ఆనంకు టీడీపీలో సైద్ధాంతిక సిద్ధాంతం కనిపించలేదట..!

నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. రెండో తేదీన వైసీపీలో చేరుతున్నట్లు.. అనుచరుల సమావేశం నిర్వహించి ప్రకటించారు. వారికి తాను తెలుగుదేశం పార్టీని వీడటానికి విచిత్రమైన కారణం చెప్పారు. టీడీపీలో సైద్ధాంతిక సిద్ధాంతం లేదని.. అందుకే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటింటారు. ఆనం చెప్పే సైద్ధాంతిక సిద్ధాంతం ఏమిటో.. ఆయన అనుచరులకు అర్థం కాలేదు. బహుశా… పదం బాగుందని.. ఆనం కూడా వాడేసి ఉంటారు. దానికి అర్థం ఆయనకు కూడా తెలిసి ఉండదు.

ఇప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు వెదుక్కునే నేతలు ఎవరైనా ఉన్నారా..? నిజంగా ఆనంకు ఓ సిద్దాంతమే కావాలనుంటే.. ఆయన రాజకీయ జీవితంలో అన్ని పార్టీలు మారి ఉండేవారా..? తెలుగుదేశం పార్టీలో చేరగానే.. తనకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చేస్తారని.. ఆనం ఆశ పడ్డారు. కానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు… అంత తేలిగ్గా ఎవర్నీ తెచ్చి నెత్తిన పెట్టుకోరు. వచ్చే ఎన్నికల తర్వతా కూడా.. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్న గ్యారంటీ లేదు. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచినా అనామకంగా ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే.. వైసీపీ వైపు చూస్తున్నారు. అక్కడ టిక్కెట్ గ్యారంటీ లేకపోయినా… సర్దుకుపోయి చేరిపోతున్నారు. తన రాజకీయ అవసరాల కోసం.. తన రాజకీయ భవిష్యత్ కోసం.. పార్టీ మారుతూ.. మళ్లీ… టీడీపీలో సిద్ధాంతాల గురించి.. సైద్ధాంతిక సిద్ధాంతాల గురించి మాట్లాడేస్తున్నారు.

ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుదామని.. తన అనుచరులందర్నీ ఆహ్వానిస్తున్నారు. కానీ.. వైసీపీలో పరిస్థితులు చూసి.. చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారందరికీ.. టీడీపీ నేతులు.. వెంటనే భరోసా ఇస్తున్నారు. పార్టీలోనే ఉంటే.. భవిష్యత్ ఉంటుందని నచ్చ చెబుతున్నారు. దీంతో ఆనం అనచరులు రోజు రోజుకు చిక్కిపోతున్నారు. చివరికి పార్టీ మారేటప్పటికి.. ఎంత మంది అనుచరులు మిగులుతారో చెప్పడం కష్టమన్న ప్రచారం నెల్లూరులో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com