‘లాల్ స‌లామ్’ రివ్యూ: ర‌జ‌నీ కూడా రక్షించ‌లేదు!

Laal Salaam Movie Telugu Review

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

-అన్వ‌ర్‌

ర‌జ‌నీ సినిమా అంటే ఎంత హైపు ఉంటుంది? ఎంత క్రేజ్ వ‌స్తుంది? విదేశాల్లో కూడా ర‌జనీ సినిమా గురించి ఆస‌క్తిగా మాట్లాడుకొంటారు. అదీ సూప‌ర్ స్టార్ స్టామినా. అయితే ఏమాత్రం హ‌డావుడి లేకుండా, చ‌డీ చ‌ప్పుడూ కాకుండా, ప్ర‌చార ఆర్భాటం లేకుండా థియేట‌ర్లలోకి వ‌చ్చేసింది ‘లాల్ స‌లామ్‌’. అస‌లు ర‌జ‌నీకాంత్ ఇలాంటి సినిమా ఒక‌టి చేస్తున్నాడ‌ని, దానికి ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాల‌ని సీరియ‌స్ సినీ గోయ‌ర్స్‌కి కూడా తెలీదు. అంత‌టి ప్రాచూర్యాన్ని సంపాదించింద‌న్న‌మాట‌. సైలెంట్ గా వ‌చ్చినా స‌రే – స‌న్సేష‌న‌ల్ సృష్టించ‌గ‌ల ద‌మ్ము సూప‌ర్ స్టార్‌కు ఉంది. మ‌రి.. ‘లాల్ స‌లామ్‌’లో ఆ స‌త్తా క‌నిపించిందా? అస‌లింత‌కీ ఈ స‌లామ్‌… ఎవ‌రి కోసం, దేని కోసం..?

1993 నాటి రోజులు. కుసుమూరు అనే గ్రామం. అక్క‌డ యువ‌త‌రానికి క్రికెట్ అంటే ప్రాణం. త్రిస్టార్‌, ఎంసీసీ అనే రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ ప‌డుతుంటారు. ఓ క్రికెట్ మ్యాచ్‌లో జ‌రిగిన గొడ‌వ ఆ ప్రాంతంలో హిందూ, ముస్లిం మ‌ధ్య వ‌ర్గ విబేధాల్ని సృష్టిస్తుంది. గురు (విష్ణు విశాల్‌), షంషుద్దీన్ (విక్రాంత్) ఈ గొడ‌వ‌లో కొట్టుకొంటారు. షంషుద్దీన్ తండ్రి మొయినుద్దీన్ (ర‌జ‌నీకాంత్‌). ముంబైలో డాన్ టైపు. కొడుకుపై ఈగ వాలినా త‌ట్టుకోడు. అలాంటిది గురు వ‌ల్ల కొడుకు జీవిత‌మే నాశ‌నం అవుతుంది. అలాంట‌ప్పుడు మొయినుద్దీన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అనేది మిగిలిన క‌థ‌.

ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. హిందూ ముస్లింల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటే.. ర‌జ‌నీకాంత్ చేతికి అంటిన ర‌క్తాన్ని విల‌న్‌కి చూపిస్తాడు. ”ఈ ర‌క్తం రంగేంటి? నీ ర‌క్తం నా ర‌క్తం రెండూ ఎరుపేగా..? అలాంట‌ప్పుడు మ‌న మ‌ధ్య ఈ గొడ‌వ‌లు ఎందుకు?” అంటూ సీరియ‌స్ గా లెక్చ‌ర్ ఇస్తాడు. ఈ డైలాగ్ ఎంత ముత‌క‌గా ఉందో.. సినిమా మొత్తం అలానే ఉంది. కొత్త‌గా చెప్పుకొనేందుకు ఒక్క విష‌య‌మూ, విశేష‌మూ ఈ సినిమాలో క‌నిపించ‌లేదు. ఓ క్రికెట్ మ్యాచ్‌లో జ‌రిగిన గొడ‌వ‌ని రెండు మ‌తాల మ‌ధ్య పోరుగా చూసి కొట్టుకు చావ‌డం, చివ‌రికి క‌లిసిపోవ‌డం.. ఇదే లైన్‌. దానికి జాత‌ర అనే ఓ పాయింట్ క‌లిపి, క్లైమాక్స్ లో ‘కాంతార‌’ లాంటి సౌండ్ ఎఫెక్ట్‌లు ఇచ్చి – ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి ఐశ్వ‌ర్య ఏవో తిప్ప‌లు ప‌డింది. కానీ అవేం స‌ఫ‌లీకృతం కాలేదు. చివ‌రికి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కూడా సైడ్ క్యారెక్ట‌ర్‌లా గ‌మ్మున ఉండిపోవాల్సిన ప‌రిస్థితి. పుత్రికా వాత్సల్యంతో ర‌జ‌నీ ఈ క‌థ‌ను ఒప్పుకొని ఉంటాడు. ర‌జ‌నీ కుమార్తె సినిమా క‌దా అని విష్ణు విశాల్ మొహ‌మాట ప‌డి ఉంటాడు. అలా.. ఈ సినిమా త‌యారైంది.

