ప్రధాని ప్ర‌సంగాల‌కు ఆంధ్రులు ప‌డిపోతారా..!

‘ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఏదో ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నారు..! ఆయ‌న ప్ర‌సంగానికి కాసేపు అడ్డు త‌గ‌లొద్దు. ఆంధ్రాల‌కు వ‌రాలు ప్ర‌క‌టించ‌బోతున్నారు’… మూడురోజులుగా నిర‌స‌న‌లు తెలుపుతున్న టీడీపీ ఎంపీల‌కు ముందుగా ఈ స‌మాచారం అందింద‌ట‌! రాష్ట్రం నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఫోన్ చేసి… ఆయ‌న ఏపీ గురించే మాట్లాడ‌బోతున్నార‌ట‌, కాసేపు సంయ‌మ‌నం పాటించండీ అంటూ ఎంపీల‌ను కోరారు. దాంతో పార్ల‌మెంటులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి ఏదో ప్రకటన ఉంటుందనే ఆశతో అంతా ఎదురుచూశారు. కానీ, చివ‌రికి ఏమైంది… ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న నాటి ప‌రిస్థితుల గురించి ఏక‌రువు పెట్టారు! అడ్డ‌గోలుగా విభ‌జ‌న చేశారంటూ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేశారు. అక్క‌డి నుంచి దేశ‌భ‌క్తి వ‌ర‌కూ ఏదేదో మాట్లాడారు. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చెప్పినట్టు తెలుగు ప్ర‌జ‌లు ఫూల్స్ కాదు. మోడీ ప్ర‌సంగంలో ప‌లాయ‌న వాదాన్ని అర్థం చేసుకోలేనంత అమాయ‌కులూ కాదు.

త‌న స‌హ‌జ వాక్చాతుర్య ధోర‌ణిలో తెలుగు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌క్క‌తోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ..! బ‌డ్జెట్ లో కేటాయింపులేవీ, నాలుగేళ్లు గ‌డుస్తున్నా విభ‌జ‌న హామీలు ఏవీ అని ఆంధ్రులు గ‌ళ‌మెత్తితే… దానికి స‌మాధానంగా అసంద‌ర్భ‌మైన అంశాలు మాట్లాడారు. పార్ల‌మెంటు త‌లుపులు వేసి ఆంధ్ర‌ప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విభ‌జించింది అన్నారు. సీమాంధ్రుల మ‌నోభావాల‌ను అర్థం చేసుకోకుండా, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నాడు ఏపీని అడ్డ‌గోలుగా విభజంచింద‌నీ, అందుకే ఆ స‌మ‌స్య‌ల‌కు ఇప్ప‌టికీ ప‌రిష్కారం ల‌భించ‌కుండా పోతున్నాయ‌ని ప్ర‌ధాని చెప్పారు. అక్క‌డితో ఆగినా బాగుండేది..! ఆంధ్రా విభ‌జ‌న‌ను నాటి దేశ విభ‌జ‌న‌తో కూడా పోల్చారు. 70 ఏళ్ల కింద‌ట దేశ విభ‌జ‌న చేశార‌నీ, దాని ఫ‌లితాన్ని ప్ర‌జ‌లు ఇప్ప‌టిక అనుభ‌విస్తున్నార‌నీ, ఇలాంటి స్వార్థ రాజ‌కీయాలు కాంగ్రెస్ కు మొద‌ట్నుంచీ చేస్తోంద‌న్నారు. వాజ్‌పేయి హ‌యాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామ‌నీ, ఎక్క‌డా ఎలాంటి స‌మ‌స్య‌లూ లేవంటూ గొప్ప‌గా చెప్పుకొచ్చారు. మోడీ ప్ర‌సంగం ఇలా ఎట్నుంచో ఎటో వెళ్లిపోయింది!

కాంగ్రెస్ అడ్డ‌గోలుగా విభ‌జించింది కాబ‌ట్టే… ఆంధ్రాలో అడ్ర‌స్ లేకుండా పోయింది. విభ‌జ‌న గురించి ఇప్పుడు ఆంధ్రులు ఆందోళ‌న చేయ‌డం లేదు మోడీ సాబ్‌..! గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో త‌మ ప్రభుత్వం విభ‌జిత రాష్ట్రానికి అన్యాయం చేస్తోంద‌న్న‌ది ఆంధ్రుల ఆవేద‌న‌. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల‌ను భాజ‌పా ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌న్న‌ది ఇప్ప‌టి టాపిక్‌. దాని మీద వివ‌ర‌ణ కోరుతుంటే… కాంగ్రెస్ అడ్డ‌గోలుగా విభ‌జించిందీ, దేశాన్ని ముక్క‌లు చేసిందీ, వాళ్లంతే వీళ్లింతే… ఇవ‌న్నీ ఎవ‌రికి కావాలండీ..! ఇలాంటి ఎమోష‌న‌ల్ ప్ర‌సంగాలకు మంత్ర‌ముగ్దం అయిపోయే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆంధ్రాలో లేద‌న్న విష‌యం మోడీ అర్థం చేసుకోవాలి. మాట‌ల గార‌డీతో బురిడీ కొట్టించే ప్ర‌య‌త్నాలే త‌ప్ప‌… దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ప్ర‌ధాని ఇప్పటికీ సిద్ధంగా లేర‌న్న‌ది అర్థ‌మౌతోంది. ఓప‌క్క భాజ‌పా వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆంధ్రాలో బంద్ జ‌ర‌గ‌బోతోంది. ఇంటెలిజెన్స్ లాంటి నిఘా విభాగాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీలో ప‌రిస్థితుల‌ను కేంద్రానికి చేర‌వేస్తూనే ఉన్నాయి. అయినాస‌రే, ఈ నిర్ల‌క్ష్య వైఖ‌రి ఏంటో అర్థం కావ‌డం..! మిత్ర‌ధ‌ర్మ పాటిస్తున్నామంటూ టీడీపీ కొంత త‌గ్గి ఉండే ప‌రిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఆయ‌న మాట‌ల‌కు పడిపోయే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఆంధ్రాలో లేనేలేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.