ప్రొ.నాగేశ్వర్ : జనసేన కూటమి ప్రభావం ఎంత..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తులు పెట్టుకుని…ఈ ఎన్నికల్లో తనదో కీలక కూటమి అని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. సీట్ల పంపిణీ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రభావం.. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమయింది.

పవన్ కల్యాణ్ గెలుస్తారా..? ఓడిస్తారా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులతో.. రాజకీయల్లో తన ప్రభావం గట్టిగానే ఉంటుందన్న సూచనలు పంపారు. అయితే.. పవన్ కల్యాణ్ గెలుస్తాడా.. అన్న ప్రశ్న అయితే లేదు… ఎవర్ని ఓడిస్తారు..? అనే ప్రశ్నే అక్కడ కీలకంగా మారుతోంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచేంత రాజకీయ పరిస్థితి లేదు. అదే సమయంలో… పది, పదిహేను సీట్లు సాధించి కింగ్ మేకర్ అయినప్పటికీ… ఆయనకు ఆ అవకాశం రాకపోవచ్చు. జనసేన పార్టీ పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. తెలంగాణ కేసీఆర్ పట్టుకుపోయినట్లు.. ఆ ఎమ్మెల్యేలను… వైసీపీ, టీడీపీ పట్టుకుపోతాయి. ఒక వేళ పట్టుకుపోకపోయినా.. ఇక్కడ కర్ణాటక తరహా రాజకీయం లేదు. పవన్‌కు ఆయా పార్టీలు మద్దతివ్వాలన్న పరిస్థితి కూడా లేదు. అందుకే పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి అయ్యే వాతావరణం మాత్రం లేదు. అయితే.. పవన్ కల్యాణ్ పార్టీకి ఇప్పుడు ఇతరుల్ని ఓడించే సామర్ధ్యం ఉంది. జనసేన, లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో కలిస్తే కచ్చితంగా… ప్రభావం చూపే స్థాయిలో ఓట్లు వస్తాయి. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే ఈ ఓట్లు ఎక్కువగా వస్తాయి.

పవన్ కల్యాణ్ చీల్చేవి ఎవరి ఓట్లు..?

పవన్ కల్యాణ్‌ పార్టీ ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమని కొంత మంది విమర్శలు చేస్తూ ఉంటారు. దీనిపై పవన్ కూడా స్పందించారు. తన పార్టీ ఆ రెండు జిల్లాకు పరిమితమని చెబుతున్నారని.. కానీ తనది అన్ని ప్రాంతాల పార్టీ అని ప్రకటించారు. ఎందుకంటే.. ఆ రెండు జిల్లాలో కాపులు ఎక్కువగా ఉంటారు. సామాజికవర్గ పరంగా.. ఆ పార్టీకి ఎక్కువగా అక్కడ మద్దతు లభిస్తుందని అనుకుంటారు కాబట్టి ఇలా చెబుతున్నారు. అయితే.. పవన్ కల్యాణ్‌ను ఒక్క కాపులే అభిమానిస్తారని.. వాళ్లు మాత్రమే ఓట్లు వేస్తారని కాదు. అదే సమయంలో కాపులంతా.. జనసేనకే ఓటు వేస్తారన్న మాట కూడా నిజం కాదు. అలాగే.. టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్లు మాత్రమే ఓట్లు వేయరు. ఆయా వర్గాల్లో ఆయా పార్టీలకు కొంత ఎక్కువ ఓటు బేస్ ఉంటుంది కానీ.. ఏకపక్షంగా వేయరు. అందుకే.. పవన్ కల్యాణ్‌కు వచ్చే ఓట్లు ఎవరివి అనే చర్చ జరుగుతోంది. దీనికి రెండు ధీయరీలు ఉన్నాయి. ఒకటి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి… ఆయనకు వచ్చే ఓట్లన్నీ టీడీపీకి వేయించారుని.. ఈ సారి ఆయన సొంతంగా పోటీ చేస్తున్నారు కాబట్టి… ఆ ఓట్లన్నీ… టీడీపీ నుంచి మైనస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో… ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబ్టటి… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు… ఆయన పంచుకుంటాడని చెబుతున్నారు. ఈ రెండు ధీయరీల్లో ఏదో ఒకటే నిజం అవుతుంది.

ఎక్కువ నష్టం టీడీపీకే జరుగుతుందా..?

జనసేన ప్రభావం నియోజకవర్గాల వారీగా ఉండొచ్చు. కొన్ని చోట్ల వైసీపీ ఓట్లు.. మరికొన్ని చోట్ల టీడీపీ ఓట్లు ఎక్కువగా చీల్చవచ్చు కూడా. అయితే నా అభిప్రాయం ప్రకారం… తెలుగుదేశం పార్టీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చెప్పడం వల్ల .. తెలుగుదేశం పార్టీకి.. ఆయన అభిమానులు ఓట్లు వేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి వారంతా… పవన్ కల్యాణ్‌కే వేస్తారు. దీని వల్ల … టీడీపీ ఓట్లు తగ్గుతాయి. అయితే.. జనసేనకు వచ్చే ఓట్లన్నీ టీడీపీవి అని చెప్పలేదు. ఓ అరవై తెలుగుదేశం, మరో ముప్ఫై వైసీపీ.. మరో ఇంకో పది కొత్త ఓట్లు కావొచ్చు. ఎవరి ఓట్లు చీల్చినా… పవన్ కల్యాణ్.. ఎవరో ఒకరి ఓటమికి కారణం కాబోతున్నారని మాత్రం చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.