క్రైమ్: హైదరాబాద్ స్పెషల్ లిక్కర్ చాక్లెట్లు.. !

హైదరాబాద్ క్లబ్బులు, పబ్బులు కొత్త కొత్త పోకడలకు పోతున్నాయి. గతంలో డ్రగ్స్ నింపిన సిగరెట్లను అమ్మినట్లు బయటపడింది. ఈ సారి మరింత కొత్తగా.. లిక్కర్‌తో చాక్లెట్లు తయారు చేయించుకుని… చప్పరించమని పంపిణీ చేస్తున్నారు. విదేశీ తయారీ పేరుతో లోకల్‌మేడ్ చాక్లెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. లిక్కర్ బ్రాండ్ చాక్లెట్లు విదేశాలలో మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ… బాగా డబ్బు చేసిన మనుషులు వీటిని వాడుతూంటారు. దిగుమతి చేసుకుంటే.. ఎక్కువ ఖర్చయిపోతుందని.. స్థానికంగానే తయారు చేస్తున్నారు. ఒక కిలో పరిమాణంలో చాక్లెట్ తయారు చేయాడానికి 100ఎంఎల్ లిక్కర్‌ను కలుపుతున్నారు.

గత కొన్నేళ్ళుగా సాగుతున్న ఈ లిక్కర్ చాక్లెట్ల దందాపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అమీర్ పేట్, అబిడ్స్ లోని చాక్లెట్ డిస్టిబ్యూటర్ల గోదాముల్లో సోదాలు చేశారు. 1081 చాక్లెట్ల ను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లలో వివిధ మల్టీ బ్రాండ్స్, విస్కీ, కాస్ట్లీ మద్యం పేర్లతో ఉన్న చాక్లెట్లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉందని గుర్తించిన పోలీసులు…ఇద్దరు డిస్టిబ్యూటర్లపై కేసులు నమోదు చేసారు. ఈ దాడుల్లో కిలోన్నర విస్కీ చాక్లెట్లు, కిలోన్నర రమ్ చాక్లెట్లు, ఆరున్నర కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు।

ఒక్కో చాక్లెట్‌ ఖరీదు … లిక్కర్ బ్రాండ్ బట్టి రూ. 15 వందల నుండి 2 వేల వరకు ఉంది. ఆన్‌లైన్ ద్వారా కూడా హైదరాబాద్ లో లిక్కర్ చాక్లెట్ ఎక్కువ గా ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించా పోలీసులు గుర్తించారు. విశేషం ఏమిటంటే.. ప్రతి మద్యం బాటిల్ మీద.. కచ్చితంగా హెచ్చరిక గుర్తు ఉండాలి. కానీ ఈ లిక్కర్ చాక్లెట్లపై.. అలాంటివేమీ వేయడం లేదు. లిక్కర్ చాక్లెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పబ్బులు, క్లబ్బులకు హెచ్చరికలు జారీచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com