ఆరోజు నా రిటైర్మెంట్ ప్ర‌క‌టించేస్తా: ర‌కుల్‌ప్రీత్ సింగ్ తో ఇంట‌ర్వ్యూ

తెలుగునాట బిజీ బిజీగా ఉన్న క‌థానాయికల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు క‌చ్చితంగా చెప్పుకోవాలి. యువ క‌థానాయ‌కుల‌తో పాటు, అగ్ర హీరోల‌తోనూ న‌టిస్తూ క్రేజీ క‌థానాయిక అనిపించుకొంది. కేవ‌లం తెలుగుకే ప‌రిమితం అవ్వ‌డం లేదు. త‌మిళంలోనూ సినిమాలు చేస్తోంది. మ‌రోప‌క్క బాలీవుడ్‌కీ ఎగిరిపోయింది. ఆమె న‌టించిన – ‘జ‌య‌జాన‌కీ నాయ‌క’ ఈనెల 11న విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో తెలుగు 360.కామ్ చేసిన చిట్ చాట్ ఇది!

* అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమా చేస్తూ.. ఓ యువ హీరో ప‌క్క‌న న‌టించ‌డానికి ఒప్పుకొన్నారు. ప్ర‌త్యేక‌మైన కార‌ణాలేమైనా ఉన్నాయా?
– నా కెరీర్ ముందు నుంచీ ఇంతే క‌దా? పెద్ద హీరో పెద్ద సినిమా అనేదేం చూడం లేదు. క‌థ‌, నా పాత్ర న‌చ్చితే చేస్తున్నా. పైగా ఇది బోయ‌పాటి శ్రీ‌ను గారి సినిమా. ఆయ‌న‌తో నేను స‌రైనోడు చేశా. ఆయ‌న ప‌ట్టుకొంటే క‌చ్చితంగా మంచి క‌థ‌నే ప‌ట్టుకొంటార‌న్న‌ది నా న‌మ్మ‌కం.

* బెల్లంకొండ న‌టించిన సినిమాలు చూశారా?
– నిజం చెప్పాలంటే చూళ్లేదు. కానీ… తొలి రోజుకీ.. ఇప్ప‌టికీ త‌న‌లో మార్పు గ‌మ‌నించా. చాలా మెచ్యూర్డ్ అయ్యాడు. ఇదంతా బోయ‌పాటి మ‌హిమ‌నే. ఆయ‌న న‌టీన‌టుల నుంచి త‌న‌కు కావ‌ల్సింది రాబ‌ట్టుకొనే ర‌కం. బోయ‌పాటి సినిమాలు చూడండి.. ఆయ‌న సినిమాలో స‌రిగా న‌టించ‌నివాళ్లెవ‌రూ ఉండ‌రు. స‌న్నివేశాన్ని న‌టించి మ‌రీ చూపిస్తారు కాబ‌ట్టి… న‌టీన‌టుల‌కు చాలా ఈజీ అయిపోతుంది.

* మీతో పోలిస్తే బెల్లంకొండ చాలా జూనియ‌ర్‌.. త‌న‌కేమైనా స‌ల‌హాలు ఇచ్చారా?
– స‌ల‌హాలు ఇవ్వ‌డానికి నేనెవ‌ర్నండీ. నేనేం కోచింగ్ సెంట‌ర్ పెట్ట‌లేదు క‌దా? రెండు సినిమాలు చేసిన అనుభ‌వం శ్రీ‌నుకి ఉంది. పైగా బోయ‌పాటి గారు ఉన్నారు. నేను ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

* బోయ‌పాటి ఇంత సాఫ్ట్ టైటిల్ పెడ‌తార‌ని ఊహించారా?
– క‌థ‌కు త‌గిన టైటిల్ ఇది. ఆయ‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టు ర‌ఫ్ టైటిల్ పెట్టొచ్చు. కానీ స్టోరీకి సూట్ అవ్వ‌దు.

