హిమ శిఖరంలో సమర క్షేత్రం సియాచిన్‌

Telakapalli-Raviసియాచిన్‌లో మంచు తుపాను కారణంగా తొమ్మిది మంది భారత సైనికులు చనిపోగా మృత్యుంజయుడుగా బయిటపడిన హనుమంతప్ప జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఆ యుద్ధ క్షేత్రం గురించి సైనిక దళాల మాజీ ప్రధానాధికారి జెజెసింగ్‌ రాసిన జ్ఞాపకాలు కొన్ని:

సియాచిన్‌ ప్రపంచంలో రెండవ అతి పెద్ద హిమఖండం. అది భారత దేశపు ఉత్తర శిఖరాన కారంకోరం మహా శ్రేణితో మొదలవుతుంది. 76.4 కిలోమీటర్ల ఆ మంచుఖండం మూలమట్టం(బేస్‌ క్యాంప్‌) నుంచి ఉత్తరంగా సాగిపోతున్న కొద్ది ఎవరైనా ఆ హిమ సాగర సౌందర్యానికి పరవశించి పోవలసిందే. ఆ ప్రవాహంలో కొట్టుకువచ్చిన రాళ్లూ రప్పలూ ఇరు వైపులా గుట్టలు పడి వుంటాయి. ఎత్తుపల్లాల కఠిన శిలలతో కూడిన సాయికంగ్రి, ఇంద్ర కోల్‌ తదితర శిఖరాల నుంచి చూస్తే రెండు వైపుల నుంచి ఆ తెల్లటి మంచులో నెమ్మదిగా పైకి తేలినట్టు కనిపిస్తుంది. అదో అద్బుత ఆదివాస్తవ చిత్రం లాటి దృశ్యమనిపిస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలను గురించి ఒక గొప్ప వాక్యం చెబుతుంటారు: ఈ భూమి ఎంత వట్టిపోయివుంటుందంటే ఆ కనుమలు ఎంత ఎత్తుగా వుంటాయంటే కేవలం ప్రాణ స్నేహితులు లేదా భీకర శత్రువులు మాత్రమే ఆ మార్గంలో వస్తారు” సియాచిన్‌ పశ్చిమాన శిలామయమైన సాల్ట్రో శ్రేణి వుంటుంది. అది బలిస్తాన్‌కూ లడక్‌ లోయలోని నుబ్రాకు మధ్య రేఖగా వుంటుంది. బాల్టి భాషలో సియాచిన్‌ అంటే ‘ గులాబీలు సమృద్ధిగా వుండే చోటు’ షైవోక్‌ నదిలో కలిసే ఉపనది నుబ్రా అక్కడే పుడుతుంది. షైవోక్‌ కారంకోరంలో మొదలవుతుంది. అది స్కద్రు దగ్గర సింధు నదిలో కలుస్తుంది.

1947-48లో భారత పాక్‌ యుద్ధం ముగిసి జమ్మూ కాశ్మీర్‌లో ఇక కాల్పుల విరమణ రేఖపై అంగీకారం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు ఒక మ్యాపుపై దాన్ని గుర్తించాయి.ఆ విభజన గుర్తులుఒక బిందువు అంటే ఎన్‌జె9842 వరకూ నిర్దిష్టంగా వున్నాయి. ఆ తర్వాతకు వచ్చేసరికి’ ఆ పైన హిమఖండాల ఉత్తరం వరకూ’ అని రాసి వుంది. 1972లో సిమ్లా ఒప్పందం అనంతరం కూడా ఈ వైఖరి కొనసాగింది. కాల్పుల విరమణ రేఖకు వాస్తవాధీన రేఖ అని పేరు మార్చినా అది మారలేదు.ఆ నిరర్థక మంచు సీమలో శాశ్వత ప్రాతిపదికన ఎవరైనా వుండటం అసంభవం అనుకున్నారు. అందుకే జమ్మూ కాశ్మీర్‌ సంస్థానం చైనా సరిహద్దుల వరకూ ఆ రేఖను పొడగించడం గురించి ఆలోచించలేదు.

