జనసేనవారి ప్రత్యేక హోదా టీ షర్టులు,టోపీలు..!

‘ఒక మహా య‌జ్ఞానికి మొదలు ఏంటి గురువుగారూ’ అంటూ వెనకటికి ఓ శిష్యుడు ప్రశ్నించాట. ‘ఏముందిరా.. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చెయ్ చాలు’ అన్నాడట. ఈ పోలిక ఇప్పుడెందుకు అనేది తరువాత చూద్దాం. ఆంధ్రాకి కేంద్రం చేసిన అన్యాయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా జె.ఎఫ్.సి. ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య కేటాయింపుల లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కలు తేలాక రాష్ట్ర హక్కుల సాధనకు ఉద్యమం అంటున్నారు. ప్రత్యేక హోదా అంశంపై పోరాటం మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. దీన్లో భాగంగా యువతను ఉత్తేజపరచడానికి జనసేన సిద్ధమౌతోంది. దీని కోసం ప్రత్యేకమైన టీ షర్టులు,టోపీలు తయారీ పనిలో ఉంది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదం ముద్రించిన టీషర్టులను కాలేజీల్లో పంచాలని భావిస్తున్నారు.

భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో వీటిని సిద్ధం చేస్తున్నారు. ఉద్యమానికి సంబందించిన మరికొన్ని వ్యూహాలను కూడా ఈ యూనియన్ తయారు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ ఉద్యమానికి కూడా జనసేన సిద్ధమౌతోంది. ఆ బాధ్యతల్ని శతఘ్ని టీమ్ కు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో జనసేన చేపట్టబోయే ఉద్యమానికి యువతను సన్నద్ధం చేయడం కోసం, వారి భాగస్వామ్యి పెంచడం కోసమే ఈ వినూత్న ఆలోచన చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమానికి సోషల్ మీడియాను కీలకమైన వేదికగా మలచుకునే క్రమంలో ఉన్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయిగానీ.. వీటికంటే ముందు జనసేన స్పష్టత ఇవ్వాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇంతకీ ప్రత్యేక హోదా విషయమై జనసేన పోరాటం ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది కదా. ఓపక్క లెక్కలు తేల్చే పనిలో భాగంగా నిపుణులు, మేధావులు, రాజకీయ రంగ ప్రముఖులతో ఒక కమిటీ వేశారు. ఆ లెక్కలు తేలిన తరువాత కార్యాచరణ ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. ఆ తరువాత టోపీలూ టీషర్టులూ వంటివి ఎన్ని తయారు చేసినా అర్థవంతంగా ఉంటుంది. ముందుగా, జనసేన కార్యాచరణ ఏంటనేది స్పష్టత వచ్చాక.. ఇలాంటివన్నీ విడుదల చేసుకుంటే విమర్శలకు ఆస్కారం ఉండదు. లేదంటే, అసలు పనులు వదిలేసి, కొసరు పనులకు జనసేన ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.