కేటీఆర్, హ‌రీష్ రావు అస‌లు విష‌యం చెప్పేసిన‌ట్టే..!

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌డం ఒక్క‌టే త‌రువాయి అన్న‌ట్టుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది! అన్ని పార్టీల్లోనూ ఇదే హ‌డావుడి. కాంగ్రెస్ పార్టీ హుటాహుటిన మ్యానిఫెస్టో ప్ర‌క‌టించేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అన్నీ వ‌రాలే అన్న‌ట్టుగా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌లు చేసేశారు. ఇక‌, తెలంగాణ టీడీపీ నేత‌లు కూడా అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రామ్ కూడా ప‌ద్దెనిమిది మందిని పార్టీ ఇన్ ఛార్జ్ లుగా ప్ర‌క‌టించారు. ఓవ‌రాల్ గా అన్ని పార్టీల్లోనూ ఎన్నిక‌ల ఉత్సాహం వ‌చ్చేసింది. ఇక‌, ప్ర‌గ‌తి నివేదన స‌భ‌కు ముందు గుంభ‌నంగా ఉంటూ వ‌చ్చిన తెరాస నేత‌లు కూడా, హుస్నాబాద్ స‌భ నేప‌థ్యంలోనే ఓపెన్ గానే అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన లీకులు ఇచ్చేశార‌నే చెప్పొచ్చు.

హుస్నాబాద్ లో జ‌ర‌గ‌బోయే స‌భా ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్న మంత్రి హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ… ఇది ఎన్నిక‌ల శంఖారావ స‌భ అన్నారు. ఇక్క‌డి నుంచి కేసీఆర్ ఏ కార్య‌క్ర‌మం ప్రారంభించినా విజ‌య‌మే అన్నారు. అందుకే, సెంటిమెంట్ గా ఇక్క‌డి నుంచే ప్ర‌చార కార్య‌క్ర‌మం మొద‌లౌతుంద‌న్నారు! అంటే, అసెంబ్లీ ర‌ద్దు చేసి… ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ముందే చెబుతున్న‌ట్టుగా అర్థం చేసుకోవ‌చ్చు. ఇక‌, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అంశ‌మై లీకులిచ్చారు! నిజానికి, ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ముందు అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన ప్ర‌శ్నలు విలేక‌రులు అడిగితే క‌స్సుల లేచారు! అన్నీ మీరే అనేసుకుని, అన్నీ మీరే రాసేసుకుని మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తే ఏం చెప్తామ‌ని ఓ ప‌ది రోజుల కింద‌ట అన్నారు. మంగ‌ళ‌వారం నాడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించిన కేటీఆర్‌, ఈ సంద‌ర్భంగా కొంత‌మంది ఎమ్మెల్యేలు… ‘సార్.. మనం శుక్రవారం కలుసుకుందాం’ అని ఏదో మాటల సంద‌ర్భంలో అంటే… అప్ప‌టికి అంద‌రం మాజీలు అయిపోతాం కాదా అంటూ న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు.

ఇక‌, తెరాస ఎమ్మెల్యేలంద‌రూ గ‌డ‌చిన మూడురోజులుగా వివిధ ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా గ‌డిపారు. ఈ రెండ్రోజులు దాటిపోతే ఏదో పుణ్యకాలం పూర్త‌యిపోతుంద‌న్నంత తొంద‌ర అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో క‌నిపించింది. సో.. తెలంగాణ అంతా ముంద‌స్తు ఫీవ‌ర్ పాకేసింది. అధికార పార్టీల‌తోపాటు అన్ని పార్టీలూ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా సిద్ధ‌మైపోయాయి. ఇప్పుడు మ‌రోసారి అంద‌రి చూపూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైపే. ఆయ‌న అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డమే అల‌స్యం అన్న‌ట్టుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com