భారత దేశంలో భాగమైన షాక్సగం లోయను చైనాకు అప్పగిస్తూ పాకిస్తాన్‌ ఒక ఒప్పందం చేసుకుంది. 5180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ లోయ కారంకోరంకు ఉత్తరాన వుంటుంది. వాస్తవాధీన రేఖను ఎన్‌జె9842 నుంచి కారంకోరం శ్రేణి కనుమల వరకూ పొడగిస్తూ పాకిస్తాన్‌ చర్య తీసుకుంది. ఇది మోసపూరితం, చట్ట విరుద్ధం అని భారత దేశం ఖండించింది. షాంక్సంగం లోయ జమ్మూ కాశ్మీర్‌ను పాలించిన డోగ్రా రాజ్యంలో భాగం. ఆ రాష్ట్రం 1947లో భారత దేశంలో విలీనమైంది గనక అది చట్టబద్దంగానే ఇండియాలో భాగమని వాదించింది.

1971 భారత పాక్‌ యుద్ధంలో నిర్ణయాత్మకమైన విజయం తర్వాత భారత దేశం వాస్తవాధీన రేఖను ఉత్తర దిశలో ఎన్‌జె9842 హిమఖండం వరకూ అమలు చేయాలని పట్టుపట్టేందుకు చాలా అవకాశం వుండింది. 1949లో తొలుత కుదిరిన కరాచీ ఒప్పందం సారాంశం అదే. అయితే 1972 సిమ్లా చర్చల సందర్భంలో మనం ఆ అవకాశం కోల్పోయాం. ప్రముఖ సాహసయాత్రీకుడు హరీష్‌ కపాడియా రాసిన హృద్యమైన కథనంలో ఇలా వుంటుంది:’ ఎలాగో బయిటపడాలనే తపనలో వున్న భుట్టో తనను(శాల్ట్రో శ్రేణి పొడుగునా సరిహద్దులను విడగొడతానని) నమ్మవలసిందిగా ఇందిరాగాంధీని ప్రాధేయపడ్డాడు. ఈ సమయంలో సైనికాధికారులను తాను విరోధం చేసుకోలేనని ఆయన అన్నాడు. ఆప్‌ ముజ్‌పర్‌ భరోసా కీజియె(నాపై భరోసా వుంచండి) అన్నాడని చెబుతారు.’

అయితే తర్వాత అంతర్జాతీయంగా ప్రచురించిన దేశ పటాలలో అట్లాస్‌లలో వినాశకరమైన దురాక్రమణ లేదా పొరబాట్లు కనిపించడంతో సియాచిన్‌ సమస్య ప్రాచుర్యంలోకి వచ్చింది. వాస్తవాధీన రేఖను ఎన్‌జె9842 నుంచి కారంకోరం కనుమ వరకూ ఏకపక్షంగా పొడగిస్తూ అవి రూపొందాయి. ఈ రేఖ పొందిక ఉత్తరంగా పోవడమూ లేదు అలాగే కారంకోరం కనుమ నుంచిఎలాటి హిమఖండాలూ పుట్టడం లేదు.సైన్యం పురమాయింపుతో ఈ సమస్యను విదేశ వ్యవహారాల శాఖ అమెరికా దగ్గర లేవనెత్తింది. అయితే కొంత కాలం పాటు అమెరికా నుంచి ఎలాటి స్పందన వ్యక్తం కాలేదు. తర్వాత మరీ వెంటపడిన తర్వాత వారు అన్నదేమంటే ఇందుకు సంబంధించిన కాగితాలు ఇంకా దొరకలేదని! 1980లలో సైనిక ఆపరేషన్ల డైరెక్టర్‌ జనరల్‌గా వున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ హృదయ కౌల్‌ ఈ సంగతి నాకు చెప్పారు.

