ఎడిటర్స్ కామెంట్ : శ్రీలంకకు మనం ఎంత దూరం !?

“శ్రీలంకలో రేట్లు వందల శాతం పెరిగిపోయిందట. అక్కడ పెట్రోల్ మూడు వందలు దాటిపోయింది. వంట నూనె అంతే. గుడ్లు కూడా దొరకడం లేదు. టీ, కాఫీలు కూడా మూడు వందలు అయ్యాయి..ఇదిగో బిల్స్” అంటూ రెండు మూడు నెలల కిందట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే చాలా మంది… శ్రీలంకలో రేట్స్‌ను ఇండియాలో రేట్స్‌తో కంపేర్ చేశారు. పెద్ద తేడా లేదు. ఎందుకంటే మన రూపాయితో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ తక్కువ. అందుకే ఇక్కడ మన రూపాయల్లో పెట్రోల్ రూ. 120 అయినా శ్రీలంకలో అది నాలుగు వందలతో సమానం. అంటే అంటే శ్రీలంకతో పోలిస్తే ఇండియాలోనే రేట్లు ఎక్కువ., ఇలా ఒక్కటి కాదు. అన్నీ నిత్యావసర వస్తువులు అంతే. అందుకే.. ఇండియా శ్రీలంకకు ఎంతో దూరం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరించడం ప్రారంభించారు. అవి హెచ్చరికలు కాదు.. ప్రమాద సంకేతాలని.. నిన్నామొన్న ఆర్బీఐ హడావుడిగా వడ్డీ రేట్లను భారీగా పెంచేయడం నిరూపించింది. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని ఆర్థిక నిపుణులు ఆందోలన చెందుతున్నారు. చేయిదాటిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీనికి పరిష్కారం కనుగొనకపోతే … జాగూరుకతతో వ్యవహరించకపోతే శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయంటున్నారు.

శ్రీలంక సంక్షోభం తొలి నాళ్ల పరిస్థితులు ఇప్పుడు ఇండియాలో !

రెండేళ్ల కిందట లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 70కి అటూ ఇటూగా ఉండేది. ఇప్పుడు అది రూ. రెండు వందలు దాటిపోయింది. కానీ తగినంత అందుబాటులో ఉందా అంటే… సూపర్ మార్కెట్లలో ఐదు లీటర్ల క్యాన్లే కనిపించడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం కారణం అని చెబుతున్నారు కానీ ఇంత పెద్ద మన దేశం సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం ఉక్రెయిన్ మీద అంత స్థాయిలో ఆధారపడ్డామా ? నిజమే అయితే ఇతర వంట నూనెల ధరలు ఎందుకు పెరిగాయి. పెరిగింది ఒక్క వంట నూనే కాదు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. 2021తో పోలిస్తే గ‌త నెల రిటైల్ ద్య్ర‌వ్యోల్బ‌ణం స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. వంట నూనెలు, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో ఏప్రిల్ 2022 చిల్ల‌ర ద్ర‌వ్యోల్బ‌ణం 7.79 శాతానికి దూసుకెళ్లింది. 2014 మే తర్వాత అధిక రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. 2014 మేలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 8.33 శాతంగా రికార్డైంది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆరు శాతం క‌టాఫ్‌గా ఆర్బీఐ నిర్దేశించుకుంది. ఈ క‌టాఫ్‌ను మార్క్‌ను దాటి 2022 ఏప్రిల్ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోవ‌డంతో ఆర్థిక వేత్త‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌త మార్చి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 6.95 శాతానికి చేరుకుంది. దీనికి తోడు అన్ని నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో గ‌త‌వారం ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి క‌మిటీ అక‌స్మాత్‌గా స‌మావేశ‌మై రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచింది. 2018 అక్టోబ‌ర్ త‌ర్వాత ఆర్బీఐ రెపోరేట్ పెంచ‌డం ఇదే తొలిసారి. ఈ శాతాల్లో చెబితే సామాన్యులకు అర్థం కాదు కానీ పెరిగిన రేట్ల వారీగా చూస్తే… ఆరు నెలల్లో నిత్యావసర వస్తువుల రేట్లు సగానిపైగా పెరిగిపోయాయి. అందుకే ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఇది శ్రీలంక సంక్షోభం తొలి నాళ్లలో ఉన్న పరిస్థితిలానే ఉంది. అందుకే దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు.

