నీ, క‌మీష‌న్ల‌ను ఏ విధంగా పంచుకోవాలో అని ఆలోచిస్తున్నారంటూ ఆరోపించారు. ప‌నులు ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం భాజ‌పా, టీడీపీల తీరేననీ, ఈ ప్రాజెక్టు వారికి బంగారు బాతు గుడ్డులా మారింద‌నీ, అందుకే ప‌నుల్ని వీలైనంత న‌త్త న‌డ‌క‌న సాగేలా అడ్డుప‌డుతున్నారు అంటూ మండిప‌డ్డారు.

ర‌ఘువీరా మాట‌ల్లో ‘పోల‌వ‌రం మా బిడ్డ‌’ అన‌డం బాగుంది! కానీ, పోల‌వ‌రంపై ఇప్పుడు ఒల‌క‌బోస్తున్న ఈ త‌ల్లి లేదా తండ్రి ప్రేమ ఇన్నాళ్లూ ఏమైంద‌నేదే ప్ర‌శ్న‌..? మూడున్న‌రేళ్లుగా పోల‌వ‌రం గురించి ఈ స్థాయిలో మాట్లాడిన సంద‌ర్భాలేవీ..? స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం ముందు వ‌ర‌కూ ఈ పేగు బంధం గుర్తుకురాలేదా..? పోల‌వ‌రాన్ని జాతీయ ప్రాజెక్టు చేసింది కూడా తామే అని ఇప్పుడు ర‌ఘువీరా చెబుతున్నారు. అలాంట‌ప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది క‌దా! అంత బాధ్య‌త ఉంటే… పోల‌వ‌రం పూర్తి చేసేందుకు ఒత్తిడి పెంచాలంటూ ఢిల్లీలోని హైక‌మాండ్ ద‌గ్గ‌ర‌కి ఏపీ నేత‌లు వెళ్లి విన్నివించిన సంద‌ర్భాలు ఏవైనా ఉన్నాయా..? త‌మ హాయంలో పోల‌వ‌రం ప‌నులు కొన్ని జ‌రిగాయి కాబ‌ట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఘ‌న‌తను త‌మ ప్ర‌చారాస్త్రంగా మార్చుకోవాల‌న్న స్పృహ ఇన్నాళ్ల‌కు వ‌చ్చింది కాబ‌ట్టి… ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఇంత హ‌డావుడి మొద‌లుపెట్టార‌ని ఎవ‌రికి మాత్రం అర్థం కాదు చెప్పండీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.