గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగిన పాలన కేవలం అధికార కేంద్రీకరణే కాదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని సాగించిన భూదోపిడీ పర్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆధారాలతో బయటపెట్టారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం ఏకంగా రెవెన్యూ రికార్డులనే మార్చేసి, ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వ భూములుగా ఎలా మార్చారో వివరించిన తీరు వైరల్గా మారుతోంది.
హెలిప్యాడ్ కోసం భూకబ్జా
తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలిప్యాడ్ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి సాగించిన వ్యవహారం వింటే సామాన్యులు విస్తుపోవాల్సిందే. అక్కడ హెలిప్యాడ్ కట్టుకోవడానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో, పక్కనే ఉన్న ప్రైవేటు భూమిపై ఆయన కన్ను పడింది. ఆ భూ యజమాని తన భూమిని అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఒక భయంకరమైన కుట్రకు తెరలేపారు. రాత్రికి రాత్రి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, పది ఎకరాల విలువైన ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. సాక్షాత్తూ జగన్ కార్యాలయం కనుసన్నల్లోనే ఈ స్థాయి ట్యాంపరింగ్ జరగడం వ్యవస్థల పతనాన్ని సూచిస్తోంది.
ప్రైవేటు వ్యక్తుల భూమిని ఇంత ఈజీగా లాక్కుంటారా?
ఆ భూమిని ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో చూపిస్తే, అక్కడ ప్రభుత్వ నిధులతోనే హెలిప్యాడ్ నిర్మించుకోవచ్చని ఆ పని చేశారు. అనుకున్నట్లుగానే ప్రజా ధనంతో అక్కడ హెలిప్యాడ్ కట్టుకుని దర్జాగా వాడుకున్నారు. ఒక సామాన్యుడి భూమిని అడ్డగోలుగా లాక్కుని, దానిని ప్రభుత్వ ఆస్తిగా రంగు పూయడం అంటే అది అరాచకానికి పరాకాష్ట. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రికార్డులు మార్చేస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.
హెలిప్యాడ్ ఓ కేస్ స్టడీ అంతే !
హెలిప్యాడ్ ఉదాహరణ కేవలం ఒక మచ్చుతునక మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన భూదోపిడీ విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా. ఒక వ్యక్తి తన ఇంటి పక్కన హెలిప్యాడ్ కోసం పది ఎకరాల రికార్డులనే మార్చేయగలిగితే, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని అక్రమాలకు పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు బయటపెట్టిన ఈ వాస్తవాలు ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. భూమి రికార్డుల్లో మార్పులు చేసి, యజమానులను వివాదాల్లోకి నెట్టి, చివరకు ఆ భూములను కాజేసే ఈ భూ దందా మాఫియా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగింది.
