రాజకీయాల్లో నాయకుడికి ఉండాల్సిన అత్యంత ప్రధానమైన లక్షణం విశ్వసనీయత . ఒకప్పుడు మాట తప్పను.. మడమ తిప్పను అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తన ప్రతి ప్రసంగంతోనూ ఆ నమ్మకాన్ని తానే స్వయంగా తుడిచేసుకుంటున్నారు. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీబీఐ, సిట్ రిపోర్టులు క్లీన్ చి ‘ ఇచ్చాయని ఆయన చేసిన ప్రకటన ఇందుకు పరాకాష్ట. వాస్తవానికి నివేదికల్లో కల్తీ జరిగిందని ఆధారాలు ఉన్నాయని జాతీయ మీడియా సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టడంతో, జగన్ నవ్వులపాలయ్యారు. సొంత పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని పరోక్షంగా ఒప్పుకోవడంతో జగన్ ఆత్మరక్షణలో పడిపోయారు.
జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు మర్చిపోయి ఉంటారా?
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలు ఆయన రాజకీయ అపరిపక్వత ను బయటపెడుతున్నాయి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో సెటైర్లుగా మారుతున్నాయి. గత ఐదేళ్ల తన పాలనలో సాగిన అరాచకాలు టీడీపీ ఆఫీసులను కూడా వదలకుండా చేసిన అరాచక దాడులు.. తప్పుడు కేసులు.. వంటి ఆటవిక చరిత్రను ప్రజలు ఇంకా మర్చిపోకముందే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాలో ఆయన ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయారు. ప్రతిపక్ష నేత అంటే ప్రజలు నమ్మేలా ఉండాలి కానీ, జగన్ మాటలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతున్నాయి.
జగన్ ఇమేజ్ను నాశనం చేస్తోంది సజ్జలేనా?
జగన్ ఇమేజ్ ఇలా రోజురోజుకూ పతనం కావడానికి కారణమెవరు అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీలో వినిపిస్తోంది. జగన్ వెనుక ఉన్న మేధావులు ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నారా లేక కావాలనే ఆయన్ను తప్పుడు ప్రకటనలతో ప్రజల్లో చులకన చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిపై ఇప్పుడు పార్టీలోనే చర్చ జరుగుతోంది. జగన్ నోట వచ్చే ప్రతి అబద్ధపు మాట వెనుక సజ్జల స్క్రిప్ట్ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు, పార్టీపై పట్టు పెంచుకునేందుకు సజ్జల తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అన్న అనుమానం బలపడుతోంది. నిజానికి నాయకత్వం అంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, చెప్పే మాటలో నిజాయితీ ఉండాలి. కానీ జగన్ రెడ్డి ప్రకటనల్లో ఆ నిజాయితీ పూర్తిగా లోపించింది. టిడిపి ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శలోనూ బురద చల్లడం తప్ప, నిర్మాణాత్మకమైన విమర్శ ఎక్కడా కనిపించడం లేదు. వ్యవస్థలపై గౌరవం లేకుండా, కోర్టులు , దర్యాప్తు సంస్థల నివేదికలను సైతం వక్రీకరిస్తూ మాట్లాడటం వల్ల జగన్ తన ఇమేజ్ను తానే నాశనం చేసుకుంటున్నారు.
నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సజ్జల
సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడిప్పుడే తెరముందుకు వచ్చి నేరుగా బహిరంగ సభల్లో ప్రసంగించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఒక వ్యూహకర్తగా ఉండాల్సిన వ్యక్తి, నాయకుడి ఇమేజ్ను కాపాడాల్సింది పోయి.. ఆయన్ను అబద్ధాల చక్రవర్తిగా మార్చేలా చేసి తాను ప్రజల్లోకి వెళ్తున్నారు. జగన్ నోట అవాస్తవాలు పలికించడం ద్వారా ఆయన్ను ప్రజల్లో పలచన చేసి, పార్టీ బాధ్యతలను తన కంట్రోల్లోకి తీసుకునే కుట్ర జరుగుతోందా అన్న కోణంలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సజ్జల ఇచ్చే తప్పుడు సలహాలే జగన్ను విఫల నాయకుడిగా మారుస్తున్నాయని కేడర్ సైతం ఆవేదన చెందుతోంది. అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా అవి నిజం కావు సదా, అవి చెప్పేవారి పరువునే తీస్తాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తోందో లేక ఆయన స్వయంగా అబద్ధాలకు బానిసయ్యారో గానీ, ఫలితం మాత్రం ఆయన ఇమేజ్ ముక్కలవ్వడమే.ఇప్పటికే అది జరిగిపోయింది.


