టీడీపీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ !

ఆకలితో ఉన్న పెద్దపులి జింకల్ని వేటాడినట్టుగా తెలుగు దేశం పార్టీని తెరాస టార్గెట్ చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను నయానా భయానా లొంగదీసుకుని గులాబీ కండువా కప్పుతోంది. నైతిక విలువలను మాత్రం పట్టించుకోవం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటి దేశంలో అమల్లో ఉంది. అందులో కొన్ని లొసుగులు ఉంటే ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ, లేదా ప్రాంతీయ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన చట్టసభ సభ్యులు మరోపార్టీలోకి ఫిరాయిస్తే ఆ సభ్యత్వం రద్దవుతుంది. స్పీకర్ ద్వారా ఈ విషయం ఎన్నికల కమిషన్ కు వెళ్తుంది. అయితే, స్పీకర్ విచక్షణ అనే కారణంగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారెవరి సభ్యత్వమూ రద్దు కాలేదు. అసలు, వారు రాజీనామా చేసిన తర్వాతే గులాబీ కండువా కప్పుకోవాలని కేసీఆర్ సత్సంప్రదాయాన్ని పాటించి ఉంటే బాగుండేది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ లేకుండా చేయాలనేది కేసీఆర్ పంతంగా కనిపిస్తోంది. బలమైన కేడర్ ఉన్న టీడీపీతో చిక్కేనని ఆయన భావిస్తున్నారట. అందుకే, ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అయినాసరే, టీడీపీకి ఇప్పటికీ కేడర్ బలంగానే ఉంది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు కూడా డీలా పడ్టారు. రాజీ ధోరణిని అవలంబిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బాబు ప్రచారాన్ని గమనిస్తే, ఆయన సీరియస్ గా తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత, ఒకప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కావడం కొన్ని రాష్ట్రాల్లో కనిపించిన సహజ పరిణామం. యూపీ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్ ఏర్పడింది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ గానీ, బీఎస్పీ గానీ ఉత్తరాఖండ్ లో బలంగా లేవు. అక్కడ కాంగ్రెస్, బీజేపీలే ప్రధాన పార్టీలు. బీహార్ నుంచి విడిపోయి ఏర్పడిన జార్ఖండ్ లోనూ అంతే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అసలు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉనికి నామమాత్రమైంది. ముక్కలు చెక్కలైంది. అలాగే, బీహార్లో బలంగా ఉన్న ఆర్జేడీ, జేడీయూలు కూడా జార్ఖండ్ లో నామమాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే అక్కడ ప్రధాన పార్టీలు. ఏపీ నుంచి విడిపోయి ఏర్పడిన తెలంగాణలోనూ మొదట్లో టీడీపీ బలంగానే ఉండేది. తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో సీన్ మారిపోయింది. తాజాగా కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాదులో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఒకరిద్దరు మినహా టీడీపీ వారినందరినీ కారెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సైకిల్ పార్టీ నామమాత్రం అవుతుందేమో. ఇక 2019 ఎన్నికలు ఏపక్షంగా మారాలనేది తెరాస ఉద్దేశం కావచ్చు. అది నెరవేరుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com