పెను సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కీలక అడుగు వేసింది. ఈ ఒప్పందంలో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో సుదీర్ఘమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను ప్రధాన నిందితుడిగా ఏసీబీ పేర్కొంది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించారన్న ప్రధాన ఆరోపణలతో ఈ అభియోగపత్రాన్ని రూపొందించారు.
ప్రభుత్వ ధనాన్ని విదేశీ సంస్థకు అక్రమంగా బదిలీ చేయడమే నేరం
ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం.. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిని ఏ3గా చేర్చారు. వీరితో పాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు , బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఏ5గా నిందితుల జాబితాలో చేర్చారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులకు విరుద్ధంగా సుమారు 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని విదేశీ సంస్థలకు అక్రమంగా బదిలీ చేశారని ఏసీబీ పక్కా ఆధారాలతో వివరించింది. ఈ నిధుల విడుదల ప్రక్రియలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిబంధనలను తుంగలో తొక్కారని, పైస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి హెచ్ఎండీఏ నిధులను మళ్లించారని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. విదేశీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో పారదర్శకత లేదని, ప్రభుత్వ ప్రయోజనాల కంటే ప్రైవేట్ సంస్థల లాభానికే ప్రాధాన్యత ఇచ్చారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా సేకరించిన సాక్ష్యాధారాలు, అధికారుల స్టేట్మెంట్లు, బ్యాంకు లావాదేవీల రికార్డులను ఛార్జిషీట్‌కు జత చేశారు.
తదుపరి న్యాయ ప్రక్రియ ఏమిటి?
ఏసీబీ సమర్పించిన ఛార్జిషీట్‌ను కోర్టు ముందుగా సాంకేతిక పరంగా పరిశీలిస్తుంది. సాక్ష్యాధారాలు, సెక్షన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసి కోర్టు దీన్ని పరిశీలనలోకి తీసుకుంటుంది. ఛార్జిషీట్‌ను కోర్టు ఆమోదించిన తర్వాత, అందులో పేర్కొన్న నిందితులందరికీ కోర్టు సమన్లు జారీ చేస్తుంది. నిందితులు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. నిందితులు తమపై మోపిన ఆరోపణలు నిరాధారమని భావిస్తే, కేసు నుండి తమను తప్పించాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, నిందితులపై అధికారికంగా అసలు విచారణ మొదలవుతుంది.
లొట్టపీసు కేసు కాదు !
కేటీఆర్ ఈ కేసును లొట్టపీసు కేసుగా చెబుతూ వస్తారు. అయితే ఇది లొట్టపీసు కేసు కాదని ఈ కేసులో కావాల్సినంత బలం ఉందని న్యాయవార్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజాధనం రూ.55 కోట్లు విదేశీ సంస్థ ఖాతాకు వెళ్లిపోయాయి. అది స్పాన్సర్ షిప్ లేకపోతే మరొకటా అన్నది రికార్డుల్లో లేదు. మంత్రివర్గ ఆమోదం లేదు. అసలు ఎలాంటి ప్రక్రియ లేకుండా డబ్బులు తరలించేశారు. అది కూడా నిబంధనలు ఉల్లంఘించి. అలా తరలించినందుకు ఆర్బీఐకి జరిమానా కట్టాల్సి వచ్చింది. అందుకే ఈ నేరం నిరూపించడానికి ప్రత్యేకమైన సాక్ష్యాలు అక్కర్లేదని అంటున్నారు.