క్రికెట్, మ‌తం, జాత‌ర‌, వ‌ర్గ పోరు, స్నేహం ఇలా చాలార‌కాలైన పాయింట్ల‌ని క‌ల‌గాపుల‌గం చేసేయాల‌నుకొంది ద‌ర్శ‌కురాలు. దాంతో ఏ పాయింట్ పైనా శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. తెర‌పై హీరో లిద్ద‌రూ సిక్సులూ, ఫోర్లూ కొడుతున్నా, ఆఖ‌రికి కొట్టుకు ఛ‌స్తున్నా ప్రేక్ష‌కుల్లో ఎలాంటి ఎమోష‌న్ పుట్ట‌దు. ఎందుకంటే ఎవ‌రూ ఈ క‌థ‌కూ, ఆ పాత్ర‌ల‌కూ, అందులోని సంఘ‌ర్ష‌ణ‌కూ క‌నెక్ట్ కాలేరు. ప్ర‌జెంట్ లో కొంత ఫ్లాష్ బ్యాక్ లో కొంత అంటూ నేరేష‌న్ సాగుతుంటుంది. ఓ ద‌శ‌లో ఏది ప్ర‌స్తుత‌మో, ఏది గ‌త‌మో.. అర్థం కాని క‌న్‌ఫ్యూజ‌న్ వ‌స్తుంది. ఆ త‌ర‌వాత ‘ఏదైతే మ‌న‌కెందుకులే..’ అని నీర‌సంగా, సీట్ల‌లో ఇబ్బందిగా క‌ద‌ల‌డం త‌ప్ప ఏం చేయ‌లేం. క్రికెట్ మ్యాచ్ గొడ‌వ‌లు, ఊర్లో జాత‌ర, ఆ సంప్ర‌దాయాలు.. ఇవ‌న్నీ తమిళ స్టైల్‌లోనే సాగాయి. విష్ణు విశాల్ కి ఓ ల‌వ్ స్టోరీ ఉంది. క‌నీసం దాన్ని కూడా స‌రిగా ఎలివేట్ చేయ‌లేదు. ర‌జ‌నీ స్నేహాన్ని చూపించ‌లేదు. ఈ సినిమాలో క‌పిల్ దేవ్ లాంటి క్రికెట్ దిగ్గ‌జం న‌టించాడు. అయితే ఆ పాత్ర కూడా బ‌లంగా అనిపించ‌దు. జీవిత చాలా కాలం త‌ర‌వాత ఈ సినిమాలో న‌టించారు. రాజ‌శేఖ‌ర్‌, శివానీ, శివాత్మిక‌.. వీళ్లంద‌రి త‌ర‌పున కూడా త‌నే న‌టించేయాలి అనుకొన్నారో, త‌మిళ సినిమాల్లో త‌ల్లి పాత్ర అంటే ఇలానే ఉండాలి అనుకొన్నారో… ఆమె న‌ట‌న కూడా మ‌రీ ఓవ‌ర్ గా అనిపిస్తుంటుంది. ఎప్పుడూ గ్లిజ‌రిన్ క‌ళ్ల‌తోనే క‌నిపించ‌డం, గుండెలు బాదుకోవ‌డం, బొంగురు గొంతుతో ఏడ‌వ‌డం ఇదే తంతు. సినిమా అయిపోయింద‌ని ఫీలై మ‌ధ్య‌లోనే లేచి వ‌చ్చేసినా, కాస్త ఏమ‌ర‌పాటుగా ఉన్నా, ఇందులో ధ‌న్య బాల‌కృష్ణ అనే తెలుగ‌మ్మాయి న‌టించింది అని మ‌నం గుర్తించ‌లేం. అలాంటి ‘మెరుపు’ పాత్ర అది. దేవుడొక్క‌డే, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలి.. లాంటి పాయింట్‌తో ఈరోజుల్లో సినిమాలు తీయ‌డం త‌ప్పు కాదు. కానీ ఆ పాయింట్ ని ఎంత ప్ర‌భావ‌వంతంగా చెబుతున్నాం అనేదే ముఖ్యం. ఈ విష‌యంలో ద‌ర్శ‌కురాలు పూర్తిగా తేలిపోయింది.