వస్తూత్పత్తి రంగంలో కనిపించని పురోగతి !

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మాసంలో భారత వస్తూత్పత్తి రంగంలో ముఖ్యంగా వినియోగ వస్తువుల తయారీలో ఎలాంటి పురోగతి లేదని తాజా సర్వే బయట పెట్టింది. ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరో పక్క పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను ఇప్పటికే ప్రభావితం చేయడం ప్రారంభించాయి. వినియోగ వస్తువుల తయారీ రంగం ఇప్పటికీ నేల చూపులు చూస్తున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. దీనికి అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, నిజ వేతనాలు పడిపోవడం ముఖ్య కారణాలు.

ప్రజల ఆదాయాన్ని పన్నుల రూపంలో దోచేస్తున్న ప్రభుత్వాలు !

ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి మొత్తం పిండుకోవడం కూడా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడటానికి మరో కారణం. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు భరించవు. వాటిని వినియోగదారులపైకే నెట్టివేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్‌ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గత నలబై రోజుల్లో 14 సార్లు పెంచింది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు ముండుతున్నాయి. ఏప్రిల్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రూ.1.68 ల‌క్ష‌ల కోట్ల జీఎస్టీ వ‌సూలైంది. గ‌తేడాది జూలై నుంచి రూ.1.10 ల‌క్ష‌ల కోట్లు వ‌సూలయ్యాయి. జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చాక ప‌న్ను వ‌సూళ్లు రూ.1.5 ల‌క్ష‌ల కోట్లు దాట‌డం ఇదే తొలిసారి. గ‌త‌నెల‌లో రూ.1.42 ల‌క్ష‌ల కోట్ల పై చిలుకు వ‌సూల‌య్యాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సమయంలో ఇంత భారీగా న్ను వసూళ్లు ఎలా సాధ్యమయ్యాయి..?. పెరుగుతున్న ధరలతో పాటుగా ప్రభుత్వ పన్ను కూడా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా ప్రజల్ని పండిస్తున్నారు. ఫలితంగా ప్రజల ఆర్థిక శక్తి క్షీణించిపోతోంది. అంటే ఆర్థిక వ్యవస్త పతనమవుతోందన్నమాట. ఈ విషయాన్ని గుర్తించని ప్రభుత్వాలు.. అత్యధిక పన్నుల వసూళ్లే అభివృద్ధికి ఆనవాళ్లన్నట్లుగా ఘనంగా ప్రకటించుకుంటోంది.

శ్రీలంక పరిణామాలు.. ఇండియాలో జరుగుతున్న పరిణామాలు !

శ్రీలంక లో బద్దలైన ఆర్థిక సంక్షోభం గురించి ఇప్పటికిే చాలా సమాచారం వెలుగులోకి వచ్చింది. విదేశీ రుణం భారీగా పేరుకుపోవడం, ద్రవ్య లోటు పెరిగిపోవడం, దేశీయంగా చేయవలసిన ఖర్చు నిమిత్తం కూడా విదేశీ రుణం తీసుకోవడం, విదేశీ మారక ద్రవ్యం రాబడి పడిపోవడం, శ్రీలంక కరెన్సీ మారకపు రేటు పతనం కావడం, విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం, విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ రాజ్య నమూనాగా సాగించిన ఉచిత పథకాలు ఇలా రకరకాల కారుణాలు. తరచి చూస్తే ఇవన్నీ ఇండియాకు అన్వయిచాల్సిన పరిస్థితులు. దేశంతో పాటు రాష్ట్రాలపైనా పెద్ద ఎత్తున అప్పుల భారం ఉంది. రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోతోంది. కానీ పాలకులు గుర్తించడం లేదు. కొనుగోలుశక్తి పడిపోవడం, ఉత్పత్తి మందగించడం, నిరుద్యోగం వంటివి పెరుగుతున్నా.. వాటిలో పూర్తిగా ఇరుక్కుపోయిన తర్వాత గాని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. గ్రీస్, శ్రీలంక సహా అనేక దేశాల్లో జరిగింది ఇదే. పూర్తిగా మునిగిపోయిన తర్వాతనే గుర్తించారు. కానీ అప్పటికే ప్రజల్ని ఆయా దేశాల అధినేతలు చీకట్లో ముంచేశారు.

