రివ్యూ: మ‌ను

Manu Movie Review
Manu Movie Review

తెలుగు360 రేటింగ్‌: 2/5

మోడ్ర‌న్ ఆర్ట్ చూడండి…
అదేం అర్థం కాదు..
పిచ్చి పిచ్చిగా ఉంటుంది..
కానీ లోలోప‌ల ఎన్నో భావాలు.
అలాగ‌ని పిచ్చి పిచ్చిగా ఉన్న‌వ‌న్నీ మోడ్ర‌న్ ఆర్టే ఎలా అవుతాయి..?

క‌విత్వం కూడా అంతే.
ఏవేవో ప‌దాల అల్లిక‌లు క‌నిపిస్తాయి..
మ‌న‌సుతో చ‌దివితే.. ఆ భావాలే వేదాల‌వుతాయి.
అలాగ‌ని రాసిన ప్ర‌తీ అక్షరం క‌విత్వం కాదు!

ఎంత మోడ్రన్ థాట్ అయినా… అర్థవంతంగా ఉండాలి.. సినిమాల్లోనూ అంతే. మ‌న‌మేదో క‌విత్వం రంగ‌రిస్తున్నాం.. అద్భుత‌మైన భావాలు వ‌ల్లేస్తున్నాం, సినిమా చిత్ర ప‌టాన్నే మార్చేస్తున్నాం.. అంటే స‌రిపోదు. జ‌నానికి ఎంత వ‌ర‌కూ అర్థం అవుతుంద‌న్న‌దీ కీల‌క‌మే. వాళ్ల మేధ‌స్సుని ప‌రీక్ష పెట్టేలా సినిమా ఉంటే మాత్రం.. ఎంత గొప్ప భావ‌మైనా అర్థం లేని క‌విత్వంలా.. పిచ్చి గీత‌ల పేయింటింగ్ లా మారిపోతుంది. `మ‌ను` స‌మ‌స్య అదే.

* క‌థ‌

ఓ వ‌జ్రాల వ్యాపారి. అత‌ని ద‌గ్గ‌ర అత్యంత విశ్వాస పాత్రుడిగా ప‌నిచేసిన ఉద్యోగికి ఓ విలువైన ఉంగ‌రం బ‌హుమ‌తిగా ఇస్తాడు. దానిపై అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోనీ అనే ముగ్గురి క‌న్ను ప‌డుతుంది. ఆ వ‌జ్రం కోసం అత‌న్ని హ‌త్య చేస్తారు. ఓ దీపాల పండ‌గ నాడు… ఓ దొంగ వ‌ల్ల ఇద్ద‌రు ప్రేమికుల జీవితాలు త‌ల్ల‌కిందుల‌వుతాయి. ఆ దొంగ ఎవ‌రు? ఆ ప్రేమికులు ఎవ‌రు? వీళ్లంద‌రి మ‌ధ్య ఎలాంటి క‌థ న‌డిచింది? అనేదే `మ‌ను` క‌థ‌.

