‘రాజాసాబ్’ తరవాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమాని నిలపడానికి చిత్రబృందం కృషి చేస్తోంది. ఇప్పటికైతే టాకీ దాదాపు పూర్తయినట్టే. ఇక యాక్షన్ పార్ట్ బాకీ. అందుకోసం దాదాపు 100 రోజులు షూట్ చేయాల్సివుంది. దసరా అక్టోబరులో ఉంది కాబట్టి, ఈలోగా చిత్రీకరణ పూర్తి చేసే అవకాశాలే ఎక్కువ. అంతగా కాకపోతే… సెకండ్ యూనిట్ ని రంగంలోకి దింపి షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ తో చిత్రబృందం చాలా సంతృప్తితో ఉంది.
`రాజాసాబ్` విమర్శల పాలైన నేపథ్యంలో ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ సినిమా అనగానే, యాక్షన్ పార్ట్ బాడీ డబుల్, డూప్‌తో తీస్తారన్న ఓ విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ‘ఫౌజీ’ కోసం మాత్రం వీలైనంత వరకూ డూప్ ని దూరంగా ఉంచాలని ప్రభాస్ భావిస్తున్నారు. ‘స్పిరిట్’ లోనూ డూప్ వాడడానికి సందీప్ రెడ్డి వంగా ఇష్టపడడం లేదు. ఇక నుంచి అన్నీ వర్జినల్ షాట్సే ఉండాలని పట్టుబడుతున్నారు. `పౌజీ`లోనూ ఆ మార్పు కనిపించనుందని టాక్. అవసరమైతే తప్ప డూప్ వాడకూడదన్నది ఓ కండీషన్ గా పెట్టుకొన్నారని తెలుస్తోంది. అభిమానులు సినిమాకు వచ్చేది తమ హీరోని వెండి తెరపై చూడడానికే. అంతే తప్ప డూప్ కోసం కాదు. ఈ విషయాన్ని హీరోలంగా గ్రహిస్తే బాగుంటుంది. ప్రభాస్ లో ఈ మార్పు ఆహ్వానించదగినదే.

