కాళేశ్వరం కి ముఖ్య అతిథిగా జగన్, కెసిఆర్ మీద పాత వ్యాఖ్యలు వైరల్

కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ కెసిఆర్ ఆహ్వానాన్ని పంపించారు. అయితే కెసిఆర్ జగన్ ల మధ్య గత ఆరు నెలలుగా నెలకొన్న సాన్నిహిత్యాన్ని పరిశీలించిన వారు జగన్ ఈ ప్రారంభోత్సవానికి కచ్చితంగా హాజరవుతారని భావిస్తున్నారు. పైగా, కారణాలు ఏంటనేది కచ్చితంగా జనాలకు తెలియదు కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డి కెసిఆర్ కాళ్లు కూడా మొక్కేంత స్థాయిలో వీరి మధ్య బంధం బలపడింది. ఈ నేపథ్యంలో జగన్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఇదే జగన్, కెసిఆర్ మీద ఇదే నీటి పంపకాల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ హిట్లర్ లాగా వ్యవహరిస్తూ, ఎగువ రాష్ట్రం కాబట్టి తానే నీటిని ముందు వాడుకుని, మనకు అన్యాయం చేస్తున్నాడని, జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉన్నాడు. అందుకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

జగన్ గతంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు:

కెసిఆర్ ఆంధ్ర రాష్ట్రానికి తగినన్ని నీరు ఇవ్వకుండా, మనకు అన్యాయం చేస్తున్నాడు అంటూ జగన్ గతంలో ఇచ్చిన ఉపన్యాసం లో చేసిన వ్యాఖ్యలు ఇవీ – “తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకం అన్నది ఎవరి వాటా ప్రకారం వారు వాడుకునేలా ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటాల పై సమీక్ష జరగాలి, అంతే కానీ మేము ఎగువ రాష్ట్రం కాబట్టి మేము ముందు వాడుకుంటాం, ఆ తర్వాత మిగిలినది మీరు వాడుకోవాలి అని చెబితే అది ఇండియా పాకిస్తాన్ వలె మారుతుంది అని నేను చెబుతున్నాను. ట్రిబ్యునల్- మొత్తం 1,400 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే కెసిఆర్ అందులో 950 టీఎంసీ లు నావి మిగిలిన ఐదు వందలు మాత్రమే మీవి అంటున్నాడు. కెసిఆర్ ని నేను అడుగుతా ఉన్నాను ఎవడబ్బ సొత్తు ఇది అని. 950 టీఎంసీలు నావి అని కెసిఆర్ ఎలా అంటారు. కెసిఆర్ గారు ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎంత అవసరం అయిందో అంత ముందు తాను తీసుకుని, మిగిలింది మీకు ఇస్తాను అని ఆయన అనడం సబబేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. కెసిఆర్ గారు ఇలా హిట్లర్ లాగా మాట్లాడటం భావ్యం కాదు అని నేను కెసిఆర్ గారికి చెబుతున్నాను. కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలి, అలాగే చంద్రబాబు గారికి కూడా జ్ఞానోదయం కావాలి. అలా జరగకపోతే ఇండియా పాకిస్తాన్ వలె దేశంలో గొడవలు జరుగుతాయి అది మంచిది కాదు. బ్రహ్మంగారు భవిష్యత్తు లో నీళ్ల వల్లే యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు కెసిఆర్ శైలిి చూస్తుంటే, బ్రహ్మం గారి వ్యాఖ్యలని కెసిఆర్ నిజం చేస్తున్నట్లుగా ఉంది. ” ఇవీ జగన్ వ్యాఖ్యలు.

మొత్తం మీద:

అప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లడం అంటే తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడమే అని నెటిజన్లు అంటున్నారు. పైగా, ఆంధ్ర ప్రదేశ్లో అమరావతి ప్రారంభోత్సవానికి అప్పుడు రాకుండా, ఇప్పుడు తెలంగాణలోని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లడం ఏంటని మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా కెసిఆర్ కుటుంబం అవినీతి కి పాల్పడుతూ కడుతున్న ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ కు చెబుతున్నారు. మొత్తానికి కాలేశ్వరం కారణంగా పోలవరం సహా ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com