* విశ్లేష‌ణ‌

క్రైమ్ మిస్ట‌రీలా మొద‌లై, థ్రిల్ల‌ర్‌లా మారి, హార‌ర్ ట‌చ్ ఇస్తూ సాగే ఓ విచిత్ర‌మైన ల‌వ్ స్టోరీ. మామూలుగా ఈ క‌థ చెబితే . `ఆ… ఏముందిలే ఇందులో` అనుకుంటారేమో అని… స్క్రీన్ ప్లే ని అటు తిప్పి, ఇటు తిప్పి.. ట్విస్టులు ఇచ్చుకుంటూ… ఓ విచిత్ర‌మైన థ్రిల్ల‌ర్ రూపం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. నిజానికి క‌థ ప్రారంభం, న‌డ‌క చూస్తే, ద‌ర్శ‌కుడు ఏదో చెప్పాల‌నుకుంటున్నాడు అనిపిస్తుంది. ఆ అటెన్ష‌న్‌లోనే సినిమా చూస్తాం కూడా. క‌థ‌, క‌థ‌నాలు న‌త్త‌న‌డ‌క న‌డుస్తున్నా… స్లో పేజ్ ఇబ్బంది పెడుతున్నా, పాత్ర‌లు, వాళ్లు మాట్లాడే మాట‌లు ఇవేం అర్థం కాకున్నా… బ‌ల‌వంతంగా అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటాం. కానీ.. పోను పోను ఆ ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంటుంది. స‌గం సినిమా గ‌డిచేస‌రికి ఇది థ్రిల్ల‌ర్ కాదు, హార‌ర్ అని ఫిక్స‌యిపోతాం. ద్వితీయార్థంలో ప్రేమ క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డ కూడా పొయెట్రీ రంగ‌రించాడు ద‌ర్శ‌కుడు. ఆ ఎపిసోడ్ బాగున్నా.. మ‌రీ లెంగ్తీగా అనిపిస్తుంది. పైగా ఆ భావాలు ఓ ప‌ట్టాన అర్థం కావు. ద‌ర్శ‌కుడు తానేదో ఓ న్యూ ఏజ్ సినిమా తీస్తున్నాన‌ని… త‌న క‌విత్వాన్ని మొత్తం వెండి తెర‌పై రంగ‌రించే ప్ర‌య‌త్నంచేశాడు. కానీ మ‌నం సినిమాకి ఎవ‌రికి క్యాట‌ర్ చేస్తున్నాం? వాళ్ల‌కు అర్థమ‌వుతుందా, లేదా? అనేది మాత్రం ఆలోచించ‌లేక‌పోయాడు. `ప‌ట్టాలు త‌ప్పిన రైలులా, తుపాను వ‌చ్చిన ఊరిలా…` అనే డైలాగ్ ఉంది ఈసినిమాలో. స‌రిగ్గా
త‌న ఆలోచ‌న‌లు కూడా అలానే అస్థ‌వ్య‌స్థంగా త‌యార‌య్యాయి. ఓ ద‌శ‌లో అస‌లు ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడు? ఏం చెబుతున్నాడు? అనే సందేహాలూ అనుమానాలు వెంటాడుతుంటాయి. `స‌ముద్ర తీరంలో గుండె సూది పారేసుకుని` వెదుకుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది (ఇదీ ఈ సినిమాలోని డైలాగే)

ద్వితీయార్థంలో క‌న్‌ఫ్యూజ‌న్లు ఎక్కువ‌య్యాయి. స్క్రీన్ ప్లే తిక‌మ‌క‌ల వ‌ల్ల‌… ఏ సీన్ ముందు జ‌రిగిందో, ఏది త‌ర‌వాతో అర్థం కాదు. క్లైమాక్స్ అయితే… ఇంకాస్త అయోమ‌యంగా ఉంటుంది. ర‌సాయ‌నాల పేర్లు, ఆ శ‌వాలకు న‌ల్ల రంగు పూయ‌డం… ఇదంతా ఏంటోలా అనిపిస్తుంటుంది. నిజానికి ఇదో దెయ్యం క‌థ‌. అయితే దెయ్యాలు మామూలు మ‌నుషుల్లానే మ‌నుషుల మ‌ధ్య తిరిగేయ‌డం, సెన్స్ ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని శ‌త్రువుల్ని చంప‌డం, క‌విత్వం రంగ‌రిస్తూ మాట్లాడ‌డం, బొమ్మ‌లు వేయ‌డం చూస్తుంటే… ఇదో తెలివైన దెయ్యాల క‌థేమో అనిపిస్తుంది. ఇన్ని దెయ్యాల క‌థ‌లొచ్చాయి కానీ…. ఈ త‌ర‌హా ట్రీట్మెంట్ ఎవ్వ‌రూ ఇచ్చుండ‌రేమో. దాంతో అటు భ‌యం, ఇటు ఆస‌క్తి పోయి… ఎలాంటి పీలింగూ లేకుండా నిస్తేజంగా కూర్చుండిపోతాం.

ఈ సినిమాలో కాఫీ షాపు ఉంటుంది. అందులో జ‌నాలు ఉండ‌రు బారు ఉంటుంది.. అందులో జ‌నాలు ఉండ‌రు అపార్ట్‌మెంటు ఉంటుంది.. అందులో హీరో, హీరోయిన్‌, రౌడీ గ్యాంగ్ త‌ప్ప‌.. ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌రు. పాత్ర‌లు త‌ప్ప‌… క‌నీసం పాసింగ్ క్రౌడ్ కూడా ఉండ‌దు. అదేంటో మ‌రి! సినిమా ప్రారంభంలో చూపించిన క‌థానాయ‌కుడి ఎలుక‌ల వేట కూడా… ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఎలుక‌లు ప‌ట్ట‌డానికి ఓ థీరీ.. దాని కోసం రెండు మూడు స‌న్నివేశాలు.. సినిమా కూడా ఇలానే సాగ‌దీస్తూ.. సాగ‌దీస్తూ మూడు గంట‌లు చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఇలాంటి సినిమాల్ని క్లుప్తంగా ముగించాల్సింది పోయి.. క‌విత్వం కోస‌మో, త‌న మోడ్ర‌న్ థాట్ కోస‌మో… వ‌చ్చిన ఆలోచ‌న‌ని తెర‌పై చూపిస్తూ… సినిమాని మ‌రింత సాగ‌దీశాడు.

