ఆయ‌న చేరితే కాంగ్రెస్ లో గ్రూపులు పెరుగుతాయ‌ట‌..!

సీనియ‌ర్ నేత నాగం జ‌నార్థ‌న్ రెడ్డి త్వ‌ర‌లో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసి వ‌చ్చారు. దీంతో ఆయ‌న చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ వచ్చింద‌నే క‌థ‌నాలు గుప్పుమ‌న్నాయి. నిజానికి, ఉగాది త‌రువాత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పినా… కాంగ్రెస్ నేత‌లు బ‌స్సుయాత్ర ప్రారంభించేలోగానే ఆయ‌న కండువా మార్చేస్తార‌నే అభిప్రాయం వ్య‌క్తమౌతోంది. అయితే, ఇప్పుడు నాగం చేరిక విష‌య‌మై టి. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆయ‌న్ని పార్టీలో చేర్చుకుంటే స‌హించ‌బోమనీ, గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోతాయంటూ ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి మండిప‌డుతున్నారు.

కేడర్ లేని లీడ‌ర్ నాగం అంటూ ఎమ్మెల్సీ దామోద‌ర్ విమ‌ర్శించారు. ఇలాంటి నాయ‌కుడిని పార్టీ త‌ర‌ఫున ఎక్క‌డ నిల‌బెట్టినా ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. నాగంను పార్టీలో చేర్చుకుంటే స‌హించే ప‌రిస్థితి లేద‌న్నారు. ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి వివ‌రించి వ‌చ్చామ‌న్నారు. నాగంను చేర్చుకోవ‌డంల్ల పాల‌మూరు రాజ‌కీయాల‌తోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ లో కూడా విభేదాలు పెరుగుతాయ‌ని రాహుల్ చెప్పిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో నాగం టీడీపీలో ఉన్న‌ప్పుడు దామోద‌ర్ కు చెందిన అనుచ‌రుల‌పై కేసులు బ‌నాయించార‌నీ, ఇప్ప‌టికీ వాటి కోసం కోర్టుల చుట్టూ చాలామంది తిరుగుతున్న ప‌రిస్థితి ఉంద‌నేది ఆయ‌న వాద‌న‌. అంతేకాదు, ఇంత చెప్పిన త‌రువాత కూడా ఆయ‌న్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే భ‌విష్య‌త్తులో స‌హ‌క‌రించే అవ‌కాశం లేద‌ని కూడా దామోద‌ర్ స్ప‌ష్టంగా చెబుతున్నారు.

అయితే, నాగం చేరిక‌ను పార్టీలో ఒక గ్రూప్ కావాల‌నే ప్రోత్స‌హిస్తోంద‌నే వాద‌న ఈ సంద‌ర్భంగా వినిపిస్తూ ఉండ‌టం విశేషం. నాగం జ‌నార్థ‌న్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి వీరంతా ఒక వ‌ర్గంగా క‌నిపిస్తున్నారు. జైపాల్ కీల‌క పాత్ర పోషించ‌డంతోనే నాగం పార్టీలోకి వ‌స్తున్న‌ట్టు వినిపిస్తోంది. దామోద‌ర్ రెడ్డి, డీకే అరుణ వంటివారు మ‌రో వ‌ర్గంగా క‌నిపిస్తోంది. పాల‌మూరులో ఈ వ‌ర్గానికి చెక్ పెట్టేందుకే నాగంను పార్టీలోకి తెస్తున్నార‌నే వాద‌న ఈ నాయ‌కుల నుంచి వినిపిస్తోంది. హైక‌మాండ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా, నాగం చేరిక‌ను దామోద‌ర్ వ్య‌తిరేకిస్తూ ఉండ‌టం విశేషం! మ‌రి, ఈ వ‌ర్గాల‌ను బుజ్జించే పెద్ద‌న్న పాత్ర ఎవ‌రు తీసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.