రేఖా చిత్రంలో దొర్లిన ఈ పొరబాటును ఆధారం చేసుకుని పాకిస్తాన్‌ అధికారులు సియాచిన్‌ హిమఖండంపైకి ఎక్కడానికి లేదా ఆధిరోహణం చేయడానికి విదేశీ పర్వతారోహకులను కూడా గుట్టుగా అనుమతిస్తున్నారనే విషయం మన సైన్యానికి తెలిసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. ఎన్‌జె 9842- కారంకోరం కనుమ- సియా కంగ్రిలతో ఏర్పడిన త్రికోణ ప్రదేశం తనకే చెందుతుందని పాకిస్తాన్‌ సైన్యం తనకు తనే అనుకూలంగా భావించడం మొదలుపెట్టింది. అయితే అది తప్పు అని దానికి బాగా తెలుసు. సాల్ట్రో శ్రేణి ప్రధానంగా షియా ముస్లిములైన బాల్టీ ప్రజానీకానికి లడఖీలకు మధ్యన సంప్రదాయ సరిహద్దుగా వుంటుంది.

సియాచిన్‌ ప్రాంతంలో తన సైనిక,పౌర ఉనికిని ఏర్పాటు చేసుకోవాలన్న పాకిస్తాన్‌ ఉద్దేశాలు భారత్‌కు 1982-83లో తెలిశాయి. అది పర్వతారోహణ లేదా ఇతర సాహస కార్యాల కోసమే కావచ్చు. అయినా భారత సైన్యం ప్రభుత్వ అనుమతి తీసుకుని ముందస్తుగానే చర్య తీసుకుంది. సాల్ట్రో శ్రేణిలో ముఖ్యమైన కనుమలు, ప్రధానమైన శిఖరాలు 1984 ఏప్రిల్‌లో ఆక్రమించింది. ఈ చిన్న పర్వత రేఖ ఎన్‌జె9842 నుంచి ఉత్తరంగా పయనిస్తుంది. దానికి తూర్పున వాస్తవికంగా భారత దేశ ప్రాంతం వుంటుంది. ఈ ఆపరేషన్‌కు మేఘదూత్‌ అని పేరు పెట్టారు. అది 1984 ఏప్రిల్‌13న ప్రారంభమైంది. హెలికాఫ్టర్‌లో జరిగిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యానికి వైమానిక దళం మద్దతు కూడా బాగా లభించింది. ఇన్‌ఫాంట్రీ దళం మొదట బిలాఫోండ్‌లాను సియాలాను ఆక్రమించారు. ఆ సమయంలో ఆలోటీస్‌కు లేదా వాటికి సమానమైన భారతీయ తరహాగా చెప్పదగిన వాటిలోకి ఇద్దరు సైనికులను హెలికాఫ్టర్‌ ద్వారా ప్రవేశపెట్టారు. 18000 అడుగుల ఎత్తులో నడపగల ఏకైక హెలికాఫ్టర్లు చేతాలు మాత్రమే. ఇదొక బ్రహ్మాండమైన విన్యాసం. కేవలం ఒక ప్లాటూన్‌ ఒక కనుమ చేరడానికి ప్రారంభంలోనే యాభై సార్టీలు కావలసి వచ్చాయి.2. ఆ విధంగా భారత దేశం పాకిస్తాన్‌ పథకాలను ఆదిలోనే వెనక్కు కొట్టగలిగింది. ఆ విధంగా తన న్యాయమైన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే గాక ఉత్తర దిశగా వాస్తవాధీన రేఖను పునరుద్ధరించగలిగింది.సాల్ట్రో శ్రేణిలో అన్ని ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశాలలోనూ భారత సైన్యాలు మొహరించబడ్డాయి. పాకిస్తాన్‌ కూడా ఇందుకు సమాధానంగా పశ్చిమ దిశన తక్కువ ఎత్తులో వాలు ప్రదేశాల్లో తన సైన్యాన్ని మొహరించింది. అయితే వారు సియాచిన్‌ హిమఖండంకు దగ్గరగా రాలేకపోయారు.

సాల్ట్రో శ్రేణిని గట్టిగా వశపర్చుకోవడం ద్వారా భారత్‌ సియాచిన్‌ హిమఖండంపై వారు కన్నేయడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది. సియాచిన్‌లో తన సైనికులు పోరాడుతున్నట్టు పాకిస్తాన్‌ తన దేశ ప్రజలకు విదేశాలకు తప్పు దోవ పట్టిస్తుంటుంది. వాస్తవంగా ఇక్కడ పోటీపడేది సల్ట్రో పర్వత శ్రేణి స్వాధీనం కోసం. ఇప్పుడది పూర్తిగా భారత్‌ అధీనంలో వుంది.

