రివ్యూ: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’

Mr Pregnant movie telugu review

రేటింగ్‌: 2.5/5

కొన్ని ఐడియాలు ఆసక్తికరంగా వుంటాయి. `ఇది భలే కొత్త పాయింట్` అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. బిగ్ బాస్ ఫేం సోహైల్‌ ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ట్రైలర్ చూసినప్పుడు కూడా… మగాడు గర్భాన్ని మోయడమా? ఈ ఐడియా ఏదో కొత్తగా వుందే అనే ఆసక్తిని కలిగించింది. మరి ప్రచార చిత్రాలలో కనిపించిన ఆసక్తి సినిమాల్లో కొనసాగిందా? ప్రక్రుతికి విరుద్దుమైన ఈ కార్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

గౌతమ్ (సోహైల్‌)చిన్నప్పుడే తల్లితండ్రులని పోగొట్టుకుంటాడు. అనాధగా పెరిగి పాపులర్ టాటూ ఆర్టిస్ట్ గా ఎదుగుతాడు. మహి (రూపా కొడవాయుర్‌) గౌతమ్ ని ప్రేమిస్తుంది. ఐతే పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు కనకూడదనే కండీషన్ పెడతాడు గౌతమ్. ఆ కండీషన్ కి సరే అంటుంది మహి. ఇంట్లో వాళ్ళని వదులుకొని గౌతమ్ వద్దకు వచ్చేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అంతా సజావుగా సాగుతుందనే సమయంలో అనుకోకుండా మహి నెలతప్పుతుంది. కండీషన్ ప్రకారం అయిష్టంగానే గర్భం పోగొట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది మహి. మహి బాధ చూడలేక గౌతమ్ ఓ ఆలోచన చేస్తాడు. మహి మోయాల్సిన గర్భాన్ని తాను మోయాలని నిర్ణయించుకుంటాడు. అసలు గర్భం మోయాలనే ఆలోచన, అవసరం గౌతమ్ కి ఎందుకు వచ్చింది ? తన గతం ఏమిటి? మగాడు గర్భం మోసే వీలు కల్పించే వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉందా? గర్భం మోసిన మగవాడిని సమాజం ఎలా చూసింది? చివరికి గౌతమ్ బిడ్డకు జన్మనిచ్చాడా లేదా? అనేది తక్కిన కథ.

ముందు చెప్పుకున్నట్లు కొన్ని ఐడియాలు అలోచిస్తున్నప్పుడు బావుంటాయి. కానీ దానికి తెర రూపంలో ఇవ్వడంలో చాలా నైపుణ్యం కావాలి. ఐడియాలో వున్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే మంచి కథనం కుదరాలి. ‘నిజమే కదా’ అని ప్రేక్షకులని ఒప్పించేలా వుండాలి. ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ సినిమా విషయానికి వస్తే ఐడియా బాగానే వుంది. కానీ దాన్ని ప్రేక్షకులకు సహజంగా చెప్పడంలో పురుటి నొప్పుల్లానే కొన్ని సాధ‌క‌బాధ‌కాలు త‌ప్ప‌లేదు.

ఇందులో కథానాయకుడు గౌతమ్ ది ఒక విచిత్రమైన సమస్య. తన తల్లి నిండుగర్భంతో వునప్పుడు బిడ్డ అడ్డం తిరిగి చనిపోతుంది. దీంతో అసలు తనకు పిల్లలే వద్దునుకుని భయమే పడే పాత్ర అది. ఆ పాత్ర ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అయితే దర్శకుడు అనుకున్న పాయింట్ సహజంగా వుండేది. మగవాడు గర్భం ధరించడం అనే మాట ఎంత ప్రకృతి విరుద్దమైనదో ఈ సినిమాలో సన్నివేశాల వ్యవహారం కూడా కొంత వ‌ర‌కూ అంతే అసహజంగానే అనిపిస్తాయి

దర్శకుడు సినిమా చివర్లో ఒక నోట్ వేశాడు ‘2017 ఆరోగ్య నివేదికల ప్రకారం ఒక్క భారతదేశంలో 35000వేల మంది గర్భీణీలు మరణించారు. అమ్మ త్యాగానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. వారి మీదున్న కృతజ్ఞతని చప్పట్లతో తెలుపుకుందాం’’ అన్నాడు. ఈ నోట్ చదివి బయటికి వస్తున్నపుడు మాతృమూర్తుల త్యాగం, గొప్పదనం గురించి చెప్పడం దర్శకుడి ఆలోచనగా అనిపిస్తుంది. నిజంగా గొప్ప ఆలోచన ఇది.

‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ కథ ఆరంభం కాస్త‌ రొటీన్ గా వుంటుంది. హీరో టాటూలు వేయడంలో పాపులర్. దాంట్లో పోటీలు, అదేదో ఒలిపింక్ క్రీడలా టాటూ ఫెడరేషన్ లు, స్పాన్సర్ షిప్ లు, అందులో ఓడిపోతే కక్ష పెంచుకోడాలు.. ఇవన్నీ తెరపై చూస్తే టాటూ వెనుక కూడా ఇలాంటి పోటీలు, వ్యవహారం వుంటుందా అనిపిస్తుంది. పోనీ ఈ వ్యవహారం అంతా కథకు ముడిపడిందా అంటే లేదు. అప్పుడెప్పుడో స్టయిల్ సినిమాలో ప్రభుదేవా ట్రాక్ లా ఇందులో మైఖల్ అనే ఒక క్యారెక్టర్ వుంటుంది. ఆ పాత్ర చుట్టూ నడిపిన సన్నివేశాలు మరీ రొటీన్ గా వుంటాయి.

ఇక ప్రేమకథకి వస్తే ఇందులో ఎమోషన్ వుండదు. అసలు మహి, గౌతమ్ ని ఎప్పుడు, ఎందుకు అంత ఘాడంగా ప్రేమించిదనే ప్రేక్షకులకు చెప్పరు. గౌతమ్ కోసం గర్భ సంచిని కూడా తొలిగించడానికి మహి రెడీ అయిపోతుంది. అంతలా వారి మధ్య ఏం కెమిస్ట్రీ వుందో ప్రేక్షకులకు అంతుచిక్కదు.

ఇక గౌతమ్ గర్భాన్ని మోయడానికి రెడీ అవ్వడంతో ఇందులో అసలు కథ మొదలౌతుంది. ఐతే కొత్త కాన్సప్ట్ అనుకున్నప్పుడుట్రీట్ మెంట్ కూడా కొత్తగా వుండాలి. కానీ ఇందులో ట్రీట్ మెంట్ చాలా పాతది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్స్ ని ఓకే అనిపిస్తాయి. గౌతంలో వున్న భయం గర్భంలో వున్న స్త్రీలకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని. ఆ భయాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో కలిగిస్తే అతడి పాత్రపై సానుభూతి కలిగేది. కానీ ఇందులో గౌతమ్ ఎమోషన్ తో ప్రేక్షకుడికి కనెక్షన్ వుండదు. పైగా గర్భంతో వున్న భార్య నుంచి ఆమె గర్భాశయం తీసి.. కిడ్నీ మార్పిడి చేసినట్లు సింపుల్ గా మార్చేసుకుంటాడు. ఈ తంతు తెరపై చూస్తున్నపుడు ప్రకృతి విరుద్దం అనిపిస్తుంది తప్పితే గౌతంలోని ప్రేమ భయం కనిపించవు. తల్లికి రిస్క్ వుందని తెలిస్తే వైద్యులే తగు సూచనలు సలహాలు ఇస్తారు. ఇంతమాత్రానికి గర్భాశయాన్ని తీసేయడం విచిత్రంగా తోస్తుంది.
కాక‌పోతే.. తొలి భాగంతో పోలిస్తే సెకండాఫ్ చాలా బెట‌ర్‌. మ‌ధ్య‌లో బ్ర‌హ్మాజీ కామెడీతో రిలీఫ్ ఇస్తాడు. ఆయ‌న క‌నిపించిన ప‌ది నిమిషాలూ థియేట‌ర్ ఘోల్లుమంటుంది. క్లైమాక్స్ లో మహిళ‌ల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి. కొన్ని స‌న్నివేశాలు.. గ‌ర్భీణీ స్త్రీల‌పై సానుభూతిని, మాతృమూర్తుల‌పై మ‌రింత గౌర‌వాన్ని క‌లిగిస్తాయి. నిజానికి ఇలాంటి పాయింట్‌తో మెప్పించ‌డం చాలా క‌ష్టం. లాజిక్కుల‌కు అంద‌ని విష‌యాలు కొన్నుంటాయి. వాటిని ఎమోష‌న‌ల్‌తో క‌నెక్ట్ చేయ‌డం వల్ల‌,.. కొన్ని స‌న్నివేశాల‌కు లాజిక్కులు లేక‌పోయినా క్ష‌మించేస్తాం.

