ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకర పోస్టులు, విద్వేషపూరిత ఫ్లెక్సీలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా కేసుల్లో తనపై జారీ అయిన లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని హైకోర్టు మండిపడింది. ఒకసారి అరెస్టు అయిన వారు కూడా బెయిల్పై బయటకు వచ్చి, మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తూ పోస్టులు పెడుతుండటంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే చట్టం పట్ల భయం లేకుండా పోయిందని అభిప్రాయపడింది. గతంలో న్యాయమూర్తులపైనే దారుణమైన పోస్టులు పెట్టినప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే, పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఫ్లెక్సీలపై రాస్తున్న భాషను కూడా హైకోర్టు తప్పుబట్టింది. మేము చేయబోతే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం అని ఫ్లెక్సీలపై రాయడం ఏమిటని నిలదీసింది. ఎవరిని ధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? లేక ప్రజల్నా? అని పిటిషనర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధ్వంసకర ఆలోచనలకు చోటు లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ, వ్యక్తిగత దూషణలు , అరాచకాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలను ఉపేక్షించలేమని కోర్టు పేర్కొంది.
సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూనే, సోషల్ మీడియా అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, వ్యవస్థలను కించపరిచే వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించింది.