1980లు, 1990లలో పాకిస్తాన్‌ సైన్యం ఈ ముఖ్యమైన కనుమలను లేదా శిఖరాలను స్వాధీన పర్చుకోవడానికి అనేక విఫల యత్నాలు చేసింది. మొదటి దాడి 1984 ఏప్రిల్‌25న జరిగింది. పాకిస్తాన్‌ సైన్యాలు నార్త్రన్‌లైట్‌ ఇన్‌ఫాంట్రీ, స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూపునకు(ఎస్‌ఎస్‌జి) చెందిన కమాండోలతో కలసి చేసిన దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది.వారివైపున అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపున 8 జెఅండ్‌కె ఎల్‌ఐ చాలా సాహసోపేతంగా 1987 జూన్‌లో కైద్‌ అనే పాకిస్తానీ పరిశీలన కేంద్రాన్ని వశపర్చుకుంది. అది అన్నిటికన్నా అత్యున్నతమైన ఎత్తులో వుంటుంది. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ 1987 సెప్టెంబరులో ఆపరేషన్‌ ఖియాదత్‌3 జరిపింది. దాంట్లో ఒక ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌, రెండు ఎస్‌ఎస్‌జి కంపెనీలు, టివోడబ్ల్యు మిసిలీలు మందుగుండు మోర్టార్ల సహాయం కూడా తీసుకున్నారు. మంచు మయమైన ఆ ప్రాంతంలో చాలా ఎత్తయిన చోటు గనక పెద్ద ఎత్తున ఆపరేషన్‌ జరపడం అసంభవం.అందువల్లనే బిలాఫాండ్‌ లా కనుమలో కొన్ని స్థానాలు కైవశం చేసుకునేందుకై 1987 సెప్టెంబరు 23-25 తేదీలలో వరుస దాడులు ప్రారంభించారు. పాకిస్తాన్‌ అద్యక్షుడు జనరల్‌ జియా వుల్‌ హక్‌ ఈ బాధ్యతను బ్రిగేడియర్‌ పెర్వేజ్‌ ముషారఫ్‌కు అప్పగించినట్టు భావిస్తారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఖలాపూలో గల ఎస్‌ఎస్‌జి స్థావరం నుంచి దాడులు జరిపే వ్యూహ రచన చేసింది అతనేనంటారు.దాదాపు వందమంది పాకిస్తాన్‌ సైనికాధికారులు ఈ ఆపరేషన్‌లో మరణించారనీ అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారనీ చెబుతారు. చాలా మూర్ఖత్వంతో కూడిన దురుద్దేశిత ఆపరేషన్‌ ఇది.అయితే అదే సమయంలో జూనియర్‌ సైనిక నాయకత్వపు కుర్రకారు సాహసం దీంట్లో వుంటుంది. ఈ వివరాలన్నీ గగుర్పాటు కలిగించే రీతిలో ఫాంగ్స్‌ ఆఫ్‌ ఐస్‌- స్టోరీ ఆఫ్‌ సియాచిన్‌ అన్న పుస్తకంలో పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన కల్నల్‌ ఇసాఫ్‌ ఖాన్‌ గ్రంధస్తం చేశాడు.