* ఇంత‌కీ ఈ సినిమాలో మీకు న‌చ్చిన అంశం ఏమిటి?
– ఈ సినిమాలో చ‌క్క‌టి ల‌వ్ స్టోరీ ఉంది. అందులో ఉన్న నిజాయ‌తీ నాకు బాగా న‌చ్చింది. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ‌క‌థ‌లు చూడ‌డం చాలా క‌ష్టం. ఎవ‌రి ప్రేమ‌లోనూ నిజాయ‌తీ ఉండ‌డం లేదు. ఎందుకు క‌లుసుకొంటున్నారో, ఎందుకు విడిపోతున్నారో అర్థం అవ్వ‌డం లేదు. గొప్ప గొప్ప ప్రేమ‌లు సినిమాల్లోనే ఉంటాయేమో.

* మీ పాత్ర ఎలా ఉండ‌బోతోంది?
– టైటిల్‌లో ఉన్న `జాన‌కి`ని నేనే. నా పాత్ర‌లో రెండు షేడ్స్ ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కూ ఒక‌లా ఉన్న జాన‌కి.. త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న వ‌ల్ల మ‌రోలా మారిపోతుంది. ఆ సంఘ‌ట‌న ఏమిటి? ఎలా ఉండే జాన‌కి ఎలా మారింది? అనేది తెర‌పై చూడాల్సిందే.

* భ్ర‌మ‌రాంబ‌కీ.. జాన‌కికీ తేడాలున్నాయా?
– చాలా. అది వేరు ఇది వేరు. భ్ర‌మ‌రాంబ చాలా హైప‌ర్‌. జాన‌కి అలా కాదు. ఎప్పుడూ మూడీగా ఉంటుంది. ఈ సినిమాలో చాలా స‌న్నివేశాల్లో మూడీగానే ఉంటా. గ్లిజ‌రిన్ చాలా వాడేశా. `ఈ రోజు షూటింగ్ అయిపోయింది.. కాస్త న‌వ్వు` అంటూ బోయ‌పాటి గారు ఆట‌ప‌ట్టించేవారు. నా పాత్ర ఆ స్థాయిలో ఉంటుంది.

* సినిమా చూస్తూ చూస్తూ ఏడ్చేసిన సంద‌ర్భాలున్నాయా?
– ఇటీవ‌ల నిన్ను కోరి సినిమా చూశా. ఆ సినిమా చూస్తూ నిజంగానే ఏడ్చేశా. అంత ఫీల్ ఉన్న ల‌వ్ స్టోరీ ఈమ‌ధ్య చూళ్లేదు. వెంట‌నే… నాని, నివేదాల‌కు ఫోన్ చేసి.. `ఇంత ఏడ్పించేశారేంటి` అంటూ.. గొడ‌వ ప‌డ్డాను (న‌వ్వుతూ)

* ఫిదా చూశారా?
– ఇంకా లేదు. చూడాలి. సాయిప‌ల్ల‌వి బాగా చేసింద‌ట‌.

* నివేదా, సాయిప‌ల్ల‌వి.. ఇలా మీకు పోటీ పెరిగిపోతుంద‌ట‌..
– ఎందుకు పెరుగుతుంది. ఎవ‌రికి రావాల్సిన అవ‌కాశాలు వాళ్ల‌కు వ‌స్తాయి. ప్ర‌తిభావంతులైన క‌థానాయిక‌లు రావ‌డం మంచిదే క‌దా? అప్పుడే
క‌థానాయిక‌ల్ని దృష్టిలో ఉంచుకొని కొత్త క‌థ‌లు త‌యారు చేసుకొంటారు.

* ర‌కుల్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అంటే…
– నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. ఎందుకంటే రెండు ఫ్లాపులు వ‌స్తే మీరే న‌న్ను ఐరెన్ లెగ్ అంటారు. ర‌కుల్ బాగుంది.. బాగా చేస్తోంది అనే రోజు వ‌ర‌కూ సినిమాల్లో ఉంటా. ఎందుకు న‌టిస్తోందిరా బాబు.. అనుకొన్న రోజు సినిమాల‌కు రిటైర్‌మెంట్ ఇచ్చేస్తా. ఈలోగా నా ప‌నిని నేను ఆస్వాదిస్తా.

* ఈమ‌ధ్య బాలీవుడ్ పైనా దృష్టి పెట్టిన‌ట్టున్నారు?
– మంచి సినిమా ఎక్క‌డి నుంచి వ‌చ్చినా చేస్తా. కానీ ఇప్ప‌టికీ నాకు తెలుగు సినిమాలంటేనే ఇష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.