అమరావతిలో ‘అసలు’ సమస్యేమిటి?

అమరావతి నిర్మాణం కోసం లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ సమర్పించిన డిజైన్లలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నది. తుదిమెరుగులు దిద్దే సందర్బంలో దర్శకుడు రాజమౌళి సూచనలు తీసుకోవాలన్న నిర్ణయంపై చాలా వ్యాఖ్యలు వచ్చాయి గాని అసలు సమస్య అది కాదు. అమరావతి డిజైనింగ్‌ కోసం 2015లో మొదట 10 సంస్థలను ఆహ్వానించి నార్మన్‌ పోస్టర్స్‌, రెమా కొల్‌హాస్‌, రిచర్డ్‌ రోగర్‌ అనే మూడు సంస్థలను ఎంపిక చేశారు. తర్వాత కారణం చెప్పకుండానే వాటిలో కొన్ని పక్కనపెట్టి మాకీ అండ్‌ అసోసియేట్స్‌, రోజర్‌ స్ట్రిక్‌ హార్చర్‌ అండ్‌ పార్టనర్స్‌,వాస్తుశిల్ప అనే మూడు సంస్థలకు పోటీ పెట్టారు. ఇందులో మాకీ సమర్పించిన డిజైన్లను స్వీకరించి ప్రజల సందర్శన కోసం వుంచారు. బాగున్నాయన్నట్టే మాట్లాడారు.అయితే అవి నిర్జీవంగా పారిశ్రామిక వాడలాగా వున్నాయని విమర్శలు వచ్చాక మార్పులు చేయాలని చెప్పారు. మార్పులు జరిగిన తర్వాత హఠాత్తుగా మాకీని మార్చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నాలుగు విమర్శలు చేసింది. అందులో ఒకటి తప్ప అన్నీ అవాస్తవాలేనని మాకీ అధినేత పుమహికో మాకీ భారత భవన నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వ ప్రతినిధులు తమ సంస్థ కేంద్రమైన టోక్యో సందర్శించి ముంబాయికి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను భారత భాగస్వామిగా చేసుకోవాలని చెప్పారని, అయితే తమకు మరో భాగస్వామి వున్నందున అందుకు అంగీకరించలేదని మాకీ వెల్లడించారు. ఈ కారణం చేతనే తమను పక్కన పెట్టారని కూడా ఆరోపించారు. ఆ తర్వాత నార్మన్‌ పోస్టర్‌ను ఎంపిక చేశారు.వారు ఇప్పటికి రెండు సార్లు డిజైన్లు ఇచ్చారు. కాని ఖరారు కాలేదు. కారణాలు చెప్పలేదు. ఇప్పుడు బాహుబలి కోణంతో సహా కొత్త అభ్యంతరాలు లేవనెత్తారు.ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నదని ఎన్నికల ముందు అమరావతి నిర్మాణం ఉధృతం చేస్తే ప్రయోజనమని ప్రభుత్వం బావిస్తున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోగా అస్మదీయ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ప్రయత్నాలు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఏతావాతా ఈ మొదటి పదవీ కాలంలో అమరావతి తుది రూపం తీసుకోవడం జరగదని తేలిపోతున్నది. పైగా 20 ఏళ్లలో కోటి 25 లక్షల జనాభా రావాలని వేసిన అంచనా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారతీయ నగరాలు ఆ సంఖ్య చేరడానికి శతాబ్దాలు పట్టింది. ఇప్పటికే ప్రముఖ నగరాలుగా వున్న విజయవాడ గుంటూరు వంటి చోట్ల కూడా అందులో ఆరో వంతుకన్నా తక్కువ జనాబా వుంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా వూదరగొట్టడమేనని సామాన్యులు కూడా చప్పరించేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.