ఈమ‌ధ్య‌ మీడియాని ప్రతి విషయంలో కార్నర్ చేయడం పరిపాటిగా మారింది. ఇందులో కూడా మీడియా చేసే అతిని ఒక కోణంగా చూపించే ప్రయత్నం జరిగింది. నిజానికి ఒక మగాడు గర్భం దాల్చితే మీడియా అతడిపై తప్పుడు ప్రచారం ఏం చేయదు. అదొక మెడికల్ అబ్జర్వేషన్, డెవలప్మెంట్. ఇలాంటి వాటిలో సాధ్యాసాధ్యాల గురించి మంచి చర్చే జరుగుతుంది. కానీ ఇందులో మాత్రం మీడియా, ప్రజలు కారణంగా మా పరువు బయటికి వచ్చిందని ఫీలౌతాడు హీరో. నిజానికి ఇలాంటి కాన్సప్ట్ గుట్టుగా చేసిది కాదు. అదొక సంచలనం. ఆ కేసుని తప్పకుండా ప్రత్యేకంగా పరిశీలిస్తారు తప్పితే ట్రోల్స్ కోసం వాడుకోరు. ఇలాంటి విష‌యాల‌పై చిత్ర బృందం శ్ర‌ద్ద వ‌హిస్తే బాగుండేది.

గౌతం పాత్ర సవాల్ తో కూడినదే. ఆ పాత్రని తన శక్తిమేరకు పోషించాడు సోహెల్. గర్భం దాల్చినప్పటి నుంచి తన పాత్ర కొత్తకోణంలో కనిపిస్తుంది. అసలు పిల్లలే వద్దు అనుకునే గౌతమ్ .. తొమ్మిది నెలలు గర్భం మోసిన తర్వాత ఓ కొత్తగా మనిషిగా కనిపిస్తాడు. ఆ క్రమంలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఓకే అనిపిస్తాయి. మహి పాత్రలో రూప కుదిరింది. తెలుగమ్మాయిలా పద్దతిగా కనిపించింది. డాక్టర్ పాత్రలో సుహాసిని మరోసారి ఆకట్టుకుంది. బ్రహ్మాజీ వచ్చేది కాసేపే అయినా నవ్విస్తాడు. హర్షతో పాటు మిగతా నటీనటులు పరిధిమేరకు కనిపించారు.

సినిమాకి సంగీతం బలహీనతగా మారింది. చాలా బిట్ సాంగ్స్ వస్తుంటాయి కానీ ఒక్కటి కూడా రిజిస్టర్ కాదు. కెమరాపనితనం ఓకే. మనసుపెడితే ఓ అరగంట నిడివి తగ్గించే అవకాశం వుంది. టాటూల పోర్షన్ అంతా అనవసరం. డైలాగ్స్ లో కొత్తదనం లేదు. చాలా రొటీన్ డైలాగ్స్ వున్నాయి. ఓ మ‌గాడు గ‌ర్భం దాలిస్తే అనేది క‌చ్చితంగా కొత్త త‌ర‌హా పాయింట్‌. దాని చుట్టూ కొత్త‌గా కొన్ని స‌న్నివేశాలు అల్లుకొంటే ఇంకా బాగుండేది. ఈ కాన్సప్ట్ పై ఇంకా బాగా కసరత్తు చేసి సహజంగా తీర్చిదిద్డుంటే ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా వుండేది.

రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close