ప్రొ.నాగేశ్వర్ : కాంగ్రెస్‌లోకి ప్రియాంకా గాంధీ ఇప్పుడే ఎందుకు..?

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ… ఓ ఎత్తుగడ వేసింది. అదే.. కాంగ్రెస్ పార్టీలోకి.. ప్రియాంకా గాంధీ ఆగమనం. ఆమె ఇప్పటి వరకు తల్లి, సోదరుడు నియోజకవర్గాలైన రాయ్ బరేలి, అమేఠీల్లో మాత్రమే ప్రచారం చేసేవారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించబోతున్నారు. తూర్పు యూపీ బాధ్యతలను తీసుకుంటున్నారు. అయితే.. చాలా రోజుల నుంచి ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న చర్చ ఉన్నా.. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారనేది కీలకమైన అంశంగా మారింది.

రాజకీయాల్లో లేకపోయినా ప్రియాంకకు పొలిటికల్ ఇమేజ్..!

ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశ ప్రభావం కచ్చితంగా రాజకీయాలపై ఉంటుంది. ఎందుకంటే… ఆమె ఇంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ నేతలు ఆమెలో ఓ ప్రబల శక్తిని చూస్తూ వస్తున్నారు. అందుకే అడపాదడపా కాంగ్రెస్‌లో ఆమె ప్రముఖ పాత్ర పోషించాలంటూ.. ప్రకటనలు చేస్తూ ఉంటారు. బీజేపీ నేతలు కూడా.. కాంగ్రెస్‌లోకి ప్రియాంకా ఎంట్రీ.. ఆ పార్టీకి మైలేజీ ఇస్తుందని చెబుతూంటారు. జాతీయ మీడియాలోని బీజేపీ అనుకూల చానళ్లు.. జరిపించిన సర్వేలోనూ… ప్రియాంకా గాంధీ వల్ల కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుందని తేల్చారు. అంతే కాదు.. భారత రాజకీయాల్లో శక్తివంతమైన మహిళలకు ప్రజల ఆదరణ ఉంటుంది. ఇతర రాజకీయ నేతలు కూడా విమర్శలు చేయలేని పరిస్థితి ఉంటుంది. రాహుల్‌ను పప్పు అన్నట్లు… ప్రియాంకను.. వేరే పేరుతో విమర్శించే ధైర్యం చేయలేరు. పైగా ఆమె.. ఇందిరా గాంధీ పోలికలతో ఉంటారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ పట్ల.. పేద వర్గాల్లో ఇప్పటికీ..అభిమానం ఉంది. ఇవన్నీ కాంగ్రెస్‌కు కలసి వస్తాయి.

పార్టీపై రాహుల్ పట్టు సాధించిన తర్వాత ప్రియాంక ఆగమనం..!

ప్రియాంకాను ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారంటే.. దానికి కొన్ని కీలకమైన కారణాలు ఉండొచ్చు. 2019 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి.. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీకి కూడా అత్యంత కీలకం. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… దేశంలోని అన్ని వ్యవస్థల్లో ఆ పార్టీతో ఆరెస్సెస్ బలం పెంచుకుంటుంది. తిరుగులేని శక్తిగా మారే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో.. మూడు, నాలుగేళ్ల కిందట ప్రయాంకా గాంధీని.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వస్తే… అప్పటి పరిస్థితుల ప్రకారం.. రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిసేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో ఉంది. రాహుల్ ఎక్కడ అడుగుపెట్టినా ఓడిపోతారనే విమర్శలు వచ్చేవి. అయితే ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. తన నాయకత్వంలో.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించగలిగారు. ఆయన నాయకత్వ సామర్థ్యంపై నమ్మకం పెంచుకున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రియాంకకు బాధ్యతలివ్వడంతో.. రాహుల్‌పై పెద్దగా విమర్శలు రావు. రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో.., చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీకి ధీటుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీని అన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇక ముందు పప్పు అనలేమని… బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో.. ప్రియాంకా గాంధీ కాంగ్రెస్‌లోకి రావడం వలన… రాహుల్‌కు .. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆమె రాహుల్ నాయకత్వానికి పోటీ అని మాత్రం ఎవరూ భావించరు. ఆమె రాహుల్‌కు సహకారం అని మాత్రం అనుకుంటారు. ఇప్పుడు అన్ని పార్టీల చోట్లా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి… కాంగ్రెస్ లో నాయకత్వంపై వివాదం రాదు.

తూర్పు యూపీలో మంచి ఫలితాలొస్తే కాంగ్రెస్‌కు అధికారం దక్కే చాన్స్..!

ఇక కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ కూడా అత్యంత కీలకం. ప్రియాంకకు.. తూర్పు యూపీ బాధ్యతలు ఇచ్చారు. అక్కడ హిందూ ఓటర్లు అత్యధికం. పూర్వాంచల్ ప్రాంతం తూర్పు యూపీలోనే ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ.. ఈ పూర్వాంచల్‌లో దాదాపుగా అన్ని సీట్లనూ గెలుచుకుంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇక్కడ మంచి పలితాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే.. 2009లో కాంగ్రెస్ పార్టీ యూపీలో 21 స్థానాలు గెలుచుకుంది. 18శాతం ఓట్లు సాధించింది. అయితే.. ఆ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ బాగా తగ్గిపోయింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి… రివైవల్‌కు ప్రియాంకా గాంధీ ఆగమనం చాలా ముఖ్యం. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలయిక వల్ల.. ఓ సోషల్ ఇంజినీరింగ్ జరిగింది. ఇప్పుడు… కాంగ్రెస్ ప్రియాంక అస్త్రంతో అగ్రవర్ణాల ఓట్లను.. తెచ్చుకోగలిగితే.. అది బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. అంటే.. కాంగ్రెస్ బేస్ పెంచుకోవడం.. బీజేపీకి సీట్లు రాకుండా చేయడం.. ప్రియాంకా .. రాజకీయ రంగ ప్రవేశంలో కీలకం.

ప్రియాంక అడుగుల వెనుక కాంగ్రెస్‌కు స్పష్టమైన లక్ష్యాలు..!

ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన వెనుక.. ఓ స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. సోనియా గాంధీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. రాయ్ బరేలీ స్థానం… ఇందిరా గాంధీ కాలం నుంచి.. ఆ కుటుంబం చేతుల్లోనే ఉంది. ఇప్పుడు.. ప్రియాంకా గాంధీ ఆ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు బాధ్యతలను.. ప్రియాంకా కనీసం ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా పంచుకుంటుంది. ప్రియాంకా రావడం వల్ల సత్ఫలితాలు వస్తే.. కాంగ్రెస్‌కు ప్లస్.. ఒక వేళ రాకపోయినా రాహుల్ నాయకత్వానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.