తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలను చుట్టుముడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం దర్యాప్తులో అతిపెద్ద మలుపు ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని ఇచ్చిన వాంగ్మూలం, అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈ నోటీసులు అందించారు. హరీష్ రావు తర్వాత కేటీఆర్, కేసీఆర్‌లకు నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయి.
గతంలోనే ప్రచారం .. కాస్త ఆలస్యం !
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ, వ్యూహాత్మకంగా సిట్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. తొలుత హరీష్ రావును విచారించి, ఆయన ఇచ్చే సమాచారం లేదా ఇతర నిందితుల స్టేట్మెంట్లను క్రోడీకరించి తదుపరి నోటీసులను కేసీఆర్, కేటీఆర్‌లకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని, ఇంటెలిజెన్స్ వర్గాలకు పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండేవని ఇప్పటికే కొందరు అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
సజ్జనార్‌ను హరీష్ టార్గెట్ చేస్తోంది అందుకే?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని అంటున్నారు. రోజూ వరుసగా ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, దర్యాప్తును ప్రభావితం చేసేందుకే హరీష్ రావు ఈ విధమైన విమర్శలకు దిగుతున్నారని అనుకోవచ్చు.
బయటపడలేని విధంగా ఆధారాల సేకరణ
సిట్ ఈసారి పక్కా సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ట్యాపింగ్ కోసం వాడిన ప్రైవేట్ డివైజ్‌లు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల రికవరీ ప్రయత్నాలతో పాటు, ఎవరి ఆదేశాల మేరకు డేటాను సేకరించారనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో దాదాపు 4 వేలకు పైగా ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాప్ చేశారనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది. కనీస ఆధారాలు లభిస్తే.. బీఆర్ఎస్ అగ్రనేతలకు అరెస్ట్ గండం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు విచారణ అనంతరం వెలువడే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసేలా ఉన్నాయి.
