రివ్యూ : శైలజా రెడ్డి అల్లుడు

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.25/5

ఈ ‘అల్లుడు’ బాలేడు బాసూ

శేఖర్ కమ్ముల యాక్షన్ మూవీ చూసారా?

బోయపాటి కామెడీ సినిమా కన్నారా?

బాపు, జంధ్యాల సినిమాల్లో హీరో గొడ్డలి పట్టుకుని అడ్డంగా నరుక్కుంటూ పోవడం ఊహించారా?

వేదిక మీద దిల్ రాజు తొడగొడుతూ సవాల్ విసరడం విన్నారా?

ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఒకేసారి, ఒకే చోట అనుభవించి, పలవరించాలంటే, పెద్దగా ప్రయాసపడక్కరలేదు. ప్రపంచ సాహసయాత్ర సాగించనక్కరలేదు

శైలజారెడ్టి అల్లుడు సినిమా చూస్తే చాలు.

సాధారణంగా ప్రేక్షకులకు ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చే ఫుటేజ్ ను యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చూసే అవకాశం వుండదు. ఎడిటర్ దాన్ని అంతా ఓ పద్దతిగా సెట్ చేసి, సినిమా రూపం ఇచ్చాక ప్రేక్షకులు చూస్తారు. కానీ ఇప్పుడు అలాంటి అపూర్వ అవకాశం వచ్చింది. ఎడిటింగ్ జరగకుండా, అడ్డదిడ్డంగా వున్నట్లు అనిపించే సినిమా చూసే అపూర్వ అవకాశాన్ని శైలజారెడ్డి అల్లుడు ఇచ్చింది.

దర్శకుడు మారుతి తనవి కాని జోళ్ళల్లో కాళ్లు పెట్టి, ఏం తీస్తున్నాడో? ఏం చేస్తున్నాడో తనకైనా తెలుస్తోందో లేదో అన్న రీతిలో సినిమా తీసుకుంటూ పోతే అది అచ్చం శైలజారెడ్డి అల్లుడు మాదిరిగా వుంటుంది.

ఇంతకీ ఈ శైలజారెడ్డి అల్లుడు కథ, కమామిషు ఏమిటి?

ఒంటినిండా బలుపు అలియాస్ ఇగో నింపేసుకున్న ఓ తండ్రి(మురళీశర్మ) అతగాడికి ఫుల్ పాజిటివ్ ఆటిట్యూడ్ వున్న కొడుకు(నాగ్ చైతన్య).
బలుపు, ఇగోలకు మించి ఇంకేదో పదం వుంది దాన్ని వాడాల్సిన రేంజ్ లో వుండే ఓ అమ్మ (రమ్యకృష్ణ), ఆ అమ్మకు అచ్చం జిరాక్స్ అయిన కూతురు(అను ఇమ్మాన్యుయేల్). ఈ అబ్బాయి..ఆ అమ్మాయిని ప్రేమించిన నేపథ్యంలో జరిగిన బోలెడు సంఘటనలే శైలజారెడ్డి అల్లుడు సినిమా.

దర్శకుడు మారుతి మంచి కథకుడు కాదు. మంచి స్క్రిప్ట్ రైటర్ అంతకన్నా కాదు. కానీ కొన్నికాన్సెప్ట్ లు అల్లుకొని, వాటి చుట్టూ కొంత ఫన్ జనరేట్ చేసుకుని, బండి లాగించగలడు. ఆయన గత సినిమాలు అన్నీ చెప్పే విషయం అదే. అలాంటి దర్శకుడు మారుతి, ఇంత కాన్ ఫ్లిక్ట్ వున్న కథ ఎన్నుకున్నారు. నిజానికి ‘గోల మధ్య ఇరుక్కున్న జంట’ అనే సింగిల్ లైన్ కాన్సెప్ట్ వినగానే, సినిమాకు మాంచి ముడిసరుకే అని నిర్మాతలకు, హీరోకు అనిపించి వుండొచ్చు. కానీ అది మారుతి స్టయిల్ కు సెట్ అవుతుందా? అన్నది ఆలోచించినట్లు లేదు. అక్కడే తేడాకొట్టేసింది.

ఈ సబ్జెక్ట్ ను ఫన్ మూవీగా మార్చాలా? ఎమోషనల్ బాండింగ్ లతో కనెక్ట్ చేయాలా? అసలు ఇగో, బలపు, పొగరు వీటన్నింటి మధ్య కనిపించని తేడా చాలా వుంటుంది. ఇవన్నీ స్క్రీన్ మీదకు విడివిడిగా తీసుకురావడం కష్టం. పైగా బలమైన పాత్రలు రెండు మూడు వున్నపుడు సినిమాను డీల్ చేయడం అంత సులువు కాదు. ఇవన్నీ విజయవంతంగా చేస్తూ, అన్ని పాత్రలకు సరైన వెయిటేజ్ ఇస్తూ, సరైన సీన్లు రాసుకుని, సరైన స్క్రీన్ ప్లే సెట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. దర్శకుడు మారుతి స్టామినా ఇందుకు వన్ పర్సంట్ కూడా సరిపోలేదు.

