‘రాజకీయాల్లోకి వస్తా.. వస్తా’అని ఊరించి, ఊరించి… చివరికి ఉస్సూరుమనిపించారు రజనీకాంత్. వయోభారం రీత్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఓ ట్విస్ట్ ఇచ్చి, మెల్లగా జారుకొన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం ఆయన చేసిన చారిత్రక తప్పిదం అంటూ ఓ వర్గం భావిస్తుంటుంది. మరికొందరైతే ‘వచ్చి కూడా చేసేదేం ఉండదం’టూ లైట్ తీసుకొంది. ఫ్యాన్స్ మాత్రం ఆయన ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తారంటూ ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా సైడ్ అయిపోవడం వెనుక తన ఉద్దేశ్యాలేంటో రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
“నాన్నగారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా, అందుకు కుటుంబ సభ్యులుగా మేమంతా సపోర్ట్ చేస్తాం. ఆయన వెన్నంటే ఉంటాం. నాన్నగారు రాజకీయాల్లోకి రాకపోవడం రిగ్రేట్ అనిపించలేదు. అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయం”అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడ్డానికి మాత్రం ఆమె నిరాకరించారు. సౌందర్య నిర్మించిన తమిళ చిత్రం ‘విత్ లవ్` ఈ ఫిబ్రవరి 6న తెలుగులో విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సౌందర్య హైదరాబాద్ వచ్చారు. రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని, దానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుతోంది. దీనిపై కూడా ఆమె స్పందించారు. ”నాన్నగారు, కమల్ సార్ కలిసి ఓ సినిమా చేయాలనుకొంటున్నారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దర్శకుడు ఎవరన్నది నిర్మాతలే ప్రకటిస్తార”న్నారు.
