నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కేవలం జనాభా లెక్కల సవరణ మాత్రమే కాదు. అది రాజకీయ చదరంగంలో అత్యంత కీలకమైన ఘట్టం. పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగడం అనేది కేంద్రం పరిధిలోని అంశమైనప్పటికీ, రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే డీలిమిటేషన్ కమిషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. సాంకేతికంగా ఇది స్వతంత్ర ప్రక్రియే అయినా, క్షేత్రస్థాయిలో భౌగోళిక హద్దుల మార్పులు, మండలాల విలీనం వంటి విషయాల్లో అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదిపే అవకాశం ఉంటుంది. తమకు పట్టున్న ప్రాంతాలను ఒకే నియోజకవర్గంలోకి చేర్చడం లేదా ప్రత్యర్థి పార్టీల కంచుకోటలను ముక్కలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే సగం విజయాన్ని ఖరారు చేసుకోవచ్చనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం.
వైఎస్సార్ నాటి వ్యూహం – టీడీపీ కంచుకోటల విచ్ఛిన్నం
గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాల స్వరూపాన్ని విచిత్రంగా మార్చేశారు. నర్సరావుపేట, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాలను చీల్చేసి.. టీడీపీ కంచుకోటల్ని కూల్చేశారు. ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలను చీల్చడం లేదా రిజర్వేషన్ల మార్పుల ద్వారా టీడీపీ సీనియర్ నేతల నియోజకవర్గాలను గాలిలో దీపాలుగా మార్చడంలో వైఎస్సార్ సఫలమయ్యారు. దీనివల్ల 2009 ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, భౌగోళిక మార్పుల వల్ల ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అదే అవకాశం చంద్రబాబు నాయుడికి రాబోతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఈసారి ఏపీలో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేలా హద్దుల నిర్ణయంలో తన ముద్ర వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డికి సవాల్ – హైదరాబాద్ ఫ్యాక్టర్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ డీలిమిటేషన్ ఒక గొప్ప అవకాశం. అయితే, ఇక్కడ ఒక చిక్కు ఉంది. తెలంగాణలో జనాభా పెరుగుదల ఎక్కువగా హైదరాబా, దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. పెరిగే సీట్లలో మెజారిటీ ఈ అర్బన్ ఏరియాల్లోనే ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ అంత బలంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు పట్టు ఉన్నప్పటికీ, అక్కడ సీట్ల సంఖ్య పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి, పెరిగే కొత్త సీట్లు రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతవరకు అడ్వాంటేజ్ ఇస్తాయనేది సందేహమే. హైదరాబాద్ చుట్టుపక్కల హద్దులను ఎలా మార్చినా, అక్కడ ఉన్న పట్టణ ఓటర్ల మొగ్గును బట్టే ఫలితాలు ఉంటాయి తప్ప, కేవలం హద్దుల మార్పుతోనే కాంగ్రెస్ పాగా వేయడం కష్టమని అంచనా వేస్తున్నారు.
రాజకీయ పునరేకీకరణకు వేదిక
నియోజకవర్గాల పునర్విభజన కేవలం భౌగోళిక మార్పు కాదు, అది సామాజిక సమీకరణాలను తలకిందులు చేసే ప్రక్రియ. ఏపీలో టీడీపీ తన పాత వైభవాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి పెరిగే అర్బన్ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి కొత్త వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ గ్రామాన్ని ఏ నియోజకవర్గంలో కలపాలో నిర్ణయించే సమయంలో జరిగే లాబీయింగ్ రాబోయే దశాబ్ద కాలపు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. 2026 డీలిమిటేషన్ అనేది అధికార పార్టీల చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం కాబోతోంది. దీనిని చంద్రబాబు ఏపీలో ఎలా వాడుకుంటారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎలా ఎదుర్కుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
