రామ్ చరణ్ పై మెగా అభిమానులకు గంపెడాశలు ఉన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత చరణ్ ఇమేజ్ బాలీవుడ్ స్థాయిలోనూ పెరిగింది. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అయినా, ఆ ఎఫెక్ట్ చరణ్ పై మాత్రం పడలేదు. ఇప్పుడు `పెద్ది` కోసం బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చరణ్ తదుపరి లైనప్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ లిస్టులో ఇంకా చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చరణ్ కి ఓ కల ఉంది. అదే బాలీవుడ్ హిట్. ‘తుఫాన్’ తో అలాంటి ప్రయత్నం చేసినా కలసి రాలేదు. తెలుగులో ఓ సినిమా తీసి, బాలీవుడ్ లో కలక్షన్లు సాధించుకోవడం కాదు. అక్కడ నేరుగా ఓ సినిమా చేసి హిట్టు అందుకోవడం ప్రధానం. చరణ్ ఇప్పుడు దానిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు చరణ్ కొన్ని కథలు వింటున్నారు. అందులో భాగంగా సంజయ్ లీలా భన్సాలీ ఓ కథ చెప్పినట్టు, దానికి చరణ్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం అందుతోంది. భన్సాలీకి సౌత్ హీరోలతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అల్లు అర్జున్ ని కూడా ఆయన కొన్నిసార్లు కలిశారు. ఈ కాంబోలో సినిమా వస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ వర్కవుట్ అవ్వలేదు.
భన్సాలీ గొప్ప దర్శకుడు. విజన్ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాలకంటూ ఓ క్రేజ్ ఉంది. ఏ హీరోకైనా బన్సాలీతో వర్క్ చేయాలని ఉంటుంది. కాబట్టి చరణ్ కూడా ఆ రూట్ లోనే ఆలోచిస్తున్నాడు. కాకపోతే చరణ్ కి ఈసారే తప్పు చేసే ఛాన్స్ లేదు. తప్పకుండా హిట్టు కొట్టాల్సిందే. అలాంటప్పుడు ఫామ్ లో ఉన్న దర్శకుడితో ట్రావెల్ అయితే బాగుంటుందన్నది ఫ్యాన్స్ ఆలోచన. భన్సాలీ ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఫ్యాన్స్ కూడా ఊహించలేరు. అలాంటప్పుడు ఆదిత్యాధార్ లా ట్రెండ్ లో ఉన్న దర్శకుడితో జట్టు కడితే బాగుంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ మనసు పెడితే, ఫలానా దర్శకుడితో చేయాలని ఫిక్స్ అయితే… దాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ష్యూర్ షాట్ హిట్స్ పై చరణ్ ఫోకస్ పెడితే బాగుంటుంది. భన్సాలీ మరీ మైండ్ బ్లోయింగ్ కథతో వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. కాకపోతే.. ఈసారి చరణ్ బాలీవుడ్ లో సినిమా చేస్తే గనుక.. అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. మరో ఆప్షప్ లేదు.