అప్పటి నుంచి పాకిస్తాన్‌ సైన్యం సాల్ట్రో శ్రేణిలో ఎలాగైనా కాస్త చోటు సంపాదించాలని బరితెగించి ప్రయత్నిస్తున్నది. అయితే మేము వారి పథకాలన్నిటినీ వమ్ము చేస్తూ వస్తున్నాము. ప్రతిసారీ ప్రాణనష్టం చాలా ఎక్కువగా వుండడంతో చివరకు పాకిస్తాన్‌ సియాచిన్‌లో మన స్థానాలపై దాడికి తీవ్రమైన ప్రయత్నాలు చేయడం విరమించింది. అయితే మందుగుండు కాల్చుకోవడాలు మాత్రం కొనసాగుతుంటాయి. 2003లోవాటిపై కాల్పుల విరమణ కుదిరింది. ఈ క్రమంలో ఇరు వైపులా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి ప్రధానంగా ఎత్తయిన చోటు కావడం వల్ల, హిమపాతాల వల్ల, ప్రమాదాలు ఆరోగ్య కారణాల వల్ల సంభవించిన మరణాలు. అసలు అలాటి చోట సైన్యాన్ని అట్టిపెట్టాలంటేనే చాలా మూల్యం చెల్లించాలి. అయితే సియాచిన్‌ ఇండియా భూభాగమేనన్న వాస్తవం చెదిరిపోదు.సాల్ట్రో శ్రేణి నుంచి ఒక వేళ మనం ఉపసంహరించుకున్నా మనం ఈ ప్రాంతంలో మన భూభాగాన్ని రక్షించుకోవడానికి తగు సంఖ్యలో ఆ వాతావరణాన్నితట్టుకునే సైనికులను సర్వసిద్దంగా అట్టిపెట్టవలసే వుంటుంది.ఈ దళాలను మూల స్థావరంలో కొనసాగించడానికయ్యే ఖర్చులను భరించవలసిందే. అందువల్లఇక్కడ ఎంత ఖర్చు అవుతుందనే అంశానికి ప్రాధాన్యత లేదు. అంతేగాక బాగా ఎత్తయిన ప్రదేశాలో,్ల తీవ్రమైన చలి వల్ల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని కూడా తగు మోతాదుకు తగ్గించగలిగింది భారత్‌.
సియాచిన్‌లో సైన్యాలను వుంచడం వల్ల భారత ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే మన హక్కును ఉపయోగించుకోవడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కూడా కలిగాయి. సాల్ట్రో శ్రేణిని అదుపులో వుంచుకోవడం వల్ల పాకిస్తాన్‌కు కారంకోరం కనుమకు నేరుగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

సియాచిన్‌ సమస్య పరిష్కారం కనుగొనేందుకై గత అనేక సంవత్సరాలలో చర్చలు సమావేశాలు అనేకం జరిగాయి. 1998లో న్యూఢిల్లీలో జరిగిన ఏడవ దఫా చర్చల్లో ఎజిడిఎంవో హౌదాలో సింగ్‌ పాలుపంచుకున్నారు .క్షేత్రస్థాయిలో వున్న వాస్తవాలను మ్యాపులలో గుర్తించేందుకు పాకిస్తాన్‌ ఒప్పుకునేట్టయితే సాల్ట్రో శ్రేణిలో గడ్డకట్టించే ఎత్తుల్లో సైనిక వ్యవహారాలు విరమించేందుకు సిద్ధమేనని చెప్పారు. రెండు దేశాల మధ్య విశ్వాసం కొరవడింది గనకనే ఈ పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌ 1999లో సాగించిన కార్గిల్‌ దుస్సాహసం తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ఇప్పుడున్న క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మ్యాపులపై సంతకాలు చేసి అధికార ముద్ర వేసేందుకు పాకిస్తాన్‌ సిద్ధం కాలేదు. ఆ కారణంగా చర్చలు మొదటిరోజునే ముగిశాయి. 1998లో రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ సియాచిన్‌ వెళ్లారు. చాలాచాలా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిన కొద్ది మంది మంత్రుల్లోఆయన ఒకరు. ఆయన సహకారంతో అక్కడ మొహరించే సైనికుల పరిస్థితులు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు మెరుగుపర్చారు.

ఆ తర్వాత 2003 నవంబరులో రెండు పక్షాలూ సియాచిన్‌ ప్రాంతంలో ఎజిపిఎల్‌ను పొడగించాలని అంగీకారానికి వచ్చాయి. అప్పటి నుంచి ఈ సంధి అమలవుతున్నది.

2005 జూన్‌ 12న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వెంట సియాచిన్‌ హిమఖండం వెళ్లారు. దాన్ని సందర్శించిన మొదటి ప్రధాని అయ్యారు. శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. దాన్ని ‘శాంతి పర్వతం’గాచేయాలన్నారు. 2014 అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోడీ సియాచిన్‌లో దీపావళి జరుపుకొన్నారు. మీరు అప్రమత్తంగా వుండటం వల్లనే మేము భద్రంగా వున్నామని చెప్పారు..

