కృష్ణా జిల్లాకు ఇదో చారిత్రాత్మ‌క‌మైన రోజు

కృష్ణా జిల్లా వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లో జూన్ 26వ తారీఖు ప్ర‌త్యేక‌మైన‌దిగా నిలుస్తుంది. 112 సంవ‌త్స‌రాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ నెల‌లో కృష్ణా డెల్టాకు నీరు విడుద‌ల కావ‌డ‌మే ఆ విశేషం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరిన అనంత‌రం నేరుగా కృష్ణ బ‌రాజ్‌కు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా వేద‌మంత్రాల మ‌ధ్య పూజ‌లు నిర్వ‌హించి, కొబ్బ‌రికాయ కొట్టి, డెల్టా కాల్వ‌ల‌కు నీటిని విడుద‌ల చేశారు. ప‌ట్టిసీమ వృధా అన్న‌వారి విమ‌ర్శ‌ల‌కు జూన్ నెల‌లోనే తాము విడుద‌ల చేస్తున్న ఈనీరే స‌మాధాన‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప‌ట్టిసీమ నుంచి బ్యారేజికి చేరిన 1.8 టిఎంసీల నీటిని కృష్ణా, రైవ‌స్, ఏలూరు, బంద‌రు, కేఈ కాల్వ‌ల‌కు ముఖ్య‌మంత్రి విడుద‌ల చేశారు. మొత్తం 13 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

పంట‌లు వేయ‌గ‌ల‌మా అనే సందిగ్ధ‌త ఈ ప్రాంత రైతుల‌లో ఊగిస‌లాడేద‌నీ, దానికి త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు తెర దించాయ‌నీ చంద్ర‌బాబు ఒకింత గర్వంతోనూ, సంతోషంగానూ వ్యాఖ్యానించారు. 12 మోటార్ల ద్వారా పోల‌వ‌రం కుడి కాల్వ‌కు 4500 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేయ‌డ‌మే త‌మ కృత‌నిశ్చ‌యాన్ని వెల్ల‌డిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. గ‌తంలో ఎప్పుడూ జూన్‌లో కృష్ణా డెల్టాకునీరివ్వ‌లేదు. ఇప్పుడాపని చేసి, గ‌డువు కంటే ముందుగానే నీటిని విడుద‌ల చేశామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. తాజా ప‌రిణామం, రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌ను ప్ర‌తిప‌క్షం సైతం అభినందించాల్సిందే. ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.