చైతన్య : ప్రజలు ఎందుకు బీఆర్ఎస్‌ను కాపాడాలి కేటీఆర్ సారూ !

బీఆర్ఎస్‌ను, కేసీఆర్ ను ప్రజలే కాపాడుకుంటారని కేటీఆర్ భారీ ప్రకటన చేశారు. దీనికి కారణం వలసలు పెరిగిపోవడం… అభ్యర్థిత్వాలు వచ్చిన వారు కూడా కాడి వదిలేసి వెళ్లిపోతూండటం. నిజంగానే బీఆర్ఎస్ ను ప్రజలు కాపాడుకుంటారా ?. కేటీఆర్,కేసీఆర్ ఇక ఏమీ చేయరా.. చేయలేరా ?. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది..? ఆ ప్రజల్ని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ? అనేది ఆ పార్టీ క్యాడర్ పడుతున్న ఆవేదన

గతమెంతో ఘనమే మాస్టారూ – ప్రతీ సారి అదే చెప్పుకుంటే కేష్టం !

శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్ ది. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు. కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు…. ఈ ధైర్యం కేటీఆర్‌ది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ నమ్మకం ఇది. సమావేశాల్లో ముఖ్యమంత్రిని తిడుతూ.. ప్రజలు తప్పు చేశారని తేల్చుకుంటూ.. గడిపేస్తూంటే.. నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో రిలాక్స్ అవుతూంటే వారి పార్టీని ప్రజలు కాపాడుకుంటారా ?

తెలంగాణ పార్టీ అని ప్రజలు అనుకోనందుకే కదా ఓడించారు !

నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకునేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా ఎందుకూ పనికి రాదని వదిలేసిపోతున్నారు. ఎందుకంటే.. ప్రజలతో కనెక్షన్ ను కేసీఆర్ తెంపేసుకున్నారు. కేటీఆర్ మాత్రం తమ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆయన ఆలోచించడం లేదు. అసలు ప్రజలు ఎందుకు కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితినా ? . టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చిన ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమయింది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్థానం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిపోయింది. ఇప్పుడు ప్రజలు భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది ?. పదవి కాలం పదేళ్లలో ప్రజల వద్దకు రాని .. ప్రజల్ని కలవని కేసీఆర్ ను కాపాడుకునేందుకు ప్రజలు రోడ్డెక్కాలని ఎలా ఆశిస్తారు ?

పోరాటం చేసి ప్రజల్ని మెప్పించాలి కానీ.. ప్రజలదే బాధ్యతని తప్పించుకోవడం నాయకత్వ లక్షణం కాదు !

రాజకీయాల్లో ఏదైనా ప్రజలే. ఓడించేది ప్రజలే..గెలిపించేది ప్రజలే. కానీ ఇంట్లో కూర్చుంటేనో… అహంకారం చూపిస్తేనే .. తెలంగాణ తెచ్చామంటేనో ఎవరూ గెలిపించరు. వారి కోసం పోరాడిన వారిని మాత్రమే గుర్తుంచుకుంటారు. మా తాతలు నేతులు తాగారు కదా అని వెళ్తే.. ప్రతీ సారి ఓట్లేయరు. కేటీఆర్ ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు. కేటీఆర్ రాజకీయనాయకుడిగా ఇంకా పూర్తి స్తాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంత వరకూ చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదు. పూలపాన్పు మీద అన్నట్లుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే ఉద్యమ బలం అంతా పార్టీకి వచ్చింది. అప్పట్నుంచి అధికారం అనుభవించారు. కానీ ఇప్పుడు ముళ్లబాట ప్రారంభమయింది. దీనిపైన పార్టీని నడిపించి .. ప్రజాభిమానం పొందాలి కానీ.. తాము ప్రజలకు ఏదో చేసేశామని చెప్పి.. వారే కాపాడుకోవాలని తడిగుడ్డేసుకుంటే.. ఇక కనుమరుగవ్వడమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close