హామీల‌పై ప‌వ‌న్ జేఏసీ.. ఆచ‌ర‌ణ సాధ్య‌మా…?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించారు! కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల‌పై ఆంధ్రాలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మౌతున్న నేప‌థ్యంలో జ‌న‌సేనాని మాట్లాడారు. విభ‌జ‌న హామీల‌పై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మౌతుంటే… కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేస్తున్నాయంటూ మండిప‌డ్డారు. విభ‌జ‌న హామీల‌ను సాధించుకోవ‌డం కోసం జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ ఓ కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర మీదికి తీసుకొచ్చారు. లోక్ స‌త్తా అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, కాంగ్రెస్ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులంద‌రినీ క‌లుపుకుంటూ ఒక ప్రెజ‌ర్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తానంటూ ప్ర‌క‌టించారు. రాజ‌కీయ పార్టీల‌ను కూడా జేయేసికి మ‌ద్ద‌తుగా క‌లుపుకుని ముందుకు సాగాల‌ని అనుకుంటున్నాను అన్నారు. ప్ర‌స్తుత స‌మ‌స్య‌లపై పోరాటం చేసేందుకు జ‌న‌సేన శ‌క్తి స‌రిపోవ‌డం లేద‌ని ప‌వ‌న్ చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం..! అంతేకాదు, గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌క‌పోవ‌డం త‌ప్పిదం అని కూడా చెప్ప‌డం మ‌రో విశేషం.

ప్ర‌శ్నించ‌డానికి పుట్టిన పార్టీ జ‌న‌సేన‌. ఓపక్క వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌న్నారు. ఒంట‌రిగానే పోటీ అన్నారు. ఆత‌రువాత‌, కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌న్నారు. ఇతర పార్టీల‌తో క‌లిసి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌న్నారు. ఇప్పుడేమో, విభ‌జ‌న హామీల‌పై పోరాటం చేసేందుకు త‌మ ఒక్క‌రి శ‌క్తీ స‌రిపోవ‌డం లేదంటున్నారు, జేఏసీ అంటున్నారు! ఒక స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ల‌క్ష్యం లేకుండా… ఎప్ప‌టిక‌ప్పుడు ద‌శా దిశ‌ల‌ను మార్చేసుకుంటూ జ‌న‌సేన ప్ర‌యాణం సాగుతోంద‌నేది ప‌వ‌న్ కు అర్థ‌మౌతోందో లేదో వారే విశ్లేషించుకోవాలి.

ఇక‌, జేఏసీ ప్ర‌తిపాద‌న విష‌యానికొస్తే… దీన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టుగా ముందుగా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌కు చెప్పారా..? ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ను సంప్ర‌దించారా..? వారు దీనికి అంగీకరించారా..? భావ‌సారూప్యత ఉన్న ఇత‌ర పార్టీలు ఏవీ..? ప‌వ‌న్ జేఏసీ పెడుతున్నారు అన‌గానే అంద‌రూ వ‌చ్చేసి చేరిపోయే ప‌రిస్థితి ఉందా..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు జ‌న‌సేన ద‌గ్గ‌ర స‌మాధానాలు లేవ‌నే తెలుస్తోంది. ప‌వ‌న్ ప్ర‌తిపాదించిన జేఏసీ ఇంకా ఆలోచ‌న స్థాయిలో ఉంద‌ని అంటున్నారు. అంటే, జేసీ, ఉండ‌వ‌ల్లి లాంటివారు క‌లిసి వ‌స్తే బాగుంటుంద‌నేది మాత్ర‌మే ప‌వ‌న్ ఆశ అన్న‌మాట‌! అలాంట‌ప్పుడు, జేఏసీ ఏర్పాటు చేసేస్తున్నా అని ఎలా ప్ర‌క‌టిస్తారు అనే ప్ర‌శ్న‌ల‌కు ఇంకా స‌మాధానం రావాల్సి ఉంది. ఇంత‌కీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌న‌సేన ఉద్దేశమేంట‌నేది కూడా ప‌వ‌న్ స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు.

రాష్ట్రంలో జ‌ర‌గ‌బోతున్న బంద్ కి ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢిల్లీలో దీక్ష‌కు దిగుతారు అనే ఊహాగానాలు కూడా ప్రచారంలోకి వ‌చ్చాయి. కానీ, అవ‌న్నీ పుకార్లే అని త‌రువాత తేలింద‌నుకోండి. నిజానికి, ప‌వ‌న్ ఈ ప‌ని చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. ఆయ‌న దీక్ష‌కు దిగితే ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది. రాజ‌కీయంగా కూడా జ‌నసేనకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డేది. కానీ, ఇంకా చాలా స‌మ‌యం ఉన్న‌ట్టూ, పోరాడ‌టానికి కొంత వ్య‌వ‌ధి ఉన్న‌ట్టుగా ప‌వ‌న్ ప్ర‌స్తుతం మాట్లాడుతున్నారు. మ‌రి, ఈ జేఏసీ ఆలోచ‌న ఎంత‌వ‌ర‌కూ కార్య‌రూపం దాల్చుతుందో అనేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.