ఇష్టం వచ్చినట్లుగా బూతులతో విరుచుకుపడుతున్న మరో నేత ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. విజయవాడ ఇబ్రహీం పట్నం లో ఉన్న జోగి రమేష్ ఇంటిపై హఠాత్తుగా కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇంటిపై రాళ్ళు రువ్వి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఉద్దేశపూర్వకంగా నారా లోకేష్ పై అత్యంత నీచమైన భాషను జోగి రమేష్ ప్రయోగించడంతో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల కార్యకర్తలు ఆవేశానికి గురవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి ఘటనలో కూడా జోగి రమేష్ పేరు ఉండటం, ప్రస్తుతం లోకేష్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ దాడికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
జోగి రమేష్ బూతులు మాట్లాడి, చంద్రబాబు ఇంటిపై దాడి చేసి మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మారడం లేదు. ప్రభుత్వంపై నకిలీ మద్యం కుట్ర చేసి దొరికిపోయారు. జైలుకెళ్లి విడుదలైన రోజు నుంచే మళ్లీ బూతులందుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు ఇంటిపై దాడి చేశారు.