మేలుకోవాల్సిన సమయం…తేడా వస్తే కనివినీ ఎరుగని సంక్షోభమే !

శ్రీలంక చిన్న దేశం. అక్కడ తేడా వస్తే జరుగుతున్న పరిణామాలేమిటో కళ్ల ముందు చూస్తున్నారు. ఆ దేశం గుణపాఠాల నుంచి ఇండియా వేగంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పాలకులు నేర్చుకోవాలి . భారత్‌లో సమస్య అంతా రాజకీయంతోనే వస్తోంది. రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి. రాజకీయమే చేయాలి. అదే న్యాయం. రాజకీయం అంటే కుట్రలు కుతంత్రులకు పర్యాయపదం అన్నట్లుగా మారిపోయింది. రాజకీయం అంటే అధికారంలో ఉన్న పార్టీ పక్కాగా పరిపాలించాలి. ప్రజా కోణంలో.. పరిపాలించాలి. ప్రజా కోణం అంటే పన్నులు, అప్పుల రూపంలో డబ్బులు సేకరించి వారికి పంపిణీ చేయడం కాదు. ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా బతికేలా చేయగలగడం. కానీ ఇండియాలో రాజకీయ పార్టీలు ప్రజలు తమపై ఆధారపడితేనే తమకు ఓట్లేస్తారు కాబట్టి అలాగే చేస్తున్నారు. పాలక పార్టీలు అదే చేస్తున్నాయి. ఏవీ చేయకూడదో అవే చేస్తున్నాయి. వీరు చేస్తున్నారు కదా అని.. తాము చేయకూడదా అని తర్వాత వచ్చే పార్టీలు చే్తున్నాయి. ఫలితంగా అది అలా జరిగిపోతూ.. పెరిగిపోతూవస్తోంది. ఇప్పుడు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. పాలకులు ఇప్పుడు తేరుకుని వెంటనే కట్టడి చర్యలు తీసుకోవాలి.

కేంద్రానిదే కీలక బాధ్యత !

భౌగోళికంగా శ్రీలంక మనకు చాలా దగ్గర. ఆర్థిక సంక్షోభంలోనూ ఆ దేశానికి దగ్గర కాకూడదు. దురదృష్టవశాత్తూ ఆ దారిలో ఉన్నామన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మన చుట్టుపక్కన జరుగుతున్న పరిణామాల్ని బట్టి మనకు ముందు జాగ్రత్తపడే అవకాశం లభించింది. దీన్ని ఓ చాన్స్‌గా తీసుకోవాలి. తక్షణం ఆర్థిక విధానాల్ని రివ్యూ చేసుకోవాలి. అప్పనంగా ప్రజలకు పంచుతున్న డబ్బులు.. వాటి కోసం చేస్తున్న అప్పులు… ప్రజల్నుంచి పీడించి వసూలు చేస్తున్న పన్నులు..ఇలా ప్రతీ అంశాన్ని సమీక్షించాలి. దేశంలోని అత్యున్నత ఆర్థికవేత్తలతో సంప్రదింపులు జరిపాలి.

ఈగోలకు పోతే నష్టం రాజకీయ నాయకులకు కాదు.. దేశానికి .. ప్రజలకు. పాలనస్థానంలో ఉన్న వారు ఈగోలకు పోకూడదు. ఒక వేళ అలాంటి పంతాలకు పోతే.. తర్వాత ఏం జరుగుతుందో.. శ్రీలంక మనకు చూపిస్తోంది. ప్రజల కడుపు కాలితే… వారిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. అలాంటి పరిస్థితులు రాకుండా.. మనం శ్రీలంకకు చాలా దూరం ఉన్నామని నిరూపించే ప్రయత్నం చేయాలి. అది చేయాల్సింది పాలకులే. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే నష్టం జరిగేది ప్రజలకు.. దేశానికి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close