* న‌టీన‌టులు

సినిమాలో క‌నెక్ట్ అయిన‌ప్పుడు.. క‌థ అర్థ‌మ‌వుతూ సాగుతున్న‌ప్పుడు… న‌టీన‌టుల ప్ర‌తిభ‌, సాంకేతిక ప‌నిత‌నం వ‌గైరాల గురించి ఆలోచిస్తాం. కానీ ద‌ర్శ‌కుడు ఇక్క‌డ ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. అస‌లు క‌థేంటో, ఎందుకు ఎటుపోతుందో… అర్థం కాక‌… ఆ లాజిక్కులు మ‌నసులోనే వేసుకుంటూ చూడ‌డం వ‌ల్ల‌.. తెర‌పై న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ గుర్తించేంత తీరిక ఉండ‌దు. తెర‌పై బొమ్మ చూస్తున్నా… లోలోప‌ల ఎన్నో ప్ర‌శ్న‌లు స‌మాధానాల కోసం ఆవురావురుమంటుంటాయి. అందుకే తెర‌పై ఇంకేం క‌నిపించ‌దు. అయితే ప్ర‌తీ పాత్ర‌.. త‌న నుంచి ద‌ర్శ‌కుడు ఏం కావాల‌నుకుంటున్నాడో అదే ఇచ్చింది. గౌత‌మ్‌… కొత్త‌గా క‌నిపించాడు. బ‌హుశా గ‌డ్డం వ‌ల్ల‌నేమో. అత‌ని డైలాగ్ డెలివ‌రీ బాగుంది. విల‌న్ గ్యాంగ్‌లో అంతా కొత్త‌వారే.

* సాంకేతిక వ‌ర్గం

ఈ క‌థ‌ని ఫ్లాట్‌గా చెప్పి ఉంటే… క‌నీసం ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేది. స్క్రీన్ ప్లే నైపుణ్య‌మంతా ప్ర‌ద‌ర్శించాల‌ని చూడ‌డంతో… గంద‌రగోళం మొద‌ల‌య్యింది. డైలాగుల్లో డెప్త్ ఉంది. ఈ సినిమాల్లో మాట‌లు చాలా త‌క్కువ వినిపిస్తాయి.
కానీ.. అందులోని భావాలు ఆక‌ట్టుకుంటాయి. కొన్ని మ‌రీ అర్థం కాకుండా ఉన్నాయి. ఆర్ట్ వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. అండమాన్ లాంటి దీవి నేప‌థ్యంలో, అది కూడా సెల్ ఫోన్లు లేని కాలంలో న‌డిచే క‌థ ఇది. ఆ ఫీల్‌ని రాబ‌ట్టుకున్నారు. నేప‌థ్య సంగీతంలోని కొన్ని థీమ్స్ హాంటింగ్‌గా ఉన్నాయి.

* తీర్పు

కొత్త త‌ర‌హా సినిమాలు రావాలి. ఓ కథ‌ని కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. కాక‌పోతే.. త‌మ తెలివితేట‌ల‌న్నీ చూపించేయాల‌నుకోవ‌డం, ప్రేక్ష‌కుల్ని గంద‌ర‌గోళంలో ప‌డేయ‌డ‌మే స్క్రీన్ ప్లే ట్రిక్ అనుకోవ‌డం ఎంత‌మాత్రం క‌రెక్ట్ కాదు. ఎక్క‌డైనా స‌రే.. అతి అన‌ర్థాలే తీసుకొస్తుంది. అది క్రియేటివిటీలో కూడా. అందుకు ఈసినిమానే ఉదాహ‌ర‌ణ‌.

* ఫైన‌ల్ ట‌చ్‌: గంద‌ర‌గోళం

తెలుగు360 రేటింగ్‌: 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com