ఎప్పుడుఏ ఒప్పందం కుదిరి సైన్యాలను వెనక్కు రప్పించినా పున: మోహరింపు తలపెట్టినా అది దశల వారీగా జరగాలి. దానివల్ల ఏ పక్షానికి అనుచితమైన అనుకూలత ఏర్పడకూడదు.వెళ్లిపోయిన దళాలు ఖాళీ చేసిన ప్రదేశాల్లోకి వీరు వెళ్లి కూచునే అవకాశం వుండకూడదు. ఇది నా దృఢమైన అభిప్రాయం. ఇలాటి ఒప్పందాన్ని ఏ పక్షం ఉల్లంఘించినా మరోపక్షం యథాతథస్థితిని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వాలి.1989లో రెండు సైన్యాలు వెనక్కు వెళ్లిపోయి ఉపసంహరణ ప్రాంతం సృష్టించాలంటూ కుదిరిన ఒప్పందం ఎన్నడూ వెలుగు చూడలేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే పాకిస్తాన్‌ క్షేత్రస్థాయిలో తన వాస్తవ పరిస్థితిని వెల్లడించేందుకు ఎన్నడూ సిద్ధం కాలేదు. అది అలా వెల్లడించి ఒప్పందం గనక కుదిరివుంటే అది భారత దళాలకు అననుకూలతగా తయారయ్యేది.ఇందుకు కారణాలేమిటో పైన చర్చించాము. ఇందుకు సంబంధించి చెప్పాలంటే సియాచిన్‌ హిమఖండంలో ఆపరేషన్లలో వున్న లోతుపాతులు కొందరు జర్నలిస్టులు వ్యూహకర్తలు సరిగ్గా గ్రహించలేకపోయారని నా అభిప్రాయం. అంతేగాక ఘర్షణను అంతమొందించే కోణంలో చూసినప్పుడు సుదీర్ఘ కాలం ప్రభావం చూపే కొన్ని రాజకీయ అనివార్యతలను కూడా పరిగణనలోకి తీసుకోలేదే. ఈవిషయమై లెఫ్టినెంట్‌జనరల్‌ వివిరాఘవన్‌ బాగా రాశారు.’ భారతీయులు పాకిస్తానీలు ఇరు దేశాల రాజకీయ సైనిక నాయకులకు ఉద్దేశాలు ఒత్తిళ్లు ఆపాదించారు. అది వాస్తవమేనా? ఖచ్చితంగా చెప్పాలంటే భారత దేశం వైపు నుంచి ఏ ప్రధాన మంత్రికూడా ప్రజలూ పార్లమెంటూ అసమానమైందిగా పరిగణించే పరిష్కారానికి అంగీకరించబోరు’
ప్రాథమికంగానే పాకిస్తాన్‌ చెప్పే పొందికను బలపర్చే ఎలాటి తర్కం లేదు. కొన్ని మ్యాపులలో ఎన్‌జె9842 నుంచి కారంకోరం కనుమ వరకూ అన్నట్టు చూపించడం పొరబాటు. ఈ దూరం సుమారు 80 కిలోమీటర్లుంటుంది. ఈ అమరిక ఉత్తరంగానూ పోవడం లేదు, కారంకోరం కనుమ నుంచి ఏ హిమఖండం మొదలు కావడం లేదు. ఇరుదేశాల ఒప్పందం ఎలాటి సందేహాలకు తావు లేకుండా ఎన్‌జె9843 .. ఇక్కడి నుంచిఉత్తరంగా వున్న హిమఖండాలు అని పేర్కొంటున్నది. పై మ్యాపుల ప్రకారం చేసే వాదన ఈ వాస్తవాన్ని బూటకంగా మార్చేస్తుంది. అందుకనే సాల్ట్రో ప్రాంతంలో భారత దేశం శాశ్వతంగా తనసైనిక ఉనికిని కొనసాగించవలసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close