జీవీఎల్ విమ‌ర్శించార‌ని ఏదీ ఆగిపోదు క‌దా..!

ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు భాజ‌పా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు. ఆంధ్రా అభివృద్ధిలో చివ‌రి స్థానంలో ఉంద‌నీ, అవినీతిలో ప్ర‌థ‌మ స్థానం ద‌క్కించుకుంటుంద‌న్నారు! ప్ర‌భుత్వ పెద్ద‌లు వారి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. అమ‌రావ‌తి బాండ్ల విష‌యంలో ఆయ‌న చాలా విమ‌ర్శ‌లు చేశారు! ఈ బాండ్ల జారీ విష‌యంలో కూడా అవినీతి జ‌రిగింద‌నీ, దేశంలో ఎక్క‌డాలేని విధంగా అత్య‌ధికంగా వ‌డ్డీని ఇస్తామ‌ని చెప్ప‌డం ద్వారా రాష్ట్రంపై భారం పెంచుతున్నార‌న్నారు. బాండ్ల జారీ వ‌ల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. అంతేకాదు… తెలుగుదేశం చేస్తున్న ప్ర‌తీ ప‌నిమీదా కేంద్రం నిఘా పెట్టంద‌ని చెప్పారు!

రాష్ట్రాల‌పై కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి ఉంటుంది. ఏవైనా త‌ప్పులు చేస్తే నిఘా పెట్టొచ్చు కూడా..! ఆంధ్రా విష‌యంలో కేంద్రం బాధ్య‌త‌ను విస్మ‌రించి… ఇప్పుడు నిఘా పెట్టించామ‌ని జీవీఎల్ లాంటివాళ్లు విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌రిస్థితి. అమ‌రావ‌తి బాండ్ల విష‌య‌మే తీసుకుంటే… రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం అన్ని ర‌కాలుగా సాయం చేసే ప‌రిస్థితి ఉంటే, నిధుల సేక‌ర‌ణ‌కు వేరే మార్గాల‌ను అన్వేషించాల్సిన అవ‌స‌రం ఏముంటుంది..? రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది రూ. 1500 కోట్లు మాత్ర‌మే! దాంతో ఒక రాజ‌ధాని న‌గ‌రంలో ఏ మేర‌కు నిర్మాణాలు జ‌రుగుతాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అమ‌రావ‌తికి ఒక బ్రాండ్ వేల్యూ సృష్టించి, దాని ద్వారా నిధుల సేక‌ర‌ణ‌కు ఇవాళ్లా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కి ఏపీ వెళ్లింది.

అయితే, ఇక్క‌డ జీవిఎల్ గుర్తించాల్సింది ఏంటంటే… ఆయ‌న విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లూ చేసినంత మాత్రాన అవి ఏపీ బ్రాండ్ వేల్యూని ప్ర‌భావితం చెయ్య‌లేవు. ఏపీలో పెట్ట‌బ‌డులు పెడ‌దామ‌ని అనుకునే పెట్టుబ‌డి దారుల‌కు బ్రాండ్ వేల్యూ ముఖ్యం. రాష్ట్రంలో ఉన్న నాయ‌క‌త్వంపై న‌మ్మకంతోనే వస్తారు. వాస్త‌వానికి… ఇలా బాండ్లు అమ్మ‌డాన్ని త‌ప్పు అని ప్ర‌శ్నించాల‌నుకుంటే… అహ్మ‌దాబాద్, హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, పూణేల్లో కూడా ఇలానే నిధుల సేకరణ జరిగింది కదా. అంతెందుకు, గుజ‌రాత్ లో కూడా ఇలా నిధుల సేక‌ర‌ణ చేసింది. ప్ర‌భుత్వ‌మే భ‌రోసా క‌ల్పిస్తున్న ప‌రిస్థితి ఉంటే.. పెట్టుబ‌డులు వస్తాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంపై నమ్మకం అవి మరింత ఎక్కువగా వస్తాయి. ఇవాళ్ల అమరావతి విషయంలో వస్తుందన్న స్పందన అలాంటిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com