ఫామ్ హౌస్ అంటే అదోస్టేటస్. నిజానికి పామ్ హౌస్ అని పేరు లగ్జరీగా పెట్టుకుంటారు కానీ.. అది పంటలు పండించుకునే పొలం. అక్కడ ఓ కంటెయినర్ హౌస్ లేదా.. రేకుల షెడ్డు వేసుకున్నా ఫాంహౌస్ అవుతుంది. ఇక్కడ అసలు విషయం హౌస్ కాదు.. ఫాం మాత్రమే. ఒకప్పుడు కుబేరులకు మాత్రమే హైదరాబాద్ శివారులో ఫామ్ హౌసులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది ఫామ్ ప్లాట్ల పేరుతో పావు ఎకరం అమ్మి అంతలో కంటెయినర్ హౌస్ పెట్టేసి.. అదే ఫామ్ హౌస్ అని నమ్మిస్తున్నారు.
అలాంటి ఫామ్ ప్లాట్లు కాకుండా.. కనీసం రెండు నుంచి ఐదు ఎకరాల భూమి సొంతంగా కొనుగోలు చేసే స్థోమత పెరుగుతోంది. అందుబాటులో ఉన్న ధరల్లోనే వ్యవసాయ భూములు లభిస్తున్నాయి. హైదరాబాద్ నుండి 40-50 కి.మీ., రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కందుకూరు వద్ద వ్యవసాయ భూములు పదిహేను లక్షల నుంచి లభిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ పల్లి , చేవెళ్ల వైపు పాతిక లక్షలకు ఎకరం లభిస్తోంది. కోటి రూపాయలు పెట్టగలిగే వారికి నాలుగైదు ఎకరాల ఫామ్ హౌస్ లభిస్తోంది. హైదరాబాద్ నుండి 50-70 కి.మీ., ముంబై హైవే కు సమీపంలో పెద్దాపూర్ దగ్గర కూడా పది లక్షల్లో ఎకరం లభిస్తోంది.
వికారాబాద్ జిల్లా పెద్దముల్ హైదరాబాద్ నుండి 60-80 కి.మీ ఉంటుంది. ఎకరం పది లక్షలకూ ఇక్కడ పొలాలు లభిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం – రాచల ప్రాంతంలోనూ వ్యవసాయ భూములు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఓ మాదిరి ఇల్లు కొనాలంటే.. కనీసం కోటి రూపాయలు అవుతోంది. ఆ మాత్రం పెట్టుకుంటే శివారు ప్రాంతాల్లో నాలుగైదు ఎకరాలు వస్తుంది. ఫామ్ హౌస్ ఓనర్లు కావొచ్చు.