విష్ణు విశాల్, విక్రాంత్ త‌మ ప‌నిని సిన్సియ‌ర్‌గా చేశారు. ర‌జ‌నీకాంత్ స్టైల్ ఏమాత్రం క‌నిపించ‌ని సినిమా ఇది. ఆయ‌న వ‌ర‌కూ హుందాగా నటించారు. చాలా కాలం త‌ర‌వాత సాయి కుమార్ డ‌బ్బింగ్ చెప్పారు. ఎందుకో… మ‌నో గొంతే ర‌జ‌నీకి సూట్ అయిన‌ట్టు అనిపిస్తుంది. ర‌జనీ నుంచి ఆశించే ఏ అంశ‌మూ ఈ సినిమాలో ఉండ‌దు. అది ఆయ‌న అభిమానుల్ని నిరాశ ప‌రుస్తుంది. నిరోషా ఉన్నా ఆమె పాత్ర అంతంత మాత్ర‌మే. తంబి రామ‌య్య త‌న అనుభ‌వాన్ని చూపించాడు. ర‌జ‌నీ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా ఆక‌ట్టుకొన్న సెంథిల్ ఈ సినిమాలో కాస్త బ‌రువైన పాత్ర‌లో క‌నిపించ‌డం విశేషం. రెహ‌మాన్ సంగీతంలో మెరుపులు చూసి చాలా కాల‌మైంది. ఈ సినిమా కూడా ఆయ‌న అభిమానుల్ని నిరాశ ప‌రుస్తుంది. క్లైమాక్స్ లో కాంతార టైపు సౌండింగ్ వాడుకోవ‌డం కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. కెమెరా వ‌ర్క్‌, ఎడిటింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకోవ‌డానికి ఏం లేదు. డైలాగులు సైతం పాత వాస‌న కొట్టాయి. లాల్ స‌లామ్ అనే మాట అభ్యుద‌య భావాల‌కు, విప్ల‌వానికీ ప్ర‌తీక‌. అస‌లు ఈ టైటిల్ కీ, ఈ క‌థ‌కూ సంబంధం ఏమిటో అర్థం కాదు.

ద‌ర్శ‌కురాలిగా త‌న నైపుణ్యం చూపించాల‌నుకొని ఎప్ప‌టి నుంచో తాప‌త్ర‌య‌ప‌డుతున్న ఐశ్వ‌ర్య‌కు మ‌రోసారి నిరాశ ఎదురైంది. త‌న కూతురికి అవ‌కాశం ఇచ్చి తండ్రిగా త‌న బాధ్య‌త తీర్చుకొన్నాడు ర‌జ‌నీ. కానీ ప్రేక్ష‌కుల‌కు అంత పెద్ద మ‌న‌సు లేక‌పోవొచ్చు. ర‌జ‌నీ స్టామినా, త‌న గ్లామ‌ర్‌, స్టార్ డ‌మ్ సైతం ఈ సినిమాని కాపాడ‌డం క‌ష్ట‌మే.

ఫినిషింగ్ ట‌చ్‌: క్లీన్ బౌల్డ్‌

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close