సినిమాలో ఏ క్యారెక్టర్ కు న్యాయం జరగలేదు. ఏ క్యారెక్టర్ కూడా ఓ లైను లెంగ్త్ తో వుండదు. లక్కీగా మురళీశర్మ క్యారెక్టర్ నిడివి తక్కువ కాబట్టి అక్కడ తేడా కనిపించలేదు కానీ రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ పాత్రల విషయంలో అది క్లియర్ గా తెలిసిపోయింది. ఆ రెండు పాత్రలకు ఓ పద్దతీ, పాడూ వుండదు. ఇక మిగిలిన పాత్రలన్నీ దాదాపు డమ్మీలే. హీరో నాగ్ చైతన్యతో సహా. చైతన్య పాత్ర సినిమా పొడవునా వుంటుంది. కానీ అది గాలి వాటానికి వెళ్తుంటుంది. సీనియర్ నరేష్ పాత్ర ఎందుకో మారుతికే తెలియాలి. స్క్రీన్ మీద తరచు కనిపించే చాలా పాత్రలకు డైలాగులే వుండవు. కొన్ని పాత్రలకు ఒకటి లేదా రెండు డైలాగులు వుంటాయి.

సీన్లు ఒకదాని వెనుక ఒకటి వచ్చిపోతుంటాయి. కానీ ఓ పద్దతి పాడు వుండదు. ఎమోషన్ సీన్ తో పాటే లావెట్రీ సీన్ కనెక్ట్ చేస్తారు. అసలు దర్శకుడు మారుతి ఈ కథను ఇలాగే డీల్ చేయాలనుకుని రంగంలోకి దిగారా? లేక, రోజు రోజుకు మార్చుకుంటూ వెళ్లారా? అన్న అనుమానం కలుగుతుంది.

సినిమా తొలిసగం బాగానే స్టార్ట్ అవుతుంది. ఏదో బండి నడుస్తోంది అనుకుంటూ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరకు వస్తే, సరే, దీని కోసమే ఇలా సాగదీసుకుంటూ వచ్చారు అని సరిపెట్టుకుంటారు ప్రేక్షకులు. ద్వితీయార్థం మొత్తం శైలజారెడ్డి ఇంటికి షిప్ట్ అయిన తరువాత దర్శకుడు స్క్రిప్ట్ కాగితాలు గాల్లోకి విసిరి, ఏది ముందు చేతికి అందితే దాన్ని షూట్ చేసి అతుకులు వేసిన ఫీలింగ్ కలుగుతుంది.

దీనికి తోడు సినిమాలో ఆరుపాటలు. అసలే సినిమా ఎప్పుడు అయిపోతుందా అని చూస్తుంటే, మాంచి ఎమోషన్ పరిస్థితుల్లో చివర్న పెళ్లి పాట. హతవిధీ అనుకోవాల్సిందే.

ఇలా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాజిటివ్ పాయింట్ ఏమిటంటే సినిమా కలర్ ఫుల్ గా వుంటుంది. అను ఇమ్మాన్యుయేల్ ఆద్యంతం మాంచి మాంచి చీరలు సింగారించుకుని కనిపిస్తుంది. ఆమె చీరలకే కాస్త ఎక్కువ బడ్జెట్ ఖర్చుచేసి వుంటారు. రమ్యకృష్ణ ఫిజికల్ గా బాగా తగ్గిపోవడం వల్ల కళ్లలో ఫోర్స్ కనిపిస్తుంది తప్ప, బాడీ లాంగ్వేజ్ లో అంత ఫోర్స్ వుండదు.

నాగ్ చైతన్య అందంగా కనిపించాడు. నటన ఏదో బండి లాగించాడు. అను ఇమ్యాన్యుయేల్ ను ఇలాంటి పాత్రకు తీసుకోవడమే కరెక్ట్ కాదు. అంత బరువు ఆమె మోయలేదు. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ హాట్రిక్ కొట్టిన వెన్నెల కిషోర్ కు ఈ సినిమా దిష్టి తీసేస్తుంది. ఫొటోగ్రఫీ, ఆర్ట్ డైరక్షన్ కలిసి సినిమా కలర్ పుల్ గా వుంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం పెద్ద గొప్పగా లేదు కానీ, పాటలు ఫరావాలేదు. మారుతి సంభాషణల్లో చమక్కు మిస్ అయింది.

టోటల్ గా మారుతి అందించిన మిస్ ఫైర్ శైలజారెడ్డి అల్లుడు

ఫైనల్ టచ్ – ఈ’గోల’ ఏందిరా భయ్

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com