ఎన్టీఆర్ బ‌యోపిక్‌: అన్న‌గారి మాట‌లే వినిపిస్తాయా?

ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈనెలాఖ‌రుకి `క‌థానాయ‌కుడు` భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌వుతుంది. డిసెంబ‌రు 20 నాటికి `మ‌హా నాయ‌కుడు` కూడా అయిపోతుంది. త్వ‌ర‌లో బాల‌య్య డ‌బ్బింగ్ కూడా మొద‌లెట్టేస్తారు. అయితే… ఈసారి బాల‌య్య‌కు డ‌బ్బింగ్ శ్ర‌మ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. అదెలాగంటే…. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినిమాల‌కు సంబంధించిన మ‌రపురాని స‌న్నివేశాల్ని చూపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బొబ్బిలిపులిలోని కోర్టు సీను, దాన‌వీర శూర‌క‌ర్ణ‌లోని `ఏమంటివి ఏమంటివి` లాంటి సన్నివేశాలన్న‌మాట‌.

అయితే.. ఈ స‌న్నివేశాల‌కు ఎన్టీఆర్ పాత గొంతునే వినిపిస్తార‌ని స‌మాచారం. అప్ప‌టి ఎన్టీఆర్ డైలాగులు.. ఇప్ప‌టికీ అభిమానుల‌కు గుర్తే. వాటిని నంద‌మూరి ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, తెలుగు ప్రేక్ష‌కులూ ప‌దే ప‌దే వ‌ల్లివేసుకుంటారు. అలాంటి సంభాష‌ణ‌ల్ని బాల‌య్య గొంతులో కంటే.. అన్న‌గారి గొంతులోనే వినిపిస్తే బాగుంటుంద‌న్న‌ది క్రిష్ ఆలోచ‌న‌. అందుకే… అప్ప‌టి ఎన్టీఆర్ డైలాగుల‌నే ఇక్క‌డా వాడుకోవాల‌ని భావిస్తున్నారు. అంటే… ఎన్టీఆర్ గొంతే… ఇక్క‌డా వినిపిస్తుంద‌న్న‌మాట‌. ఆ విధంగా బాల‌య్య‌కు డ‌బ్బింగ్ శ్ర‌మ త‌గ్గించిన‌ట్టైంది. అయితే… మామూలు సంభాష‌ణ‌లు ప‌లికేట‌ప్పుడు బాల‌య్య గొంతే వినిపిస్తుంది. సినిమా డైలాగుల‌కు ఒక‌లా, మిగిలిన సంద‌ర్భాల‌లో మ‌రోలా గొంతులు మారితే.. ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కూ స్వీక‌రించ‌గ‌ల‌రో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com